Top Telugu Best Actresses of 2025: ఈ ఏడాది వీరిదే
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:56 AM
తెలుగు సినిమాకు 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. కథ, కథనాలతోపాటు కథానాయికల అభినయానికి అద్దంపట్టిన ఏడాది ఇది. అగ్రతారలు తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి...
తెలుగు సినిమాకు 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. కథ, కథనాలతోపాటు కథానాయికల అభినయానికి అద్దంపట్టిన ఏడాది ఇది. అగ్రతారలు తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి పాత్రకు ప్రాధాన్యం ఇస్తే, కొత్త తారలు తొలి అడుగులతోనే తమ ప్రతిభతో ఆకాశమే హద్దు అని నిరూపించారు. ఈ ఏడాది ఉత్తమ నటన కనబరిచిన నటీమణుల జాబితా... వారి ప్రదర్శన వెనకున్న అంకితభావాన్ని మన ముందు ఉంచుతోంది.
అగ్రపీఠం వారిదే
ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన అగ్రస్థానంలో నిలిచారు. ‘యానిమల్’ చిత్రానికి అవార్డు రాకపోయినా, ఆ లోటును ఈ ఏడాది నటనతో భర్తీ చేశారు. ‘ద గర్ల్‌ఫ్రెండ్’ క్లైమాక్స్‌లో ఆమె ప్రదర్శన, ‘కుబేర’ కోసం డంప్‌యార్డ్‌లో చెత్తలో నిలబడి నటించడం ఆమె కష్టానికి, పాత్రల పట్ల అంకితభావానికి నిదర్శనం. మరోవైపు ‘తండేల్’ సినిమాలో సాయిపల్లవి తన సహజ నటనతో మరోసారి మాయచేశారు. ప్రేమించిన వాడి కోసం ఎదురుచూసే ప్రియురాలిగా సంతోషం, బాధ, భయం వంటి అన్ని భావోద్వేగాలను పలికించిన తీరు అద్భుతం.
మూస ధోరణులకు చెక్
కొందరు నాయికలు ఈ ఏడాది సాహసోపేతమైన పాత్రలతో మూస ధోరణులను బద్దలుగొట్టారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నలుగురు పిల్లల తల్లి భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయారు. పల్లెటూరి గృహిణిగా వెంకటేశ్ సరసన ‘సారీ బా’, ‘లవ్ యూ బా’ వంటి సంభాషణలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక, టిల్లు స్కేర్‌లోని బోల్డ్ పాత్ర నుంచి పూర్తి భిన్నంగా ‘పరదా’లో అమాయకమైన ‘సుబ్బు’ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చూపిన వైవిధ్యం ప్రశంసలు అందుకుంది.
కొత్త తారల వెలుగులు
ఈ ఏడాది తెలుగు తెరకు ఎందరో కొత్త తారలు పరిచయమై తొలి సినిమాతోనే బలమైన ముద్రవేశారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ‘8 వసంతాలు‘ సినిమాలో ‘శుద్ధి అయోధ్య’ లాంటి క్లిష్టమైన పాత్రను అనంతిక సనీల్‌కుమార్ పోషించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఎంతో హుందాతనంతో ఆమె నటించారు. ‘కన్యాకుమారి’లో గీత్‌సైని శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ మిగతా పాత్రలను డామినేట్ చేశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో ఉన్నా ‘లిటిల్ హార్ట్స్’ మూవీలో ‘కాత్యాయిని’ పాత్రను వదులుకోని శివాని నాగారం, తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో రాంబాయి వంటి హార్డ్ హిట్టింగ్ పాత్ర చేసిన తేజస్విరావ్ వంటి వారు భవిష్యత్ తారలుగా నిలిచారు. వీరితోపాటు ‘కోర్ట్’ మూవీలో జాబిలిగా నటించిన శ్రీదేవి, ‘అనగనగా’లో కాజల్ చౌదరి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అలాగే, ‘ఆంధ్రాకింగ్ తాలుకా’ లో భాగ్యశ్రీ బోర్సే, ‘ద ప్రి వెడ్డింగ్ షో’లో టీనా శ్రావ్య, ‘బ్యూటీ’లో నీలఖి వంటివారు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంమీద 2025 తెలుగు సినిమాకు నాయికా ప్రాధాన్యతను, వారి అభినయ పటిమను ఘనంగా చాటిచెప్పిన సంవత్సరంగా నిలిచిపోతుంది.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్