స్థితప్రజ్ఞుడు ఎవరు?
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:05 AM
‘‘స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు?’’ అనే అర్జునుడి ప్రశ్నకు, దానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వివరణకు భగవద్గీతలో ఎంతో ప్రాధాన్యత ఉంది....

గీతాసారం
‘‘స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు?’’ అనే అర్జునుడి ప్రశ్నకు, దానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వివరణకు భగవద్గీతలో ఎంతో ప్రాధాన్యత ఉంది. స్థితప్రజ్ఞుడు తన పట్ల తాను సంతృప్తితో ఉంటాడని చెప్పిన కృష్ణుడు... స్థితప్రజ్ఞత కలిగినవారు ఎలా మాట్లాడతారు, కూర్చుంటారు, నడుస్తారు? అనే సందేహంపై స్పందించలేదు.పరిస్థితులను బట్టి అజ్ఞాని, స్థితప్రజ్ఞుడు... ఈ ఇద్దరూ ఒకే మాటలు మాట్లాడవచ్చు, ఒకే రీతిలో కూర్చోవచ్చు, నడవవచ్చు. ‘స్వయంతో (తనతో) సంతృప్తి’ అనేది పూర్తిగా అంతర్గతంగా జరిగే విషయం. బాహ్య ప్రవర్తన కారణంగా దాన్ని కొలవడానికి అవకాశం లేదు. ఇది స్థితప్రజ్ఞత గురించి మనకున్న అవగాహనను మరింత క్లిష్టతరం చేస్తుంది. మరి ఇది ఎలా తెలుసుకోవాలి?
శ్రీకృష్ణుని జీవితం స్థితప్రజ్ఞత కలిగిన జీవితానికి ఉత్తమమైన ఉదాహరణ. ఆయన పుట్టినప్పుడే తల్లితండ్రుల నుంచి విడిపోయాడు. ఆయనను ‘వెన్న దొంగ’ అని పిలిచేవారు. ఆయన శృంగారం, నృత్యం, వేణుగానం... ఇవన్నీ ఆయన కథలో ఉన్నాయి. కానీ బృందావనాన్ని విడిచిపెట్టాక శృంగారాన్ని కోరుతూ తిరిగి రాలేదు. అవసరమైనప్పుడు పోరాడాడు. శత్రువులను చంపాడు. కానీ కొన్ని సమయాల్లో యుద్ధానికి దూరంగా ఉన్నాడు. అందుకే ఆయనను ‘యుద్ధం నుంచి పారిపోయే వ్యక్తి’ అని కూడా అన్నారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. స్నేహితులకు స్నేహితుడు. తనకు దొంగతనం అంటగట్టినప్పుడు, ఆ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టడానికి... శమంతకమణి జాడను కనిపెట్టాడు. గీతాజ్ఞానాన్ని ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో అర్జునుడిద్వారా అందించాడు.
గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... బయటికి కనిపించే ఆయన జీవితం ఒక క్రమపద్ధతిలో ఉన్నట్టు అనిపించదు. కానీ ఆంతరంగికంగా ఆయన ఎప్పుడూ వర్తమానంలోనే జీవించాడు. అనేక ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పటికీ... ఆయన జీవితం నిరంతరం ఉత్సాహంగా, ఆనందమయంగా సాగింది. ‘స్వయంతో సంతృప్తి’ అంటే క్రియాశూన్యత కాదు. కర్తృత్వ భావన అంటే ‘చేసేవాడిని నేనే’ అనే భావన లేకుండా, కర్మ ఫలాలను ఆశించకుండా కర్మలు నిర్వహించడం. అంటే... గతం తాలూకు భారాన్ని మోయకుండా, భవిష్యత్తు గురించి ఆశ పెంచుకోకుండా వర్తమానంలో జీవించడం. శ్రీకృష్ణుడు తన జీవితం ద్వారా స్థితప్రజ్ఞుడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూపించాడు.
కె. శివప్రసాద్
Also Read:
బియ్యం నీటిని పారేస్తున్నారా.. వాటితో అద్భుత ప్రయోజనాలు..
అబ్బాయిలూ ఈ టిప్స్ పాటిస్తే అమ్మాయిలు ఫిదా ..