వైవిధ్యభరితం...వియత్నాం
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:36 PM
స్వచ్ఛమైన బీచ్‌లు, నదీ పర్యాటకం, సుందరమైన ప్రకృతి, దీవులు, యుద్ధాల చరిత్ర, ఫ్రెంచ్ సంస్కృతి, అభివృద్ధి చెందిన నగరాలు...
స్వచ్ఛమైన బీచ్‌లు, నదీ పర్యాటకం, సుందరమైన ప్రకృతి, దీవులు, యుద్ధాల చరిత్ర, ఫ్రెంచ్ సంస్కృతి, అభివృద్ధి చెందిన నగరాలు... ఒకే పర్యటనలో అన్నింటినీ అనుభవం లోకి తెచ్చుకోవాలంటే ‘వియత్నాం’ బెస్ట్ ఛాయిస్. ఆ దేశ విశేషాలే ఈవారం ‘ట్రావెలోకం’...
కుటుంబంతో కలిసి ఒక విదేశీ యాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నాక ‘ఎక్కడికి?’అన్నది పెద్ద ప్రశ్న. దగ్గరి దేశాలు, తక్కువ ఖర్చు, అందమైన ప్రదేశాలు... ఇవీ లక్ష్యం. నాలుగైదు దేశాలను వడపోశాక చివరికి వియత్నాంను ఎంపిక చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి నాలుగున్నర గంటల విమాన ప్రయాణం తర్వాత వియత్నాంలో అతిపెద్ద నగరం హోచిమిన్‌లో దిగాం. విమానాశ్రయంలోనే స్థానిక సిమ్‌కార్డు తీసుకుని ఆ వెంటనే ‘గ్రాబ్ యాప్’ డౌన్‌లోడ్ చేసుకున్నాం.
మనకు ఓలా, ఊబర్‌లాగా అక్కడ ట్యాక్సీలు బుక్ చేసుకునేందుకు ఆ యాప్ అవసరం. విమానాశ్రయం నుంచి మేం ముందుగానే రిజర్వు చేసుకున్న హోటల్‌కు కారు బుక్ చేశాం. కిరాయి 1.30లక్షల వియత్నాండాంగ్‌లు. మన కరెన్సీలో అది కేవలం 433 రూపాయలే. అక్కడ కార్ రెంట్ చాలా తక్కువ. హోచిమిన్‌లో చూడదగ్గ ప్రదేశాల్లో ల్యాండ్ మార్క్ 81 ఒకటి. అది 81 అంతస్థులున్న భారీ భవనసముదాయం. అందులో 79-81 ఫ్లోర్లలో ఉన్న సన్‌డెక్ నుంచి రాత్రి సమయాల్లో నగరాన్ని చూస్తే అద్భుతం.

సైగాన్ నదికి అటూ ఇటూ ఉన్న నగరం మొత్తం విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతూ కనిపిస్తుంది. పై అంతస్థులో చివరి అంచుపై ఏర్పాటుచేసిన పారదర్శక గాజుపై నడవడం ఆకాశంలో నడుస్తున్నామా? అన్నట్లుగానే ఉంటుంది. ఇక హోచిమిన్‌లో ఉన్న సైగాన్ నది, అక్కడి నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న మెకాంగ్ నదిలో పొడుగ్గా, సన్నగా ఉండే పడవల్లో ప్రయాణం ఆటవిడుపు.
ఆ దారిలో వెదురు నుంచి సిల్క్ తయారుచేసే కేంద్రం ప్రత్యేకం. అత్యంత మృదువు, నాణ్యతతో ఉన్న ఆ సిల్క్ ఖరీదు కూడా ఎక్కువే. ఈ నగరంలో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రి కాగానే పర్యాటక ఆకర్షణగా ఉన్న స్ర్టీట్ మార్కెటు ్లఅన్నీ కళకళలాడతాయి. రోడ్డుకు అటూ ఇటూ ఉన్న రెస్టారెంట్లవాళ్లు రోడ్డుమీదే కుర్చీలు, టేబుల్స్ వేస్తారు. రంగురంగుల లైట్లు, మ్యూజిక్ వింటూ అక్కడ కూర్చుని ఫుడ్, డ్రింక్స్ ఎంజాయ్ చేయొచ్చు.
