Vijayadashami: అన్నిటా అమ్మే అందరూ ఆమే
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:33 AM
మన మాతృమూర్తులు తొమ్మిది నెలలపాటు గర్భాన్ని మోసి, పదవ నెలలో మనల్ని కన్నారు. ఆ తొమ్మిది నెలలూ ఎన్నెన్నో క్రిమి కీటకాలు తమను పీడిస్తూ ఉంటే ఆ బాధను తట్టుకున్నారు. లలితాంబిక ఈ లోకపు అమ్మలా కాకుండా....
పర్వదినం
అక్టోబర్ 2న విజయదశమి
మన మాతృమూర్తులు తొమ్మిది నెలలపాటు గర్భాన్ని మోసి, పదవ నెలలో మనల్ని కన్నారు. ఆ తొమ్మిది నెలలూ ఎన్నెన్నో క్రిమి కీటకాలు తమను పీడిస్తూ ఉంటే ఆ బాధను తట్టుకున్నారు. లలితాంబిక ఈ లోకపు అమ్మలా కాకుండా... నెలకు ఒక్క రోజును సంకేత రూపంగా పెట్టుకొని, తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులతో పోరాడి, పదవ రోజున విజయ దశమిని చేసుకుంది. అందుకే అవి నవ రాత్రులు. వాటి తరువాతిదైన పదవ రోజే అమ్మ విజయాన్ని సాధించినదైన విజయ దశమి అయింది. ఆ అమ్మ ఏ కష్టాలను ఎవరి ద్వారా తీరుస్తూ... సర్వారాధ్యురాలు ఎలా అయిందో తెలుసుకుందాం.
ఎవరైనా రోగి అనారోగ్యంతో వైద్యుడి దగ్గరకు వెళితే... ఆ రోగికి ఉండే లక్షణాలన్నిటినీ విని, ఏ వ్యాధి నివారణకు అది అవసరమో ఆలోచించి, అనుగుణమైన ఔషధాన్ని ఇస్తాడు. అలాగే అమ్మ ఈ ముల్లోకాలలో ఉండే అందరికీ ఎన్ని ఆపదలు వస్తాయో ఆలోచించింది. వేయి సమస్యలు ఉంటాయని ఆమెకు అర్థమయింది. దాంతో ఆ లలితాపరాభట్టారిక (లలితాదేవి) తన వద్ద ఉంటూ, తన ప్రతి కదలికనూ గమనిస్తున్న ఎనిమిది మందిని పిలిచింది (వారిలో మొదటి ఆమె పేరు వశిని. అందుకే ఆ ఎనిమిది మందిని వశిన్యాది వాగ్దేవతలు అంటారు). వేయి ఆపదలకు వేయి నామాలను సిద్ధం చేయాల్సిందిగా వారిని ఆజ్ఞాపించింది. అంతటి గొప్ప అవకాశం తమకు లభించిందన్న మహదానందంతో... అమ్మ రూప సౌందర్యాన్ని, అమ్మ మంత్ర రూపాన్ని, అమ్మ యుద్ధం చేసే విధానాన్ని, అమ్మ తన భర్త అయిన శివుడితో మెలిగే పద్ధతినీ, గర్భంతో ఉన్న మహిళ ఏయే ఆహారాలను ఏయే నెలలో తింటే ఉత్తమ శిశువు కలుగుతుందో ఆ ఆహార నియమాలను... ఇలా ఒక్కో విభాగానికి వందేసి నామాలతో... మొత్తం పది విభాగాలకు వేయి నామాలను ఆ వశిన్యాది వాగ్దేవతలు సిద్ధం చేశారు. దేవతల నిండు సభలో... ఆ వేయి నామాలను చదవాల్సిందిగా ఆదేశించింది. వాటన్నిటినీ తనతోపాటు సకల దేవతాగణం విన్నాక... ‘ఇదం నామ సహస్రమ్మే యో మద్భక్తః పఠేత్ సకృత్’... ఈ వేయింటిని మాత్రమే (అంటే మరికొందరు కూడా వేయి నామాలను సిద్ధం చేశారన్నమాట) ఎవరైతే పఠిస్తారో, వారి కోర్కెలన్నిటినీ శ్రద్ధతో తీరుస్తానని ప్రకటించింది. లలితా సహస్ర నామాలు అంతటి గొప్పవి. ఏ తీరు కష్టం ఏ రూపంలో, ఎంత పరిమాణంలో వచ్చినా... ఈ వేయి నామాలే దివ్యౌషధాలని అమ్మే స్వయంగా చెప్పింది. అందుకే మరెవరినో, ఇంకెవరినో ధ్యానించనక్కరలేదు. వాంఛితం నెరవేరడానికి లలితా నామాలు చాలు. ఎందరెందరు దేవతలు ఆ నామాల్లో దాగి ఉన్నారో పరిశీలిద్దాం.
ఇతర దేవతల పూజ ఎలా?
‘మా బిడ్డలకు చదువు రావాలి కదా! లలితా సహస్ర నామాలు మాత్రమే చదువుతూ ఉంటే అదెలా సాధ్యం?’ అనుకుంటారు ఎంతోమంది. తన వేయి నామాల్లో ఉన్న విషయాన్ని చూపిస్తూ, ‘‘ఆ సరస్వతి తన రూపమే’’ అంటూ ‘సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణీ’ అని తన వేయి నామాల్లో (137వ శ్లోకం) ఉందని కాబట్టి తనను ఆరాధిస్తే మరిక సరస్వతిని ఆరాధించనక్కర్లేదని ఆ లలితాంబికే చెప్పింది. ఇక, ‘చదువు బాగా వచ్చాక కూడా ఆదాయం లేకపోతే ఈ లలితా నామాలు ఏం రక్షిస్తాయి?’ అని బాధ పడనక్కర్లేదు. ‘మహేశ్వరీ మహా దేవీ మహాలక్ష్మీ ర్మృడ ప్రియా’ (53వ శ్లోకం) ఉంది. ‘‘మేము కొన్ని తరాల నుంచి పార్వతీ దేవిని ఆరాధిస్తే తప్ప ఏ కార్యానికీ పసుపు దంచనైనా దంచబోమ’’ని ఎవరైనా అడిగితే... ‘పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా’ అంటూ పార్వతి కూడా తనలో అంతర్లీనంగా ఉన్న రూపమేనని గుర్తించాలని చెబుతోంది లలితమ్మ. ‘‘మేము పూర్తిగా విష్ణు భక్తులం. మా పెద్దలు కూడా నారాయణుణ్ణే సేవించండి, పొరపాటున కూడా లలితా నామాలు చదవవద్దని మమ్మల్ని శాసించార’’ని అన్నారనుకోండి... ‘గోపీ్త్ర గోవింద రూపిణి’ (63వ శ్లోకం) అనే ఆధారం ఉంది... ఆ నారాయణుడు కూడా లలితాంబ రూపమేనని. ‘‘శైవ విధానాన్ని పాటించే మేము ఉమాదేవి ఆరాధకులం, ఆ ఉమా నామాలు ఎక్కడున్నాయి?’’ అని కంగారు అవసరం లేదు. ఉమాదేవి కూడా లలితా రూపాల్లో ఒకటేనంటూ ‘ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవితా’ (126వ శ్లోకం) అనే సాక్ష్యం ఉంది. ఉద్యోగం, ధనాదాయం లేని వారు లలితా దేవిని పూజిస్తే అవి ఎలా లభిస్తాయనే ప్రశ్నకు ‘రాజ్యలక్ష్మీ కోశనాథా చతురంగ బలేశ్వరి’ (135వ శ్లోకం) అనే ప్రమాణం ఉంది. ‘బ్రహ్మోపదేశ సమయంలో చెప్పిన గాయత్రిని పఠించకపోతే ఎలా?’ అనుకోనక్కర్లేదు. ‘గాయత్రీ వ్యాహృతీ స్సంధ్యా ద్విజ బృంద నిషేవితా’ (90వ శ్లోకం) అని అమ్మవారే స్వయంగా చెబుతోంది. లక్ష్మీ, సరస్వతుల్లో ఎవరిని ఎక్కువగా లలితాంబిక పరిగణిస్తోంది? (సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా...) అమ్మవారికి కుడివైపున సరస్వతి, ఎడమవైపున లక్ష్మి వింజామరలు వీస్తూ కనిపిస్తున్నారు. కుడి ఎడమల్లో కుడికే ప్రాధాన్యం కాబట్టి సరస్వతే గొప్పదని అర్థమవుతోంది. అంటే ధనం కన్నా విద్యకు, జ్ఞానానికే ప్రాధాన్యం.
సర్వదేవతా సమూహ రూపం
‘‘శ్రీ మహా విష్ణువు ప్రసిద్ధంగా దశావతారాలను, మొత్తం మీద 21 అవతారాలను ఎత్తాడు కదా! ఆ రాముణ్ణి, కృష్ణుణ్ణి, లక్ష్మీ నరసింహ స్వామిని... ఇలా వీరెవరినీ పూజించకుండా, లలితా నామాలను చదువుకుంటూ ఎలా కూర్చుంటాం?’’ అని అడిగితే ‘కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః’ (32వ శ్లోకం) అని అమ్మ స్వయంగా చెబుతోంది. అంటే ‘అమ్మ చేతి గోటి నుంచి పుట్టినవే నారాయణావతారాలన్నీ’ అని అర్థం. అన్నిటికన్నా... ‘శివుణ్ణి పూజించకుండా లలితా నామాల వెంట పడితే ఎలా?’ అనుకోనక్కర్లేదు.‘ శ్రీ శివా శివ శక్తైక్య రూపిణీ’ (183వ శ్లోకం) అని కనిపిస్తుంది లలితా సహస్ర నామాల చివరిలో. అంటే ఎందరెందరు స్త్రీ పురుష దేవతలు జగత్తును, దానిలో ఉన్న సర్వప్రాణులను రక్షించడానికి ఉన్నారో... ఆ అందరూ లలితలోనే ఉన్నారు. లలితాంబను ఆరాధిస్తే... మీరు ఎవరిని ఆరాధించదలచుకున్నారో వారందరూ ఆరాధనలు పొందినట్టే. ‘లలిత సర్వదేవతా సమూహ రూపం’ అని దీని అర్థం. ఈ నవరాత్రుల కాలంలో లలితా నామాలను 108 సార్లు పఠిస్తే వాంఛితాలు నెరవేరుతాయనేది శాస్త్ర వాక్యం.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
9866700425
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..