Share News

Imam Hussain: ఆ త్యాగం అనుపమానం

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:12 AM

ముహర్రం పేరు వినగానే గుర్తుకు వచ్చే మొదటి చారిత్రక సంఘటన... కర్బలా మైదానంలో జరిగిన అపూర్వమైన సంగ్రామం. ఖిలాఫత్‌ వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి హజ్రత్‌ హుసేన్‌ చేసిన మహత్తరమైన త్యాగానికి...

Imam Hussain: ఆ త్యాగం అనుపమానం

సందేశం

ముహర్రం పేరు వినగానే గుర్తుకు వచ్చే మొదటి చారిత్రక సంఘటన... కర్బలా మైదానంలో జరిగిన అపూర్వమైన సంగ్రామం. ఖిలాఫత్‌ వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి హజ్రత్‌ హుసేన్‌ చేసిన మహత్తరమైన త్యాగానికి అది చిహ్నం. అంతేకాదు... ముహర్రం మాసంలోని పదవరోజు... ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షి.

రాజకీయపరంగా ఇస్లాం ధర్మంలో ఖలీఫా వ్యవస్థ ఉండేది తప్ప రాచరిక వ్యవస్థ లేదు. రాకుమారుడు రాజు కావడం, మంత్రి కుమారుడు మంత్రి కావడం అనే అనువంశిక వ్యవస్థ అసలే లేదు. ఖలీఫా ఎన్నిక మూడు సూత్రాల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేది. మహా ప్రవక్త అనుసరించిన పద్ధతి ప్రకారం... ఖలీఫాను ఎవరూ నియమించకూడదు, ప్రజలే ఎన్నుకోవాలి. రెండు... మొదటి ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ మాదిరిగా... మీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని ఖలీఫాగా సూచించవచ్చు. మూడోది... ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ మాదిరిగా... ఖలీఫా ఎన్నికను కొందరు మేధావులతో కూడిన సలహా సంఘానికి అప్పగించవచ్చు. వారు తమలో ఒకరిని ఖలీఫాగా ఎన్నుకుంటారు. కానీ హజ్రత్‌ మావియా తన కుమారుడైన యజీద్‌కు యువరాజ పట్టాభిషేకం చేసి... పై మూడు ధర్మ సూత్రాలను కాలరాశాడు. అక్కడి నుంచే రాచరిక వ్యవస్థ ఆరంభమయింది.


యజీద్‌ కుతంత్రం...

మహాప్రవక్త మహమ్మద్‌ దివంగతులైన తరువాత.. మొదటి ఖలీఫాగా హజ్రత్‌ అబూబకర్‌, రెండో ఖలీఫాగా హజ్రత్‌ ఉమర్‌, మూడో ఖలీఫాగా హజ్రత్‌ ఉస్మాన్‌, నాలుగో ఖలీఫాగా హజ్రత్‌ అలీ ఎన్నికయ్యారు. ఆ తరువాత ఖలీఫా అయిన హజ్రత్‌ ముఆవియా 19 ఏళ్ళపాటు అరేబియా దేశాన్ని పాలించాడు. కానీ పుత్రప్రేమతో... అయోగ్యుడైన, దురలవాట్లకు లోనైన తన కుమారుడు యజీద్‌ను యువరాజుగా నియమించాడు. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన ఈ చర్యపై దైవప్రవక్త మహమ్మద్‌ మనుమడైన ఇమామ్‌ హుసేన్‌, ఆయన అనుచరులు బాహాటంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. యజీద్‌ను రాజుగా ఒప్పుకొనేది లేదంటూ తిరుగుబాటు చేశారు. అదే సమయంలో... ఇమామ్‌ హుసేన్‌ తమ వద్దకు వస్తే ఆయనను ఖలీఫాగా గుర్తిస్తామంటూ కూఫా నగర ప్రజలు ఉత్తరాలు రాశారు. మరోవైపు ప్రజలందరూ ఉవ్వెత్తున ఉద్యమించారు. ఈ నేపథ్యంలో యజీద్‌తో ముఖాముఖి చర్చలు జరపడానికి మక్కా నగరం నుంచి కుఫా నగరానికి తన 72 మంది ప్రత్యక్ష సహచరులతో, కుటుంబ సభ్యులతో ఇమామ్‌ హుసేన్‌ బయలుదేరారు. వారు కుఫా నగరానికి చేరకమునుపే... తన ప్రభుత్వాన్ని ఇమామ్‌ హుసేన్‌ గుర్తించేలా చేయడానికి యజీద్‌ కుట్రలు పన్నాడు. కానీ యజీద్‌ను రాజుగా గుర్తించడానికి ఆయన అంగీకరించలేదు. తనలో ప్రాణం ఉన్నంతవరకు అధర్మంతో పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. దాని ఫలితమే కర్బలా యుద్ధం.


ధర్మరక్షణ కోసం...

