Share News

Vintage Home Decor: వింటేజ్‌ హంగులతో ఇల్లు అందంగా

ABN , Publish Date - Sep 07 , 2025 | 02:50 AM

ఇంటిని పాతకాలపు వస్తువులు, ఫర్నిచర్‌తో అలంకరించుకుంటూ వింటేజ్‌ హంగులద్దే ట్రెండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఇలా వింటేజ్‌ లుక్‌తో ఇంటిని సరికొత్తగా...

Vintage Home Decor: వింటేజ్‌ హంగులతో ఇల్లు అందంగా

ఇంటిని పాతకాలపు వస్తువులు, ఫర్నిచర్‌తో అలంకరించుకుంటూ వింటేజ్‌ హంగులద్దే ట్రెండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఇలా వింటేజ్‌ లుక్‌తో ఇంటిని సరికొత్తగా ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం...

  • ఒకప్పుడు అందరూ తమ ఇంట్లో.. ముఖ్యంగా ముందుగది, పడకగదుల్లోని గోడలకు ఫొటో ఫ్రేములు ఏర్పాటు చేసుకునేవారు. అలాగే ఇప్పుడు కూడా అప్పటి కాలానికి సంబంధించిన బ్యాండ్‌, మ్యూజిక్‌ పోస్టర్లు; వింటేజ్‌ కార్లు, బైకుల పోస్టర్లు లాంటివి సేకరించి గోడలకు అంటించుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి ఎన్నో రకాల పోస్టర్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీయించుకున్న పాత ఫొటోను అందంగా ఫ్రేమ్‌ కట్టించి హాల్లో పెట్టుకున్నా చక్కని వింటేజ్‌ లుక్‌ వస్తుంది.

  • ఇంటి గోడలను ఖరీదైన వాల్‌ పెయింటింగ్స్‌తో నింపే బదులు ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన రెట్రో ప్రింట్స్‌, నేచర్‌ థీమ్‌ వాల్‌ పేపర్లు, యానిమల్‌ ప్రింటెడ్‌ పేపర్లను తెచ్చి అంటిస్తే గత జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకోవచ్చు.

  • ఒకప్పుడు మనం విరివిగా ఉపయోగించిన రాగి, ఇత్తడి వస్తువులను ఇంటి అలంకరణలో భాగం చేయవచ్చు. రెండు చెవుల గంగాళం ఇంట్లో ఉంటే దాన్ని శుభ్రం చేసి నిండా నీళ్లు నింపి అందులో రంగురంగుల పూలు పేర్చి హాల్లో ఎదురుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటికి అందమైన వింటేజ్‌ శోభను అందిస్తుంది. రాగి లేదా ఇత్తడి గ్లాసులను ఫ్లవర్‌ వాజ్‌లుగా మార్చి ఇంట్లో అక్కడక్కడా పెట్టవచ్చు. ఇలాంటి లోహపు వస్తువులు ఎన్నో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి కూడా. పాత గ్రామ్‌ఫోన్‌, రేడియో, టీవీ లాంటి వాటిని ఒక టేబుల్‌మీద అందంగా అమర్చినా ఇంటికి చక్కని కళ వస్తుంది.


2-navya.jpg

  • కాటన్‌, లినెన్‌, జ్యూట్‌, చేనేత వస్త్రాలతో రూపొందించిన కర్టెన్లు, సోఫా కవర్లు, దిండు కవర్లు, దుప్పట్లు లాంటివి ఉపయోగిస్తే ఇంటికి పాతకాలపు అందం వచ్చేస్తుంది. పెద్ద పెద్ద పూలు, ప్రింట్లు అప్పటి ప్రత్యేకతలు.

  • చెక్కతో రూపొందించిన బీరువాలు, కుర్చీలు, టేబుల్స్‌, టీపాయ్‌, బుట్ట ఉయ్యాల, చిన్న నిచ్చెన లాంటివి పాతకాలపు ఇంటి అందాలు. వీటితోపాటు విండ్‌ ఛైమ్స్‌, షాండ్లియర్స్‌, గోడ గడియారాలను అందంగా అలంకరించుకుంటే వింటేజ్‌ హోమ్‌ కళ్ల ముందు నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

Updated Date - Sep 07 , 2025 | 02:50 AM