యుద్ధ స్మారకాలు
వియత్నాం చరిత్ర చూస్తే... దాదాపుగా అన్నీ యుద్ధాలే. 1989 వరకు ఆ దేశం ఏదో ఒక యుద్ధంలో మునిగితేలుతూనే ఉంది. అమెరికా లాంటి బలమైన దేశాన్ని ఎదుర్కొనేందుకు వియత్నాం సైన్యం గెరిల్లా యుద్ధ వ్యూహం అనుసరించింది. సైగాన్ నదికి ఆనుకుని హోచిమిన్ నగరం వెలుపల అనేక సొరంగాలు తవ్వింది. ఆ సొరంగాల్లో ఉండి, అదును చూసుకుని బయటకు వచ్చి దెబ్బతీసి వెళ్లి పోయేవారు. ఆ సొరంగాలు బయటి నుంచి చూస్తే ఒక మనిషి వెళ్లడానికే ఇరుకు అన్నట్లుగా ఉంటాయి. లోపల కూడా అంతే. కానీ వాటిని వ్యూహాత్మకంగా మెలికలు మెలికలుగా... మూడు అంచెలుగా తవ్వారు. ‘కూ చి టన్నెల్స్’ అని పిలిచే వాటిని సందర్శించడం, వాటిలో చిన్న సొరంగాల్లోకి దిగే అవకాశం, అక్కడ జరిగిన యుద్ధం, యుద్ధ స్మారక మ్యూజియం... నాటి ఘటనల్ని గుర్తుచేస్తాయి.

హోచిమిన్‌లో రెండ్రోజులున్నాక నాట్రాంగ్ వెళ్లాం. అక్కడ ఒకనాటి హిందూ రాజ్యం చామ్ ఆనవాళ్లు చాలా ఉన్నాయి. ‘పో నగర్’ దేవాలయం క్రీ.శ. 7వ శతాబ్దం- 12వ శతాబ్దాల మధ్య నిర్మించిన గుడుల సముదాయం. శివుడు, పార్వతి, గణేశుడు, కుమారస్వామి విగ్రహాలున్నాయి. అయితే వారికి అక్కడి పేర్లున్నాయి. చరిత్ర మాత్రం మనదేశంలో చెప్పుకుంటున్నదే. అదేవిధంగా అక్కడున్న లాంగ్ సన్ పగోడా, అందులోని భారీ బుద్ధ విగ్రహాలు చూడదగినవి.
ఫ్రెంచ్ విలేజ్... బాణా హిల్స్
నాట్రాంగ్ నుంచి దనాంగ్‌కు వెళ్లాం. వియత్నాంలో బస్సు, రైలు ప్రయాణాలు రెండింటినీ చూడాలని ముందుగానే అనుకోవడంతో ఈ ప్రయాణం రైలులో సాగింది. ప్రయాణంలో స్థానికులు స్నేహ పూర్వకంగా ఉన్నారు. దనాంగ్‌లో ఎక్కడా రోడ్లమీద దుమ్ము అనేది లేదు. అతి పెద్ద వీధులు. అంతా పర్యాటకులే. ఫ్రెంచ్‌వాళ్లు వియత్నాంను పాలించినప్పుడు చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుని, ఈ నగరానికి దగ్గరగా ఉండే బాణాహిల్స్‌ను ఎంపికచేసుకున్నారు. 1800 అడుగుల ఎత్తున ఉన్న కొండ ల మీద తమకు అవసరమైన భవనాలను నిర్మించుకున్నారు. అప్పట్లో గుర్రాలపై అక్కడికి వెళ్లేందుకు మార్గం కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అక్కడి ఫ్రెంచ్ సంస్కృతిని అలాగే కాపాడుతూ, కొంత పునర్‌నిర్మించి ప్రస్తుతం దాన్నొక పర్యాటక ప్రాంతంగా మార్చారు. అక్కడికి ఇప్పుడు చేరుకోవాలంటే అరగంటపాటు కేబుల్ కారులోనే వెళ్లాలి. ప్రపంచంలో రెండో అతి పెద్ద కేబుల్ మార్గం ఇదే. అంత ఎత్తుకు వెళ్లగానే ఫ్రాన్స్‌లో ఉన్నామా? అన్నట్లుగానే ఉంటుంది. ఫ్రెంచ్ శైలి విగ్రహాలు, భవనాలు, కోటలు, తోటలు చూడదగిన విశేషాలు చాలా ఉన్నాయి.
ప్రపంచ పర్యాటక ప్రాంతాల జాబితాలోని పెద్ద అరచేతిలో ఉన్నట్లుండే వంతెన ‘గోల్డెన్ బ్రిడ్జ్’ కూడా ఇక్కడే ఉంది. అంత ఎత్తులో ఆ వంతెన మీద నడవడం భయంతో కూడిన విచిత్రా నుభూతి. దనాంగ్‌కు హోయ్ అన్‌కు మధ్యలో ఉండే మార్బుల్ పర్వతం చూడదగింది. మొత్తం మార్బుల్ రాయితోనే ఉండే పెద్ద కొండలో పెద్ద పెద్ద గుహాలు, బుద్ధ విగ్రహాలు, ఇతర ఆకర్షణలున్నాయి. ఆ గుహల్లోని దారికి ఇరువైపులా అంతా మార్బుల్ రాయే.
హోయ్ అన్... పట్టణమే పర్యాటకం
ఒక పట్టణం మొత్తంగా పర్యాటక ప్రాంతంగా మారిపోతే... అదే హోయ్ అన్. దనాంగ్‌కి గంట దూరంలో ఉన్న ఈ చిన్న పట్టణం లాంతర్ల పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడి తు బోన్ నదిలో ఉండే పడవలను రంగు రంగుల లాంతర్లతో అలంకరించారు. నదికి అటూ ఇటూ ఎటు చూసినా రోడ్లన్నీ లాంతర్లతో అలంకరించి ఉంటాయి. వీధిలో, ప్రతి ఇంటికి ఉన్న లాంతర్ల వెలుగులు, నదిలో ప్రతిబింబిస్తాయి. హోయ్ అన్ పట్టణం సూట్లు కుట్టేందుకు ప్రసిద్ధి. ఇక్కడ దొరికే నాణ్యమైన బట్టతో 24గంటల్లోనే సూట్ కుట్టివ్వడం ప్రత్యేకత. అనేక వందల షాపులుంటాయి. సూట్‌లు బేరం ఆడితేచాలా తక్కువలో లభిస్తాయి. దనాంగ్, హోయ అన్‌లకు దగ్గరలోనే సముద్రంలో ఉన్న చామ్ ఐలాండ్ బోటింగ్, స్కార్కెలింగ్, సీ వాకింగ్ లాంటి ఆటలకు ప్రసిద్ధి. స్వచ్ఛమైన ఇక్కడి బీచ్, బీచ్ ఒడ్డున కొండలు, కొబ్బరి చెట్లు... హాలీవుడ్ చిత్రాలను గుర్తుకు తెస్తాయి.
ఈ రెండూ చవక...
ఏటా సుమారు రెండుకోట్ల మంది వియత్నాంను సందర్శిస్తారని అంచనా. ఇది ఆ దేశ జనాభాలో 20 శాతం. స్థానికులు పర్యాటకులకు చాలా గౌరవం ఇస్తారు. మర్యాదగా ప్రవర్తిస్తారు. అక్కడ రెండింటి ధర బాగా తక్కువ. ఒకటి కార్ల అద్దె (100నుంచి 500 రూపాయలకు మించి ఉండదు). రెండోది హోటల్ గది. మన దగ్గర ఒక 4 స్టార్ హోటల్‌లో గది అద్దె రోజుకు రూ. 8 వేలు ఉంటుంది. అదే ఫైవ్‌స్టార్ హోటలైతే 15వేలు పెట్టాల్సిందే. కానీ వియత్నాంలో చాలా చోట్ల రూ.3వేల నుంచి రూ.5వేలు పెడితే చాలు...
విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్‌లు దొరుకు తాయి. ఇక అక్కడి ఆహారంలో ప్రత్యేకత ఫో. అంటే మన సూప్ లాంటిది. నూడుల్స్, చికెన్, పోర్క్, గ్రీన్స్... ఇంకేదైనా ఆ సూప్‌లో వేసుకుని తింటారు. దాదాపు ప్రతి నగరం లోనూ ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ధర ఎక్కువ. ఆరుగురం ఇండియన్ లంచ్ చేస్తే 15 లక్షల వియత్నాం డాంగ్‌లు అయ్యేది. అంటే మన కరెన్సీలో 5 వేల రూపాయలు. ఒక లంచ్‌కు 15 లక్షలు ఖర్చుపెట్టాం అని సరదాగా అనుకునేవాళ్లం.
- ఉప్పులూరి మురళీకృష్ణ, 99854 33362