Washing Machine Tips: వాషింగ్ మెషిన్‌లో ఇలా
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:32 AM
వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతకడం వల్ల దుస్తులు రంగు వెలవడం, టీ షర్టులు లాంటివి సాగిపోవడం చూస్తుంటాం. ఎక్కువగా డిటర్జెంట్ వినియోగించినప్పటికీ ఒక్కోసారి దుస్తులపై...
వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతకడం వల్ల దుస్తులు రంగు వెలవడం, టీ షర్టులు లాంటివి సాగిపోవడం చూస్తుంటాం. ఎక్కువగా డిటర్జెంట్ వినియోగించినప్పటికీ ఒక్కోసారి దుస్తులపై మురికి, మరకలు వదలకుండా ఇబ్బంది కలిగిస్తుంటాయి. అలాకాకుండా చిన్న చిట్కాలు పాటిస్తూ వాషింగ్ మెషిన్‌లో దుస్తులను జాగ్రత్తగా ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం...
వాషింగ్ మెషిన్‌లో వేసే ముందు దుస్తులపై మరకలు, మురికి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో పరిశీలించాలి. సాధారణంగా షర్ట్ కాలర్, డ్రెస్ చేతుల చివర్లు, చీర లేదా లెహంగా కింది భాగాల మీద మురికి ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ఒక గిన్నెలో రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని దుస్తులమీద మరకలు, మురికి ఎక్కువగా ఉన్నచోట రాసి పావుగంటసేపు ఉంచాలి. తరువాత నీళ్లు చల్లుతూ చేతులతో రుద్దితే మురికి పూర్తిగా వదులుతుంది. బాగా మాసిన దుస్తులను అరగంటసేపు సర్ఫ్ నీళ్లలో నానబెట్టిన తరువాతే వాషింగ్ మెషిన్‌లో వేయడం మంచిది.
పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వర్క్‌లు సహా వివిధ రకాల డిజైన్లు ఉన్న రంగుల దుస్తులను లోపలికి తిప్పి వాషింగ్ మెషిన్‌లో వేయాలి. దీనివల్ల దుస్తులు రంగు వెలవవు. వాటిపై ఉన్న డిజైన్లు కూడా పాడవకుండా ఉంటాయి.
వాషింగ్ మెషిన్‌లో వేసేముందు దుస్తులకు ఉన్న బటన్లు, ఉక్కులు, జిప్పులను పెట్టేయాలి. దీనివల్ల దుస్తులు ఒకదానికొకటి చుట్టుకోకుండా ఉంటాయి. టీషర్టులు, లో దుస్తులు, సున్నితమైన ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన డ్రెస్‌లను మెష్ లాండ్రీ బ్యాగ్‌లో ఉంచి వాషింగ్ మెషిన్‌లో వేస్తే అవి సాగకుండా ఉంటాయి.
కొన్ని వాషింగ్ మెషిన్‌లలో వేడినీళ్లు వినియోగించే వెసులుబాటు ఉంటుంది. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చని నీళ్లను వాడితే దుస్తులకు పట్టిన దుర్వాసన, జిడ్డు, మురికి, మరకలు చాలావరకూ తొలగిపోతాయి. దుస్తులమీద చేరే హానికారక బ్యాక్టీరియాలు, ఇతర క్రిములు కూడా పూర్తిగా నశిస్తాయి. ముదురు రంగుల దుస్తులకు మాత్రం చల్లని నీళ్లనే వాడాలి.
వాషింగ్ మెషిన్‌లో పరిమితికి మించి దుస్తులు వేయకూడదు. అలా వేస్తే నీళ్లలో సులువుగా తిరగలేక దుస్తులు సరిగా శుభ్రం కావు. అంతేకాదు వాటిమీద డిటర్జెంట్ నిలవడం వల్ల ఫ్యాబ్రిక్ త్వరగా పాడవుతుంది.
డ్రయ్యర్‌ను ఎక్కువగా వాడకపోవడమే మంచిది. దీనిలోని అధిక వేడి కారణంగా దుస్తులు రంగు వెలిసిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు