Stomach Pain: పొట్ట నొప్పి పని పట్టేలా
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:47 AM
పొట్టలో నొప్పికి పలు కారణాలు. వాటిలో కొన్ని స్వల్పమైనవి కావచ్చు, కొన్ని తీవ్రమైనవీ కావచ్చు. జీర్ణాశయం, పెద్ద, చిన్న పేగులు, పిత్తాశయం, క్లోమం... ఇలా పలు అవయవాలు...
వ్యాధి నిర్థారణ
పొట్టలో నొప్పికి పలు కారణాలు. వాటిలో కొన్ని స్వల్పమైనవి కావచ్చు, కొన్ని తీవ్రమైనవీ కావచ్చు. జీర్ణాశయం, పెద్ద, చిన్న పేగులు, పిత్తాశయం, క్లోమం... ఇలా పలు అవయవాలు కిక్కిరిసి ఉండే పొట్టలో నొప్పి తలెత్తితే, అందుకు అసలు కారణాలను ఆరా తీయడం అవసరం అంటున్నారు వైద్యులు.
పొట్టలో పలు చోట్ల నొప్పి తలెత్తవచ్చు. ఎగువ పొట్ట, కింది పొట్ట, కుడి, ఎడమ డొక్కల్లో, పొత్తికడుపు... ఇలా పొట్టలో నొప్పి తలెత్తే ప్రదేశాన్ని బట్టి ఆ నొప్పికి అసలు కారణాలను వైద్యులు అంచనా వేయగలుగుతారు. కొన్నిసార్లు పొట్టలో తలెత్తే నొప్పి వెన్నులోకి పాకవచ్చు. ఇంకొన్ని సందరాల్లో నొప్పి వచ్చిపోతూ ఉండొచ్చు. క్రమేపీ పెరిగిపోవచ్చు. పొడిచినట్టు, పిండినట్టు, మెలి పెట్టినట్టు... ఇలా భిన్నమైన లక్షణాలతో బాధిస్తూ ఉండవచ్చు. నొప్పికి అదనపు లక్షణాలు తోడవవచ్చు. అయితే అన్నిటికంటే ముందు, నొప్పితో ముడిపడి ఉండే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం ఎంతో అవసరం.
కారణాలు పలు రకాలు
అసిడిటీ: కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల, ఆహారం తిన్న వెంటనే, పైపొట్టలో మంట, నొప్పి మొదలవుతుంది
పిత్తాశయంలో రాళ్లు: ఈ సమస్యతో తలెత్తే నొప్పి పైపొట్టలో కుడివైపున వేధిస్తుంది. తిన్న వెంటనే నొప్పి తలెత్తుతూ ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లు: కుడి, ఎడమ డొక్కలో ఒకేసారి తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. తెరలు తెరలుగా వచ్చిపోతూ, క్రమేపీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వాంతి, జ్వరం కూడా మొదలవుతాయి
ప్యాంక్రియటైటిస్: పైపొట్టలో వచ్చే నొప్పి వెన్ను వైపు పాకుతూ ఉంటుంది
హెర్నియా: పొట్ట, పొత్తికడుపు దగ్గర ఉబ్బెత్తుగా ఉండి, నొప్పి వేధిస్తే, హెర్నియాగా భావించాలి. అంతర్గత చర్మపు పొరలు పలుచబడడం వల్ల పేగులు ఆ జాగాలోకి చొరబడే సమస్యే ‘హెర్నియా’. ప్రధానంగా బొడ్డు దగ్గర, పురుషుల్లో గజ్జల్లో హెర్నియా కనిపిస్తూ ఉంటుంది. సర్జరీలు జరగడం, పెద్ద వయసు హెర్నియాకు ప్రధాన కారణాలు
పేగులు అతుక్కుపోవడం: పలు సర్జరీల ఫలితంగా కొన్ని సందర్భాల్లో పేగులు అతుక్కుపోతాయి. ఈ సమస్యలో కూడా పొట్ట నొప్పి ఉంటుంది
అపెండిసైటిస్: బొడ్డు దగ్గర, పొత్తికడుపు దగ్గర తట్టుకోలేనంత నొప్పి వేధిస్తుంది. ఈ నొప్పి నెమ్మదిగా మొదలై క్రమేపీ తీవ్రమవుతుంది. మొదట పొట్ట ఉబ్బరంతో మొదలవుతుంది. బొడ్డు దగ్గర బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ఆ తర్వాత నొప్పి పొట్టలో కుడివైపుకు పాకుతుంది. వాంతి అవుతున్న భావన కూడా కలుగుతుంది
గుండెపోటు: కొందర్లో పొట్టనొప్పి గుండెపోటుకు సూచన. పైపొట్టలో నొప్పితో పాటు, ఆయాసం, చమటలు పడితే గుండెపోటుగా భావించి సత్వరం వైద్యులను కలవాలి. ప్రత్యేకించి ముందు నుంచి గుండె సమస్యలున్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి
ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి?
పొట్టనొప్పి తలెత్తితే వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టే వాళ్లు చాలా తక్కువ. చేతికి అందిన నొప్పి నివారణ మాత్రలు లేదా యాంటాసిడ్ మాత్రలు వేసేసుకుని, విశ్రాంతి తీసుకుంటారే తప్ప, నొప్పిని తీవ్రంగా పరిగణించరు. అయితే పొట్ట నొప్పిని తీవ్రంగా పరిగణించవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. అవేంటంటే...
గంటకు మించి కొనసాగినా
ఒకే ప్రదేశానికి పరిమితమైనా
తాకినప్పుడు నొప్పి పెరుగుతున్నా
వాపు, ఉబ్బు కనిపించినా
వాంతులు అవుతున్నా
విరోచనం ఆగిపోయినా, నీళ్ల విరోచనాలు అవుతున్నా
పొట్ట ఉబ్బరించినా
నొప్పితో పాటు వాంతి, జ్వరం మొదలైనా నొప్పి తలెత్తే ప్రదేశంతో పాటు అదనపు లక్షణాల ఆధారంగా వైద్యులు అసలు సమస్యను అంచనా వేయగలుగుతారు. సమస్యను కచ్చితంగా గుర్తించడంలో స్కానింగ్ సహాయపడుతుంది.
కండరం చిరిగితే?
కొందరికి విశ్రాంత స్థితిలో ఎలాంటి నొప్పి లేకపోయినా, కదిలేటప్పుడు పొట్టలో నొప్పి వేధించవచ్చు. వెన్నుపూసల్లో సమస్యలు, కండరాల సమస్యలే ఇలాంటి నొప్పికి కారణాలు. కొందరికి బరువులు ఎత్తే సమయంలో పొట్టలో నొప్పి తలెత్తవచ్చు. కండరం చిరిగిన సందర్భాల్లో ఈ నొప్పి తలెత్తుతుంది. ఇదే చీలిక పెద్దదైతే అది హెర్నియాకు దారి తీస్తుంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.
డాక్టర్ ఎమ్.ఎన్. పవన్ కుమార్
సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి