ఆహార కోరికలకు కళ్లెం వేద్దాం
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:39 AM
కొన్నిసార్లు తీపి మీదకు మనసు లాగుతుంది. ఇంకొన్నిసార్లు పులపుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఆకలితో సంబంధం లేకుండా తలెత్తే ఇలాంటి ఆహార కోరికలకు పోషక లోపాలు...
అలవాట్లు - పొరపాట్లు
కొన్నిసార్లు తీపి మీదకు మనసు లాగుతుంది. ఇంకొన్నిసార్లు పులపుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఆకలితో సంబంధం లేకుండా తలెత్తే ఇలాంటి ఆహార కోరికలకు పోషక లోపాలు కారణమంటున్నారు పోషకాహార నిపుణులు. పదార్థాల పట్ల ఆపేక్షల వెనకుండే మతలబుల గురించి తెలుసుకుందాం!
భోజనం తిన్న వెంటనే తీపి తినాలనిపిస్తోందా? అర్థరాత్రి ఉప్పటి స్నాక్స్ మీదకు మనసు మళ్లుతోందా? లేదంటే చీజ్ పిజ్జాలూ, పన్నీర్ పకోడీలను లాగించేయాలనిపిస్తోందా? ఈ కోరికలు పూర్తిగా మానసికమైనవి కాకపోవచ్చు. వీటి వెనక భౌతిక, పోషణపరమైన కారణాలు కూడా ఉంటాయి. వీటి గురించిన అవగాహన లోపంతో తినాలనిపించినవన్నీ తినేస్తూ ఉంటే, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరిపోయి ఊబకాయంతో పాటు, సంబంధిత ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం! కాబట్టి ఆహార కోరికల్లో రకాలతో పాటు అవెందుకు కలుగుతాయో, వాటితో ఎలా వ్యవహరించాలో, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం అవసరం.
ఆహార కోరికలు శరీరం అందించే సూచనలు. ఈ కోరికలు పోషక లోపాలు, భావోద్వేగాలు, అలవాట్లకు మూలాలు. కాబట్టి తినాలనే కోరికలను అర్థం చేసుకుని, ఆరోగ్యకరమైన మార్గంలో వాటిని సంతృప్తి పరుచుకోగలిగితే పోషక లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. నిజానికి పదార్థాలు తినాలనే కోరికలు చెడ్డవేమీ కావు. పోషక లోపాలను గ్రహించి సరిదిద్దుకునే వీలు కల్పించే సాధనాలుగా వాటిని భావించాలి. నిరంతర అలవాట్లు, క్రమేపీ మార్పులతో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఆస్వాదించగలుగుతాం!
తీపి కోరికల కారణాలు
ఎదురుగా ఎన్ని పదార్థాలున్నా తీయగా ఏదైనా తినాలనిపిస్తే, అందుకు కారణాల కోసం అన్వేషించాలి. ఈ కోరిక వెనకుండే ప్రధాన కారణాలు ఏవంటే...
రక్తంలో చక్కెల మోతాదుల్లో హెచ్చుతగ్గులు
మానసిక సంతృప్తి లేదా ఒత్తిడి నుంచి ఉపశమనం
నిద్ర లేమి
మెగ్నీషియం లేదా క్రోమియం లోపం
ప్రత్యామ్నాయాలు ఇవే!
తాజా పండ్లు
డార్క్ చాక్లెట్ (70ు+ కోకో)
దాల్చిన చెక్క టీ
నట్ బటర్, ఓట్స్‌తో చేసిన స్మూతీలు
ఉప్పని స్నాక్స్
కోరిక వెనక
బంగాళాదుంప చిప్స్, సాల్టెడ్ పీనట్స్ లాంటి ఉప్పని స్నాక్స్ తినాలనిపిస్తే ఒంట్లో ఖనిజలవణాలు లోపించాయని అర్థం.
