PCOD: నెలసరి నత్త నడకన..
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:24 AM
ఆడపిల్లల్లో పిసిఒడి అత్యంత సాధారణమైన సమస్యగా మారిపోయింది. అధిక బరువు, అవాంఛిత రోమాలతో వేధించే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకునే వీలు లేకపోలేదు. లక్షణాల ఆధారంగా ఈ సమస్యను ఎలా గుర్తించాలో, ఏ జాగ్రత్తలతో నెలసరిని గాడిలో పెట్టుకోవాలో వైద్యులు వివరిస్తున్నారు.
8 నుంచి 13 ఏళ్లు... ఆడపిల్లలు యుక్తవయసులోకి అడుగు పెట్టే వయసిది. ఆ తర్వాత పిల్లలు శారీరకంగా పూర్తి స్థాయికి ఎదగడానికి రెండేళ్ల సమయం పడుతుంది. అయితే 15 ఏళ్లు దాటిన తర్వాత యుక్తవయసులోకి అడుగుపెట్టే పిల్లలుంటారు. 8 ఏళ్ల కంటే ముందే కౌమారంలోకి ప్రవేశించే పిల్లలుంటారు. అయితే పిసిఒడిని, యుక్తవయసుకు చేరుకున్న తర్వాత ఆడపిల్లల్లో తలెత్తే ప్రధాన సమస్యగా పరిగణించవచ్చు. సాధారణంగా తొలి నెలసరి మొదలైన ప్రారంభంలో, ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు నెలసరి క్రమం అవకతవకలకు గురవుతూ, నెమ్మదిగా గాడిలో పడుతుంది. ఆ తర్వాత కూడా ఆడపిల్లల్లో నెలసరి క్రమం తప్పుతూనే ఉన్నా, ఆగిపోయినా దాన్ని పిసిఒడిగానే అనుమానించాలి. ఆడపిల్లల్లో పిసిఒడి తలెత్తడానికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతౌల్యం.
పిసిఒడి ఎందుకు?
నెలసరి మొదలైన తర్వాత ప్రతి నెలా అండం విడుదల కావాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉచ్ఛ స్థాయిలో ఉన్నప్పుడు, నెలలో 14 రోజు నాటికి అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. సాధారణంగా ఆడపిల్లల్లో స్త్రీ, పురుష హార్మోన్లు రెండూ ఉంటాయి. అయితే స్త్రీ హార్మోను ఈస్ట్రోజన్ కంటే పురుష హర్మోన్ టెస్టోస్టెరాన్ మోతాదు తక్కువగా ఉండాలి. కానీ కొందర్లో ఈ పురుష హార్మోన్ ఉండవలసిన పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉధృతంగా లేకపోవడం వల్ల, పాలీ సిస్టిక్ ఓవరీ డిసీజ్, పిసిఒడి సమస్య తలెత్తి, అండం విడుదల ఆగిపోతుంది. దాంతో అవి అండాశయాల్లో సిస్టులు ఏర్పడతాయి.

అయితే హార్మోన్ అసమతౌల్యానికి ఇతరత్రా కారణాలేవీ లేవని నిర్థారించుకున్న తర్వాతే పిసిఒడిగా నిర్థారించవలసి ఉంటుంది. నాన్ క్లాసిక్ సిఎహెచ్ (నాన్ క్లాసికల్ కంజెనైటల్ హైపర్‌ప్లేసియా) అనే సమస్యలో కూడా హార్మోన్లు క్రమం తప్పి నెలసరిలో అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి నెలసరిలో అవకతవకలకు ఈ సమస్య కారణం కాదని నిర్థారించుకోవాలి. అలాగే కొందర్లో ప్రొల్యాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా, నెలసరి క్రమం తప్పుతుంది. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఇదే సమస్య తలెత్తుతుంది. ఇవేవీ కారణం కాదని నిర్థారించకున్న తర్వాతే పిసిఒడిగా నిర్థారించుకోవాలి.
ప్రధాన లక్షణాలు ఇవే!
పిసిఒడికి గురైన అమ్మాయిల్లో, టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం, ఇన్సులిన్ సమర్థమైన ప్రభావాన్ని కనబరచకపోవడమే! పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్‌గా మారడానికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్డుపడడం మూలంగా పిసిఒడి తలెత్తుతుంది. ఈ సమస్య కొన్ని ప్రధాన లక్షణాల రూపంలో బయల్పడుతుంది. అవేంటంటే...

పైపెదవి, ఛాతీ, చేతులు, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పెరగడం
గరుకుగా ఉండే, మందపాటి రోమాలు
మొటిమలు తలెత్తడం
నెలసరి క్రమం తప్పడం
బరువు పెరగడం
పరీక్షలున్నాయి
నెలసరి క్రమం తప్పిన ఆడపిల్లలకు రక్త పరీక్ష, పొత్తికడుపు అలా్ట్రసౌండ్‌తో, నాన్ క్లాసిక్ సిఎహెచ్, కార్టిసాల్, ప్రొలాక్టిన్ మోతాదు, ఫాస్టింగ్ గ్లూకోజ్, పిసిఒడి సమస్యలను నిర్థారించుకోవాలి. ఈ పరీక్షల్లో బయల్పడిన ఫలితాల ఆధారంగా సమస్యను కచ్చితంగా అంచనా వేసి, తగిన చికిత్సతో సమస్యను సరిదిద్దుకోవాలి. పిసిఒడిని సరిదిద్దడం కోసం ప్రధానంగా వ్యాయామానికీ, ఆహార నియమాలకూ ప్రాధాన్యమివ్వాలి. కనీసం ఐదు శాతం బరువు తగ్గినా పరిస్థితి అదుపులోకొస్తుంది. ఇలా మందులతో పనిలేకుండా సహజసిద్ధంగా పిసిఒడిని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఇన్ని నియమాలు పాటించినా పరిస్థితి అదుపులోకి రానప్పుడు మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. చికిత్సలో భాగంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది.
ఈ నియమాలు తప్పనిసరి
ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇంజెక్షన్లతో నాలుగైదు నెలల పాటు నెలసరి క్రమం తప్పకుండా కనిపిస్తే, వైద్యులు ఆ చికిత్సను ఆపి, కొన్ని నెలల పాటు నెలసరి క్రమాన్ని పరీక్షిస్తారు. ఆలోగా పరిస్థితి గాడిలో పడి నెలసరి గాడిలో పడుతుంది. ఈ నాలుగు నెలలూ వ్యాయామం కూడా కొనసాగిస్తే, ఫలితం మరింత మెరుగు పడుతుంది. అయితే హార్మోన్ ఇంజెక్షన్లతో పని లేకుండా సహజసిద్ధంగా శరీర హార్మోన్లను దారికి తెచ్చుకోవడం కోసం కొన్ని నియమాలను అనుసరించవచ్చు. అవేంటంటే...
క్రమం తప్పక ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి
నడక వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది
సమతులాహారం తీసుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవరుచుకోవాలి
కనీసం 5% మేరకు శరీర బరువు తగ్గించుకోవాలి.
సన్నగా ఉన్నవాళ్లకు ‘లీన్ పిసిఒడి’
కేవలం అధిక బరువు కలిగి ఉన్న పిల్లల్లోనే పిసిఒడి తలెత్తుతుందనుకుంటే పొరపాటు. బరువు తక్కువగా ఉండే నాజూకు ఆడపిల్లల్లో కూడా పిసిఒడి తలెత్తవచ్చు. అదే ‘లీన్ పిసిఒడి’. దీనికి కారణం... జన్యుపరమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్. జన్యుపరంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్న ఆడపిల్లల్లో పిసిఒడి చికిత్స కొంత క్లిష్టమవుతుంది. సన్నగా ఉంటారు కాబట్టి బరువు తగ్గడం వల్ల అదనపు ప్రయోజనం దక్కదు. అయితే వ్యాయామం చేయడం తప్పనిసరి. దీంతో ప్రయోజనం కనిపించనప్పుడు మాత్రమే వైద్యులు నోటి మాత్రలు సూచిస్తారు. పెళ్లి కాని అమ్మాయిల విషయంలో ఇలా మాత్రలు వాడుకోవచ్చు. కానీ పిల్లల కోసం ప్రయత్నిస్తున్న మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ఇన్‌ఫెర్టిలిజీ చికిత్సలను ఆశ్రయించాల్సి ఉంటుంది.
డాక్టర్ రాకేష్ బోపన్న
డాక్టర్ రాకేష్ ఎండోక్రైన్ అండ్ డయాబెటిస్ సెంటర్,
ల్యాంకో హిల్స్, మణికొండ, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..