Warsha Deshpande: ఆమె పోరాటం సమన్యాయం కోసం
ABN , Publish Date - Dec 29 , 2025 | 06:53 AM
దూషణలు, వేధింపులు, చంపుతామని బెదిరింపులు, భౌతిక దాడులు...35 ఏళ్ళుగా వీటన్నిటినీ ధైర్యంగా ఎదిరించి నిలిచారు వర్ష దేశ్‌పాండే. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన 60 మందికి పైగా వైద్యులను...
దూషణలు, వేధింపులు, చంపుతామని బెదిరింపులు, భౌతిక దాడులు...35 ఏళ్ళుగా వీటన్నిటినీ ధైర్యంగా ఎదిరించి నిలిచారు వర్ష దేశ్‌పాండే. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన 60 మందికి పైగా వైద్యులను జైలుకు పంపారు. ఈ ఏడాది ‘ఐక్య రాజ్య సమితి పాపులేషన్ అవార్డు’ అందుకున్న ఆమె... మహిళా హక్కుల పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు.
‘‘న్యాయం సమాజంలో అందరికీ సమానంగా దక్కదని చిన్న వయసులోనే నాకు అర్థమయింది. ముఖ్యంగా... చాలామంది మహిళలకు న్యాయం అనేది అందని ద్రాక్ష అంటే అతిశయోక్తి కాదు. మహిళల పట్ల వివక్షను చూస్తూ పెరిగాను. వారికి న్యాయం లభించేలా పోరాడాలనే ఆశయంతోనే న్యాయవాద వృత్తిని చేపట్టాను. గృహ హింసకు, వేధింపులకు గురవుతున్న దళిత మహిళల తరఫున ఎక్కువగా వాదించేదాన్ని. వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో... 1990లో నా స్వస్థలమైన మహారాష్ట్రలోని సతారా నగరంలో ‘దళిత్ మహిళా వికాస్ మండల్’ (డిఎంవిఎం) పేరుతో ఒక సంస్థను ప్రారంభించాను.
ఉపాధితో ఆసరా
మా తొలి కార్యక్రమంగా ఒక సర్వే నిర్వహించి... కుటుంబాలకు దూరంగా, ఎలాంటి ఆధారం లేకుండా జీవిస్తున్న మహిళలను గుర్తించాం. వారికి రేషన్ కార్డులు, జీవనోపాధి కోసం నైపుణ్యాలు అందించేలా అధికారులను ఒప్పించాం. అలా వివిధ ప్రాంతాల్లో 5 వేల మందికి పైగా మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వాన్ని సంప్రదించి... బస్టాండ్లలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు ద్వారా ఆ బృందాల మహిళలకు ఉపాధి కలిగేలా చేశాం. గృహ హింసకు, మహిళలపై వేధింపులకు మద్యపానం ఒక ప్రధాన కారణం. దాన్ని అరికట్టడానికి విస్తృతంగా ప్రచారం చేశాం. మహిళా బృందాల సభ్యులకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందడానికి దోహదం చేశాం. బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం, కౌన్సెలింగ్ కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేశాం. ఆ తరువాత మా సంస్థ ‘మహారాష్ట్ర స్టేట్ లీగల్ రిసోర్సెస్ అథారిటీ’కి అనుబంధంగా పని చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం లీగల్ కౌన్సెలింగ్ సెంటర్లతో పాటు మహిళలు నడిపే ఆహార కేంద్రాలు, కట్నాలు, బాల్య వివాహాలకు వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు మా సంస్థ ద్వారా విస్తృతంగా కొనసాగుతున్నాయి.

ఎన్నడూ వెనుకంజ వేయలేదు
మా సంస్థ చేపట్టిన వాటిలో... లింగ నిర్ధారణ పరీక్షల్ని నిరోధించే కార్యక్రమాలు చాలా ప్రధానమైనవి. మా రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య జాతీయ నిష్పత్తికన్నా బాగా తక్కువ. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా పుట్టబోయే శిశువు ఆడో, మగో తెలుసుకొని... ఆడ బిడ్డ అయితే గర్భంలోనే చంపేసే దుర్మార్గం విచ్చలవిడిగా సాగుతూ ఉండడమే దీనికి కారణం. మగ పిల్లలకి జన్మ ఇవ్వలేదని మహిళల్ని అత్తింటివారు చంపడం, ఇళ్ళలోంచి గెటేయడం లాంటి సంఘటనలు ఎన్నో. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అయితే... గర్భస్రావం చేయిస్తున్న సంఘటనలు కూడా బాగా పెరుగుతున్నాయి. దీనికోసం గర్భిణులను బలవంతం చేస్తున్నారు. అవి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఆ పరీక్షలు చేస్తూ, వాటిని ప్రోత్సహిస్తున్న కొందరు వైద్యులు, ఆసుపత్రులు. ఈ అక్రమాలను అరికట్టడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. మహారాష్ట్ర అంతటా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాం. దాదాపు 60 మంది వైద్యులను, కటకటాల వెనక్కు పంపించాం. 35 ఏళ్ళుగా.... దూషణలు, చంపుతామని బెదిరింపులు, వేధింపులు, భౌతిక దాడులు... ఇలా ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ ఎన్నడూ వెనుకంజ వేయలేదు.

మన దేశం నుంచి
మూడో వ్యక్తిని నేనే...
మా కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి... గర్భ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు నియమించిన సలహా కమిటీల్లో మా సంస్థ సభ్యులకు భాగస్వామ్యం కల్పించింది. రాష్ట్రంలోని వివిధ కమిటీలతో పాటు కేంద్ర పర్యవేక్షణ బోర్డులో నేను సభ్యురాలుగా ఉన్నాను. నాకు, మా సంస్థకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల వరకూ ఎన్నో పురస్కారాలు లభించాయి. వాటిలో ఈ ఏడాది స్వీకరించిన ‘ఐక్య రాజ్య సమితి పాపులేషన్ అవార్డు- 2025’ (వ్యక్తిగత కేటగిరీ) ప్రధానమైనది. గతంలో దాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధి, పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి.టాటా అందుకున్నారు. మన దేశం నుంచి ఈ గౌరవం పొందిన మూడో వ్యక్తిని నేను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. మహిళల శ్రేయస్సుకోసం, భ్రూణ హత్యల నివారణకోసం... అన్నిటికన్నా ప్రాధానంగా సమన్యాయం కోసం మేము సాగిస్తున్న పోరాటానికి మరింత ప్రేరణనిచ్చింది.’’
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..