Temple Construction: ఆలయం ఎక్కడ నిర్మించాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:25 AM
విశ్వకర్మలుగా పేర్కొనే స్థపతి, వర్ధకి, తక్షకుడు, సూత్రగ్రాహి... పవిత్రమైన యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి హోమ కుండాలను, యజ్ఞ మండపాలను, హోమానికి కావలసిన యజ్ఞపాత్రలు, సృక్, సృవం...
తెలుసుకుందాం
విశ్వకర్మలుగా పేర్కొనే స్థపతి, వర్ధకి, తక్షకుడు, సూత్రగ్రాహి... పవిత్రమైన యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి హోమ కుండాలను, యజ్ఞ మండపాలను, హోమానికి కావలసిన యజ్ఞపాత్రలు, సృక్, సృవం లాంటివి తయారుచేసి ఇస్తారు. ఆలయ ఆరాధనలో భాగమైన పూజా పాత్రలు, అభిషేక పాత్రలు, గంటలు, దేవుణ్ణి ఊరేగించే పల్లకి, వాహనాలు, రథాలు తదితరాలు తయారు చేసేది వీరే. వీరి పరంపర చాలా గొప్పది. వారి తపోబలంతో నిర్మితమైనవే... నేటికీ పూజలందుకొంటున్న ప్రాచీన ఆలయాలు.
ఆలయ నిర్మాణాల విషయానికి వస్తే... నిర్దిష్టమైన (శాస్త్రాల్లో పేర్కొన్న) కొలతలతో నిర్మితమైన ఆలయం మాత్రమే శుభాలను ఇస్తుందని, ఆ ప్రకారం లేకపోతే అంతులేని ఆపదలు తెస్తుందని, దేశ ప్రజలకు అపకారం కలుగజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... సలక్షణంగా కట్టిన ఆలయమే దేవునికి ఆవాసం అవుతుందని ‘విశ్వకర్మీయం’ గ్రంథం వెల్లడిస్తోంది. అందులో ప్రతిష్ఠించే విగ్రహాన్ని స్థపతి పర్యవేక్షణలోనే తయారు చేయించాలి. కొలతలన్నీ సక్రమంగా ఉండి, రూపలావణ్యాలు కలిగిన విగ్రహాలలోనే దేవుడు కొలువై ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ‘మానవ నిర్మితే బింబే స్వయం ఆభాతి దైవతం... నిర్ణీతమైన కొలతలతో నిర్మించిన విగ్రహాలలో భగవంతుడు స్వయంవ్యక్తమవుతాడు’ అని ‘మకుటాగమం’ చెబుతోంది. అందుకే స్థపతి లేకుండా దేవాలయ నిర్మాణాలలో ఏ కార్యక్రమం జరగదు. శంఖుస్థాపన నుంచి మహా కుంభాభిషేకం వరకూ స్థపతి పర్యవేక్షణలోనే జరగాలి.
ఆలయాలను ఎలాంటి ప్రదేశాలలో నిర్మించాలి? దీని గురించి శిల్ప, ఆగమ గ్రంథాలు అనేక ప్రదేశాలను నిర్దేశించాయి. వాటి ప్రకారం... భగవంతుడికి ప్రీతికరమైన ప్రదేశాలైన ఉద్యానవనాలు, నదీ తీరాలు, నదీ సంగమ ప్రదేశాలు, పర్వతాలు, సిద్ధులు తపస్సు ఆచరించిన ప్రదేశాలు తదితర ప్రకృతి రమణీయ ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించాలి. అలాంటి ప్రదేశాల్లో దేవాలయాలను నిర్మించడం వల్ల... ఆ ప్రాంతం సౌందర్యం, ప్రకృతి రమణీయత వల్ల మానవునిలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దైవం మీద మనస్సు లగ్నం అవుతుంది. అద్వితీయమైన, అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.
నిర్మించిన ప్రదేశాన్ని బట్టి ఆలయం ఉత్తమం అవుతుందా? ఈ ప్రశ్నకు ‘శిల్ప సంగ్రహం’ గ్రంథంలో సమాధానం దొరుకుతుంది.
ఉత్తమం పర్వతాగ్రేషు మధ్యమం వనరాజిషు
అధమంతు నదీతీరే గ్రామాదీష్వధమాధమమ్
భావం: పర్వతం పైభాగంలో నిర్మించిన ఆలయాలు ఉత్తమమైనవి. అడవులలో, వనాలలో నిర్మించినవి మధ్యమమైనవి. నదుల ఒడ్డున ఉన్నవి అధమమైనవి (సామాన్యమైనవి). గ్రామాల మధ్య ఉన్నవి అన్నిటికన్నా అధమమైనవి.
దగ్గుపాటి నాగవరప్రసాద్ స్థపతి
9440525788
ఇవి కూడా చదవండి
ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..
రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..