Share News

Sri Madhvacharya: ముక్తి మార్గదర్శి

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:31 AM

హనుమంతుడు, భీముడి అవతారాల అనంతరం... వైష్ణవతత్త్వం తాలూకు సత్యమైన రూపాన్ని తిరిగి ప్రతిష్ఠించడం కోసం... వాయుదేవుడు శ్రీమధ్వాచార్యులుగా ఇలపై అవతరించాడు. మహిమాన్వితుడైన ఆయన జీవిత చరిత్రను తెలిపే అపూర్వమైన గ్రంథం ‘శ్రీ సుమధ్వ విజయం’.

Sri Madhvacharya: ముక్తి మార్గదర్శి

ఫిబ్రవరి 6న శ్రీ మధ్వనవమి

గవత్‌ తత్త్వాన్ని మానవులకు బోధించి, వారిని ముక్తి మార్గం వైపు నడిపించడానికి ఈ లోకంలో అవతరించిన మహనీయుడు శ్రీమధ్వాచార్యులు. హనుమంతుడు, భీముడి అవతారాల అనంతరం... వైష్ణవతత్త్వం తాలూకు సత్యమైన రూపాన్ని తిరిగి ప్రతిష్ఠించడం కోసం... వాయుదేవుడు శ్రీమధ్వాచార్యులుగా ఇలపై అవతరించాడు. మహిమాన్వితుడైన ఆయన జీవిత చరిత్రను తెలిపే అపూర్వమైన గ్రంథం ‘శ్రీ సుమధ్వ విజయం’. త్రివిక్రమ పండితాచార్యుల కుమారుడు నారాయణ పండితాచార్యులు రచించిన ఈ గ్రంథం పదహారు సర్గలలో... 1,008 శ్లోకాలను కలిగి ఉంది. ఈ గ్రంథ పారాయణం వల్ల పుణ్యమే కాదు, సంసార బంధ విముక్తి కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం. గ్రంథకర్త అయిన నారాయణ పండితాచార్యులే ‘శ్రీ సుమఽధ్వవిజయా’న్ని సంక్షిప్తంగా, భక్తుల పారాయణకు అనుకూలంగా ఉండేలా ‘ప్రమేయ నవమాలిక’ పేరుతో రచించారు. దానిని ‘అణుమధ్వ విజయం’ అని పిలుస్తారు. దీనికి అద్భుతమైన వ్యాఖ్యానం రాసినందుకే శ్రీ రాఘవేంద్రస్వామికి ద్వైత సామ్రాజ్యం అనే భాగ్యం దొరికిందని శ్రీ వాదీంద్రతీర్థులు తన ‘గురుగుణస్తవనం’లో పేర్కొన్నారు.


సాక్షాత్తూ వాయుదేవుడే...

శ్రీమధ్యాచార్యులు భగవద్గీతకు భాష్యంతో తన గ్రంథ రచన ఆరంభించారు. ఆ గ్రంథాన్ని బదరీనాథుడికి సమర్పించారు. ఈ సందర్భంగా బదరిలో 48 రోజుల పాటు ‘కాష్టమౌన వ్రతా’న్ని ఆచరించారు. అంటే ఆహార, పానీయాలు లేకుండా కట్టెలా కదలకుండా, మౌనంగా ధ్యానం చేస్తూ, ప్రవచనాలకోసం మాత్రమే నోరు విప్పడం. వ్యాసభగవానుడు ఈ కఠినమైన వ్రతానికి ప్రసన్నుడయ్యాడు. మధ్వాచార్యుల వద్దకు వచ్చి, తన బదరికా ఆశ్రమానికి రావాలని ఆదేశించాడు. ఆ ఆశ్రమం ఊర్ధ్వబదరిలో ఉంది. హిమాలయాల్లో అతి ఎత్తైన చోట, ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే పొడవైన, దట్టమైన చెట్ల మధ్య, రక్తాన్ని గడ్డకట్టించే మంచుతో నిండిన ఆ ప్రదేశాన్ని చేరుకోవడం చాలా కష్టం. మరునాడు ఉదయం తన అనుష్ఠానాలను ముగించుకున్న మధ్వాచార్యులు... శిష్యులందరినీ అక్కడే ఉండమని చెప్పి, ఒంటరిగా ఊర్ధ్వబదరికి బయలుదేరారు. గురువును విడిచి ఉండలేని సత్యతీర్థులు అనే శిష్యుడు ఆయనను అనుసరించాడు. మధ్వాచార్యులు...

హనుమంతుడిలా తన శరీరాకృతిని పెంచుకొని, ఒక కొండపైనుంచి మరో కొండపైకి అడుగులు వేస్తూ ఎంతో వేగంగా నడుస్తున్నారు. సత్యతీర్థులు ఎంత వేగంగా పరుగెత్తినా ఆయనను అందుకోలేకపోతున్నాడు. చివరికి నిస్సహాయుడై... గురువును గట్టిగా పిలిచాడు. అప్పుడు మధ్వాచార్యులు వెనక్కి తిరిగి చూసి, తన చెయ్యి విదిలించారు. ఆ గాలికి సత్య తీర్థుడు పువ్వులా ఎగిరి, మళ్ళీ మఠంలోకి వచ్చి కూర్చున్నాడు. మధ్వాచార్యులు, వాయుదేవుడు ఒక్కరే అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక... మధ్వాచార్యులు రచించిన ‘బ్రహ్మసూత్ర భాష్యం’లో అర్థ గాంభీర్యం లాంటివి అనంతంగా ఉంటాయి. వాటిలో ‘అనువ్యాఖ్యానము’ అత్యంత విశిష్టమైనదే కాదు, ఆయన గ్రంథాలన్నిటికీ మణిహారం లాంటిదని పండితులు ప్రస్తుతించారు. మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి, క్షీరసాగరాన్ని మధించి, దానినుంచి అమృతభాండాన్ని వెలికి తీసినట్టు... మహాభారతాన్ని మధ్వాచార్యులు మధించి ‘మహాభారత తాత్పర్య నిర్ణయం’ అనే తత్త్వ గ్రంథాన్ని రచించారు.


మధ్వ నవరాత్రులు...

మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ... తొమ్మిది రోజులను మధ్వ నవరాత్రులుగా పరిగణిస్తారు. జగద్గురువైన శ్రీ మధ్వాచార్యులు భగవంతుని ఆదేశం ప్రకారం పవిత్రమైన భరత భూమిలో జన్మించారు. జిజ్ఞాసువులకు అమూల్యమైన తత్త్వ భాండాగారాన్ని అందించారు. ఉడిపిలోని అనంతేశ్వర దేవాలయం నుంచి బదరికి ఆయన పయనించిన రోజు మధ్వ నవమి. ఆ రోజున ఆయన తన శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉండగా... ఆకాశం పుష్పవర్షం కురిసింది. అప్పుడే మధ్వాచార్యులు అదృశ్యం అయ్యారు. ఊర్ధ్వబదరిలో వేదవ్యాసుని దగ్గర జ్ఞానసాధన చేస్తూ... ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నారనేది భక్తుల నమ్మకం. శ్రీమధ్వ నవమి రోజున మధ్వాచార్యులు రచించిన గ్రంథాలను భక్తులు రథాలలో ఉంచి, అత్యంత వైభవంగా ఊరేగిస్తారు.

మధ్వ ప్రచార పరిషత్‌, 9440258841


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 04:32 AM