Happiness: మాయలో మైమరచిపోవద్దు
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:28 AM
మనం బాగా చదువుకుంటే పెద్దయ్యాక బాగా డబ్బు సంపాదించవచ్చని ఎంతో మంది పెద్దలు మనకు చిన్నతనం నుంచి బాగా నూరిపోస్తారు. ఆ ధోరణితోనే మనం పెరిగి పెద్దవుతాం. అదే మనకు మహామంత్రంలా మారిపోతుంది.

మన అందరి కలా ఒక్కటే. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలన్నదే మనందరికీ ఉన్న అతి సరళమైన వాంఛ. కానీ ఈ చిన్న విషయాన్ని అందరూ ఎంతో సులువుగా మరచిపోతున్నారు. మనం బాగా చదువుకుంటే పెద్దయ్యాక బాగా డబ్బు సంపాదించవచ్చని ఎంతో మంది పెద్దలు మనకు చిన్నతనం నుంచి బాగా నూరిపోస్తారు. ఆ ధోరణితోనే మనం పెరిగి పెద్దవుతాం. అదే మనకు మహామంత్రంలా మారిపోతుంది. ‘ఇది చేయాలి, అది చేయాలి, ఏదో చేయాలి’ అని పరితపిస్తూ ఉంటాం. కానీ మనం తప్పనిసరిగా నెరవేర్చుకోవాల్సిన కల ఏమిటి? మనం గమనించినట్టయితే... వాస్తవానికి మన అందరి కలా ఒక్కటే. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలన్నదే మనందరికీ ఉన్న అతి సరళమైన వాంఛ. కానీ ఈ చిన్న విషయాన్ని అందరూ ఎంతో సులువుగా మరచిపోతున్నారు.
శాంతి కొరవడితే...
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే - మనం లోలోపల సంతృప్తిగా ఉన్నట్టయితే, ఏ విషయంలోనూ గొడవపడం. అంటే, మనిషికి మౌలిక అవసరాలు తీరడం ముఖ్యం. అవే తీరని స్థితిలో ఉంటే మనిషికి తాను పేదవాణ్ణనే భావన కలుగుతుంది. ఆఫ్రికాలో నేనొక విషయం గమనించాను. అక్కడ కొంతమంది చిన్న పిల్లలు... వాళ్ళ కాళ్ళకు చెప్పులు ఉండవు. చిరిగిన దుస్తులతో, చింపిరి జుత్తుతో కనిపిస్తారు. కానీ ఒక సైకిల్ చక్రం తీసుకొని, దానితో హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్నప్పుడు... వాళ్ళ ముఖాలలో కనిపించే చిరునవ్వు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. మనిషి మౌలిక అవసరాలు తీరితే ఆనందంగా ఉండగలడు. అదే కడుపులో ఆకలి వేధిస్తూ ఉంటే చిరునవ్వు కనిపించదు. కేవలం కన్నీళ్ళు మాత్రమే కనిపిస్తాయి. మనం చూస్తున్నవన్నీ కేవలం మనం సృష్టించుకున్నవే. ఎవరైనా తమనితాము నిరుపేదలుగా భావించుకుంటూ ఉంటే... అందుకు కారణం కూడా మనిషేనని గుర్తించాలి. ఈ విషయాలను మనం అర్థం చేసుకోకపోతే ముందుకి సాగలేం. సమాజం అనే అమరిక విచ్ఛిన్నమవుతుంది. ఈనాడు జరుగుతున్నది అదే కదా! దాన్ని ఏకం చేసి పట్టి ఉంచగలిగేది కేవలం శాంతి మాత్రమే. మన జీవితాల్లో శాంతి కొరవడితే... ప్రతిదీ ఛిన్నాభిన్నం అవుతుంది. కుటుంబాలు, మనుషులు ఛిన్నాభిన్నం అవుతారు.
వాటి విలువ గుర్తించండి...
‘తనని తాను తెలుసుకోవడం’ అనేది ఎంతో ప్రధానం. ఎలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీలో దయాగుణం కూడా నిండి ఉందని గుర్తిస్తారు. మనల్ని మనం తెలుసుకోలేనప్పుడు... మన దగ్గర ఉన్న వాటి గురించి కూడా తెలుసుకోలేం. మీలో జ్ఞానం ఉంది, చీకటిని పారద్రోలగలిగే ప్రకాశం మీ హృదయంలో ఉంది. మీకు కావలసినవన్నీ మీలోనే ఉన్నాయి. కానీ ఒకవేళ మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే... మీ దగ్గర ఉన్నవాటిని కూడా మీరు తెలుసుకోలేరు. కాబట్టి అన్నిటికన్నా ముందు ‘నిన్ను నువ్వు తెలుసుకో’! మీలో ఉన్న సద్గుణాలను గుర్తించి, మీ జీవితాల్లో ముందడుగు వేయండి. ఏది ఏమైనా ఈ ప్రాపంచిక మాయలో పడి మైమరచిపోవద్దు. మీలోంచి వస్తున్న శ్వాస వేరెవరిదో కాదు... అది మీదే. అందులో దాగి ఉన్న ఆనందం కూడా వేరెవరిదో కాదు, మీ ఆనందమే. వీటన్నిటి విలువను గుర్తించండి.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News