ఇమామ్‌ హుసేన్‌ ప్రదర్శించిన ధిక్కారానికి, తిరుగుబాటు ధోరణికి యజీద్‌ ఆగ్రహోదగ్రుడయ్యాడు. అతని సైన్యం హజ్రత్‌ హుసేన్‌ను, ఆయన పరివారాన్ని కర్బలా అనే ప్రదేశం దగ్గర అటకాయించింది. వారికి నీటిబొట్టు కూడా అందకుండా ఫరాత్‌ నది ఒడ్డుపై గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇరు పక్షాల మధ్యా భీకరమైన యుద్ధం జరిగింది. శత్రువులు నాలుగువేలమంది కన్నా ఎక్కువగా ఉండడంతో ఇమాన్‌ హుసేన్‌ సైన్యంలో చాలామంది అమరులయ్యారు. చివరకు ఇమామ్‌ హుసేన్‌ ఒంటరిగా యుద్ధరంగంలో మిగిలిపోయారు. దప్పికకు తట్టుకోలేక... శత్రుమూకను చెండాడుతూ ఫరాత్‌ నదివైపు నీళ్ళకోసం వెళ్ళారు. ఈలోగా మహిళలు, పిల్లలు ఉన్న తమ గుడారాలకు నిప్పు పెట్టారనే వదంతి విని... దప్పిక తీర్చుకోకుండానే వెనుతిరిగారు. గుడారాలకు నిప్పు పెట్టలేదు కానీ తన కుమారుడు అలీ అస్గర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసింది. ఆ పసిబాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని... అతని కోసం గుక్కెడు నీళ్ళయినా ఇవ్వాలని శత్రు సైన్యాన్ని ఇమామ్‌ హుసేన్‌ ప్రాధేయపడ్డారు. కానీ పాషాణ హృదయులైన ఆ సైనికులు... ఆయన కుమారుడి మీద బాణాల పర్షం కురిపించారు. ఒక బాణం ఆ పసికందు గొంతులో దిగి... రక్తం చిమ్మింది. ఈ ఘోరాన్ని చూసిన ఇమామ్‌ హుసేన్‌ శత్రుసైన్యంపై విరుచుకుపడ్డారు. శత్రువులు ఆయనను హతమార్చడానికి నలువైపులా కమ్ముకొని ఉన్నారు. ఆరోజు నమాజ్‌ సమయం కావడంతో ఆయన యుద్ధాన్ని ఆపి... సజ్దా చెయ్యడానికి శిరస్సును భూమి మీద పెట్టారు. వెంటనే శత్రువులు ఆయన మీద దాడి చేసి హతమార్చారు. ఆయన శిరస్సును, చేతులను ఖండించారు. వాటిని బల్లేలకు, బరిసెలకు తగిలించి గంతులేశారు. ఇలా ఒక మహా మనిషి తను నమ్ముకున్న ధర్మాన్ని రక్షించడం కోసం అసువులుబాశారు. ఆయన ప్రదర్శించిన పోరాట పటిమ, అనుపమాన త్యాగం చరిత్రలో నిలిచిపోయాయి.


ఎన్నో విశిష్టతలు...

ఈ విశ్వ సృష్టి జరిగినప్పటి నుంచి ముహర్రం మాసంలో చారిత్రకమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ నెలలో పదోరోజున ప్రథమ దైవప్రవక్త స్వర్గంలోకి ప్రవేశించారు. దైవప్రవక్త హజ్రత్‌ నూహ్‌నూ, ఆయన అనుచరులను దైవం నావలో రక్షించి, శత్రువులను శిక్షించినది కూడా ఆ రోజునే. అలాగే దైవప్రవక్త హజ్రత్‌ యూను్‌సకు చేప గర్భం నుంచి విముక్తి కలిగించినది, దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీంను దుర్మార్గుడైన నమ్రూద్‌ రాజు అగ్ని గుండంలోంచి కాపాడినదీ, ఫిరౌన్‌ రాజును, అతని లక్షలాది సైన్యాన్ని సముద్రపు నీటిలో ముంచేసి... దైవప్రవక్త మూసాను, ఆయన అనుచరులను కాపాడింది కూడా ఈ రోజునే. మహాప్రవక్త మహమ్మద్‌ గారాల మనుమడు ఇమామ్‌ హుసేన్‌ ప్రాణత్యాగం చేసినది కూడా ఆ రోజే. కాబట్టే ఈ రోజుకు, తద్వారా ఈ మాసానికి ఇంతటి ప్రాధాన్యత, ఎనలేని గౌరవ ప్రతిష్టలు లభించాయి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌


ఉపవాసం పుణ్యప్రదం

ఇస్లామీయ క్యాలెండర్‌ ప్రకారం తొలి మాసం ముహర్రం. ఇది ముస్లింలు అతి పవిత్రంగా పరిగణించే నాలుగు ప్రత్యేకమైన నెలల్లో ఒకటి. ముహర్రం అంటే ‘నిషిద్ధమైన’ లేదా ‘పవిత్రమైన’ అని అర్థం. ఈ నెలలో యుద్ధాలు, హింస లాంటివి పూర్తిగా నివారించాలని ఇస్లాం హితవు చెబుతోంది. ముహర్రం మాసంలోని పదవ రోజు... హజ్రత్‌ మూసా తన జాతివారికి ఫిరౌన్‌ నుంచి విముక్తి కలిగించిన రోజు అది. కాబట్టి వారు ఆ రోజున ఉపవాసం ఉండేవారు. అంతేకాదు, అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ కూడా ఉపవాసం పాటించేవారు. ‘‘మీరు కూడా ముహర్రం ఉపవాసం చేయండి, గత ఏడాది చేసిన పాపాలు క్షమాపణ దొరుకుతుంది. రంజాన్‌ నెల ఉపవాసాల తరువాత... అల్లాహ్‌ మాసమైన ముహర్రం నెలలో పాటించే ఉపవాసాలు అత్యంత పుణ్యప్రదమైనవి, ఫర్జ్‌ నమాజుల తరువాత... రాత్రివేళ ఆచరించే తహజ్జుద్‌ నమాజులు అత్యుత్తమమైనవి’’ అని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయం ప్రకారం ముహర్రం మాసంలోని 9, 10 లేదా 10, 11 రోజుల్లో రెండు రోజులు ఉపవాసాలు పాటించాలి.

ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:12 AM