డీహైడ్రేషన్ లేదా ఎలకో్ట్రలైట్ అసమతుల్యత
ఒత్తిడి
అడ్రినల్ ఫెటీగ్
ప్రత్యామ్నాయాలు ఇవే!
పింక్ సాల్ట్ కలిపి వేయించిన నట్స్
ఉప్పు కలిపిన కొబ్బరి నీరు
వేయించిన శనగలు లేదా మఖ్‌నా
మాంసాహార
కోరిక కు కారణాలు
చికెన్, మటన్, చేపలు... ఇలా తరచూ మాంసాహారం తినాలనిపిస్తుంటే...
ప్రోటీన్ లేదా ఐరన్ లోపం
విటమిన్ బి 12 లోపం
గర్భం లేదా అధిక శారీరక శ్రమ
ప్రత్యామ్నాయాలు ఇవే!
లేత మాంసం
ఉడకబెట్టిన గుడ్లు, గ్రిల్ చేసిన చేపలు
మొలకలు, పప్పుధాన్యాలు, టోఫు, ఫోర్టిఫైడ్ ఆహారపదార్థాలు
ఆరోగ్యకరమైన ఆహారం మీద మక్కువ పెరిగేదెలా?
ఫ క్రమేపీ అలవాటు చేసుకోవాలి: అనారోగ్యకరమైన పదార్థాల స్థానాన్ని ఆరోగ్యకరమైన పదార్థాలతో అంచెలవారీగా భర్తీ చేస్తూ ఉండాలి
మనసు పెట్టాలి: తినాలనే కోరికను భావోద్వేగాలు ప్రభావితం చేస్తున్నాయా? లేదంటే భౌతిక ఆకలితోనే తినాలనే కోరిక కలిగిందా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తినే సమయంలో ఇంద్రియాలకు పని పెట్టాలి
సమతులాహారం: భోజనంలో మాంసకృత్తులు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోవాలి
సంతృప్తినిచ్చే మార్గాలు: ఆహారంతో సంబంధం లేని నడక, సంగీతం వినడం, అభిరుచులను సాధన చేయడం లాంటి అలవాట్లు అలవరుచుకోవాలి
లోపాలను సరిదిద్దుకోవాలి: పోషకాహార లోపాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, శరీరంలో కొరవడిన ఖనిజ లవణాలు, విటమిన్లను భర్తీ చేసుకోవాలి
పేగుల ఆరోగ్యం కీలకం: పులిసిన పదార్థాలు, పీచు ఎక్కువగా ఉండే కూరగాయలకు ప్రాథాన్యం ఇవ్వాలి
సరిపడా నీరు: శరీరంలో నీటి పరిమాణం తగ్గకుండా చూసుకోవాలి.
పుల్లటివి తినాలనిపిస్తే...
గర్భిణులకే కాదు అప్పుడప్పుడూ అందరికీ పులుపు తినాలనిపిస్తుంది. ఎందుకంటే...
జీర్ణ వ్యవస్థ సమస్యలు
విటమిన్ సి లోపం
గర్భధారణ సంబంధిత హార్మోన్లలో మార్పులు
ప్రత్యామ్నాయాలు ఇవే!
నిమ్మరసం
ఉసిరి జ్యూస్ లేదా పుల్లని క్యాండీ
పెరుగు వంటి పులిసిన పదార్థాలు
చేదు, కారం కోరికకు కారణాలు
అరుదుగా చేదు, కారాల మీదకు కూడా మనసు మళ్లుతుంది. అలా ఎందుకంటే...
జీర్ణ సంబంధ ప్రేరకం కోసం...
కాలేయం విషాలను వదిలించుకోవడం కోసం
ప్రత్యామ్నాయాలు ఇవే!
మెంతులు. కూరల్లో మెంతిపిండి చల్లుకుని తినాలి
కాకరకాయ కూరలు, వేపుళ్లు తినొచ్చు
హెర్బల్ టీ

డాక్టర్ అడ్డు కిరణ్మయి
సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి