Trendy Colorful Bangles: రంగురంగుల గాజులతో రమ్యంగా
ABN , Publish Date - Oct 05 , 2025 | 02:49 AM
ఆభరణాలన్నింటిలో గాజులకు ప్రత్యేక స్థానం ఇస్తుంటారు మహిళలు. ఎన్ని నగలు పెట్టుకున్నా.. అందమైన గాజులు వేసుకోకపోతే అలంకరణ పూర్తికానట్టే! ఒకప్పుడు.. పెళ్లయిన మహిళలు చేతినిండా మట్టిగాజులు వేసుకునేవారు...
ఆభరణాలన్నింటిలో గాజులకు ప్రత్యేక స్థానం ఇస్తుంటారు మహిళలు. ఎన్ని నగలు పెట్టుకున్నా.. అందమైన గాజులు వేసుకోకపోతే అలంకరణ పూర్తికానట్టే! ఒకప్పుడు.. పెళ్లయిన మహిళలు చేతినిండా మట్టిగాజులు వేసుకునేవారు. యువతులు రంగురంగుల లక్క గాజులు, ప్లాస్టిక్ లేదా నైలాన్ గాజులు వేసుకునేవారు. క్రమంగా బ్లాక్ మెటల్, వైట్ మెటల్ బ్యాంగిల్స్ వచ్చేశాయి. ఇవి కాలేజీ యువతులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక బంగారు గాజులు ఎప్పటికీ ప్రత్యేకమే. వాటిమీద కెంపులు, పచ్చలు, వజ్రాలు, ముత్యాలు, నీలాలు పొదిగి ఎన్నో అద్భుతమైన డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని కేవలం పండుగలు, వివాహాది శుభకార్యాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు మహిళలు. రోజువారీ వేసుకోవడానికి వీలుగా మారుతున్న పోకడలకు అనుగుణంగా రకరకాల రాళ్ల గాజులు, థ్రెడ్ బ్యాంగిల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. సీజెడ్, టోరమలీన్, టోపాజ్ లాంటి మామూలు రాళ్లతో డిజైన్ చేసిన గాజులను మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా రంగుల దారాలు చుట్టిన గాజులు కూడా యువతులను ఆకర్షిస్తున్నాయి. కాలేజీకైనా కార్యాలయానికైనా వెళ్లేటప్పుడు చేతికి ఒక్క గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. అంతలా మహిళల మనసు దోచుకున్న రంగురంగుల గాజులపై ఓ లుక్కేద్దామా...
సీజెడ్ గాజులు
వజ్రాలకు ప్రత్యామ్నాయంగా సీజెడ్స్ ఉపయోగించి తయారుచేసే రాళ్ల గాజులను యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం వివిధ రంగుల్లో సీజెడ్స్ లభ్యమవుతున్నాయి. ఒక గ్రాము బంగారం లేదా వెండి ప్లేటింగ్‌తో పలు డిజైన్లలో రంగురంగుల సీజెడ్‌లను కూర్చి గాజులు రూపొందిస్తున్నారు. సింగిల్ లైన్, మల్టిపుల్ లైన్స్, బ్రేస్‌లెట్ స్టయిల్ గాజులు అందుబాటులో ఉన్నాయి. వజ్రాలను పోలిన కటింగ్‌తో తళతళలాడే సీజెడ్ గాజులు... సంప్రదాయ దుస్తులతోపాటు మోడరన్ డ్రెస్‌ల మీద కూడా చక్కగా నప్పుతాయి.
టోరమలీన్ గాజులు
టోరమలీన్ రాళ్లు పొదిగిన గాజులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. విభిన్నమైన కటింగ్ విధానం వల్ల ఈ రాళ్లు నలువైపులా కాంతులు విరజిమ్ముతుంటాయి. గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, గోధుమ రంగుల్లో లభించే టోరమలీన్ రాళ్ల గాజులను మహిళలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. పట్టుచీరలు లేదా భారీ ఎంబ్రాయిడరీ వర్క్‌లతో నిండిన లెహాంగాల మీద ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రోజువారీ వేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటాయి.
టోపాజ్ గాజులు
రంగురంగుల టోపాజ్ రాళ్లను కూర్చి రూపొందించిన గాజులు కూడా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. లక్క, ప్లాస్టిక్, మెటల్ గాజుల మీద పలు ఆకారాల్లో ఉన్న టోపాజ్ రాళ్లను అతికిస్తారు. నీలం, గులాబి, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో చిన్న, పెద్ద సైజుల్లో ఉన్న టోపాజ్ రాళ్లతో చాలా రిచ్‌గా కనిపిస్తాయి ఈ గాజులు. వెడల్పుగా గోట్ మాదిరి కనిపించే ఈ గాజులను చేతికి ఒక్కటి వేసుకున్నా గ్రాండ్‌గా ఉంటుంది.
దారాల గాజులు
ప్లాస్టిక్, లేదా మెటల్ బ్యాంగిల్స్‌కు రంగు రంగుల పట్టుదారాలను ఒక క్రమంలో చుట్టి కొనలను గమ్‌తో అంటిస్తారు. రెండు లేదా మూడు రంగుల దారాలను అందమైన డిజైన్ ప్రకారం చుట్టి తయారుచేసిన గాజులు గ్రాండ్‌గా కనిపిస్తాయి. వీటి మీద రంగురంగుల కుందనాలు, రాళ్లు, ముత్యాలు, బీడ్స్ కూడా అతికిస్తుంటారు. మువ్వలు వేలాడదీస్తుంటారు. సన్నగా, వెడల్పుగా లేదంటే లావుగా ఇలా ఏ ఆకారంలో కావాలంటే అలా ఇంట్లోనే దారాల గాజులు తయారు చేసుకోవచ్చు. గోట్స్, సైడ్ బ్యాంగిల్స్ మాదిరిగా డిజైన్ చేసుకుని చేతులకు వేసుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల దారాలతో లావుపాటి గాజులు సిద్దం చేసుకుంటే రోజువారీ వేసుకోవడానికి బాగుంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