Share News

Health Supplements: సప్లిమెంట్లు ఎప్పుడు

ABN , Publish Date - Dec 23 , 2025 | 02:13 AM

కొవిడ్‌ తర్వాత పోషకాల పట్ల అవగాహన పెరిగింది. ఇది ఒకందుకు మంచిదే! అయితే అవసరం ఉన్నా, లేకపోయినా ‘హెల్త్‌ సప్లిమెంట్లు’ వాడేసే ధోరణితో ఆరోగ్యం కుదేలయ్యే ప్రమాదం లేకపోలేదు....

Health Supplements: సప్లిమెంట్లు ఎప్పుడు

తెలుసుకుందాం

కొవిడ్‌ తర్వాత పోషకాల పట్ల అవగాహన పెరిగింది. ఇది ఒకందుకు మంచిదే! అయితే అవసరం ఉన్నా, లేకపోయినా ‘హెల్త్‌ సప్లిమెంట్లు’ వాడేసే ధోరణితో ఆరోగ్యం కుదేలయ్యే ప్రమాదం లేకపోలేదు.

సమతులాహారం తీసుకుంటే శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి. ఇలాంటి ఆహారం తీసుకునే ఆరోగ్యకరమైన వ్యక్తులకు అదనపు పోషకాల అవసరం ఉండదు. కానీ కొంతమంది కాస్త నీరసంగా అనిపించగానే బీ కాంప్లెక్స్‌ మింగేస్తూ ఉంటారు. ఇంకొందరు మోకాళ్లు నొప్పి పెడితే, క్యాల్షియం తగ్గిందని ఆ సప్లిమెంట్లు వాడేస్తూ ఉంటారు. చర్మం మెరుపు కోసం విటమిన్‌ ఇ క్యాప్స్యూల్స్‌, నిస్సత్తువను వదిలించడం కోసం ఐరన్‌ మాత్రలు... ఇలా వైద్యుల ప్రమేయం లేకుండా మెడికల్‌ షాపులో దొరికే హెల్త్‌ సప్లిమెంట్లను విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటాం. ఈ అలవాటుతో మేలు కంటే కీడే ఎక్కువ.

హెల్త్‌ సప్లిమెంట్లు ఎవరికంటే...

పెద్దలు, దీర్ఘకాలం పాటు మంచానికే పరిమితమైనవాళ్లు, కొన్ని రకాల జబ్బుల కారణంగా విటమిన్ల శోషణ శక్తి కోల్పోయిన రోగులు, బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవాళ్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే ఎంచుకుని తినేవాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, తల్లి పాలు మానేసిన తర్వాత కేవలం పోత పాల మీదే ఆఽధారపడే పిల్లలు... వీళ్లందరికీ అదనపు పోషకాలు అవసరమవుతాయి.

వీటితో ప్రమాదం ఎక్కువ

తగు పరిమాణాల్లో విటమిన్లు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుందో, ఎక్కువ పరిమాణాల్లో కొన్ని విటమిన్లు తీసుకోవటం వల్ల అంతకంటే రెట్టింపు ప్రమాదమూ ఉంటుంది. కొన్ని విటమిన్లు నీళ్లలో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటే, ఇంకొన్ని కొవ్వులో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. బికాంప్లెక్స్‌ (బి1, బి2, బి6, బి12), విటమిన్‌ సిలు నీటిలో కరిగే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకున్నా అవి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఎ, డి, ఇ, కె విటమిన్లు ఫ్యాట్‌ సాల్యుబుల్‌. ఇవి శరీరంలోని కొవ్వులో చేరి అక్కడే నిల్వ ఉండిపోతాయి. అవసరం లేకపోయినా వీటిని తీసుకుంటే కొంత పరిధి దాటాక శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. ఫ్యాట్‌ సాల్యుబుల్‌ విటమిన్లు అవసరానికి మించి శరీరంలో చేరుకుంటే రక్తంలో క్యాల్షియం స్థాయిలు పెరిగిపోతాయు.


ఏ మోతాదుల్లో....

  • బి కాంప్లెక్స్‌: బి కాంప్లెక్స్‌లో బి1, బి2, బి6, బి12 అనే ఎన్నో రకాల వర్గాలున్నాయి. వైద్యులు సూచించే ఈ బికాంప్లెక్స్‌ పరిమాణం, తీసుకునే ఆహారంలో పొందే బి విటమిన్లతో సమానంగా ఉంటుంది. అంటే ఆహారం ద్వారా 50ు బి విటమిన్లు అందితే, మిగతా 50 శాతాన్ని వైద్యులు మందులతో భర్తీ చేస్తారు. కొందరు ప్రత్యేకమైన వ్యక్తులకు నూటికి నూరు శాతం బి కాంప్లెక్స్‌ను మందుల రూపంలోనే వైద్యులు సూచిస్తారు. బి కాంప్లెక్స్‌ ఎంత వాడాలి? ఎప్పుడు వాడాలి? ఏ పరిస్థితుల్లో వాడాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.

  • క్యాల్షియం, విటమిన్‌ డి: మనకు రోజు మొత్తానికి సరిపడా విటమిన్‌ డితో కలిసిన కాల్షియం పరిమాణం 600 నుంచి 800 మైక్రో యూనిట్లు. గర్భిణులు కూడా కాల్షియంను ఇదే పరిమాణంలో తీసుకోవాలి. అయితే మెనోపాజ్‌ దశకు చేరుకుని, 65 ఏళ్లు దాటిన మహిళలకు 800 నుంచి 1000 మైక్రో యూనిట్ల కాల్షియం ఇవ్వాలి. మెనోపాజ్‌ తర్వాత 1200 మైక్రో యూనిట్ల క్యాల్షిం అవసరం పడుతుంది.

  • విటమిన్‌ డి: విటమిన్‌ డి కలిపిన నూనెలు వాడటం వల్ల శరీరానికి సరిపడా విటమిన్‌ డి అందుతుంది. అలాగే సూర్యరశ్మి ద్వారా కూడా మన చర్మంలో విటమిన్‌ డి తయారవుతుంది. కాబట్టి వైద్యులు సూచిస్తే తప్ప ఈ విటమిన్‌ను తీసుకోకూడదు.

  • యాంటీ ఆక్సిడెంట్లు: యాంటీ ఆక్సిడెంట్లు తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు, హృద్రోగాలు తగ్గుతాయనే అపోహలు కూడా ఉన్నాయి. దీన్లో వాస్తవం ఉన్నా అది కొన్ని వర్గాల రోగులకే పరిమితం. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి వీటి వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అలాగని తీవ్ర వ్యాధుల నుంచి రక్షణ పొందటం కోసం ప్రతి ఒక్కరూ యాంటీ ఆక్సిడెంట్ల మీద ఆధారపడితే లాభం కంటే నష్టమే ఎక్కువ.

డాక్టర్‌ శ్రీథర్‌ రెడ్డి,

జనరల్‌ ఫిజీషియన్‌,

హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 02:13 AM