Share News

Fashion Advice: పట్టు చీరలు ఇలా పదిలం...

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:23 AM

పట్టుచీరలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని సరైన విధానంలో సంరక్షించుకోకుంటే మెరుపు కోల్పోయి పాతగా కనిపిస్తాయి. పట్టుచీరలు ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!

 Fashion Advice: పట్టు చీరలు ఇలా పదిలం...

పట్టుచీరని ఒకసారి కట్టుకుని విడిచిన తరవాత దానికి బాగా గాలి తగిలేలా ఆరేయాలి. తేమ, చల్లదనం లేకుండా పొడిగా ఆరిన తరవాతనే మడత పెట్టి భద్రపరచాలి. నాలుగైదుసార్లు కట్టుకున్న తరవాత చీరని డ్రైక్లీనింగ్‌ చేయించవచ్చు. దీనివల్ల పట్టు చీర మెరుపు పోకుండా ఉంటుంది.

చీర మీద చిన్న మరకలు లేదా మురికి అంటితే అక్కడ మాత్రమే..... నీళ్లతో తడిపిన దూదితో తుడవాలి. కొద్దిగా గ్లిజరిన్‌ రాసి పలుచని బట్టతో తుడిచినా మరకలు పోతాయి.

పట్టు చీరని శుభ్రం చేయాలనుకుంటే మొదటిసారి మాత్రం డ్రైక్లీనింగ్‌ చేయించాలి. తరవాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నీళ్లలో ముంచి ఉతకవచ్చు. నీళ్లలో కొద్ది మోతాదులో బేబీ షాంపూని మాత్రమే కలపాలి. డిటర్జెంట్‌, సర్ఫ్‌ కలపకూడదు. చీరని నీళ్లలో ఎక్కువసేపు నాననివ్వకూడదు. చేతులతో గట్టిగా పిండకూడదు.

చీర కొనను నీళ్లలో ముంచి వేళ్లతో పిండి రంగు పోతున్నదీ లేనిదీ పరిశీలించాలి. రంగు వదులుతున్నట్లయితే ఒక బకెట్‌ నీళ్లలో పది చుక్కల నిమ్మరసం కలిపి అందులో చీర ముంచి వెంటనే తీసి నీడలో ఆరవేయాలి.


చీరని ఇస్త్రీ చేసేముందు దానిపై కొన్ని నీటి చుక్కలు చల్లితే ముడతలు తొంతరగా పోతాయి. పట్టుచీరని నేరుగా ఇస్త్రీ చేయకూడదు. చీరపై నూలు దుపట్టా లేదా పరిశుభ్రమైన తువాలు పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. దీనివల్ల ఇస్త్రీ పెట్టె వేడికి జరీ నల్లబడకుండా ఉంటుంది.

పట్టుచీరని చక్కగా మడతపెట్టి సన్నని నూలు వస్త్రం లేదా తెల్లని కాగితంలో చుట్టి అలమరాలో పెట్టుకోవాలి. కనీసం మూడు నెలలకు ఒకసారైనా చీర మడతలను మార్చాలి. లేకుంటే మడతలపై చిరుగులు వస్తాయి.

పట్టుచీరలను అలమరాలో సర్దిన తరవాత వాటి మధ్యలో కలరా ఉండలు లేదంటే ఫ్యాబ్రిక్‌ ఫ్రెషనర్స్‌ను ఉంచాలి. దీనివల్ల పురుగులు చేరకుండా ఉంటాయి. గంధపు చెక్కను పలుచని గుడ్డలో చుట్టి పెడితే చీరలకు తేమ చేరకుండా ఉంటుంది. వాటికి మంచి సువాసన కూడా పడుతుంది.

పట్టుచీర మీద దగ్గరనుంచి పెర్ఫ్యూమ్‌ని స్ర్పే చేయకూడదు. దానిలోని రసాయనాల వల్ల జరీ పోగులు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక అడుగు దూరంలో ఉండి స్ర్పే చేయడం మంచిది.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:56 AM