Share News

సర్వ శక్తులకూ మూలం... ఆమె

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:12 AM

‘యత్ర నార్యస్తు పూజ్యంతే... రమంతే తత్ర దేవతాః... మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు’ అన్నారు పూర్వులు. మన పురాణాలలో స్త్రీని శక్తిస్వరూపిణిగా...

సర్వ శక్తులకూ  మూలం... ఆమె

‘యత్ర నార్యస్తు పూజ్యంతే... రమంతే తత్ర దేవతాః... మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు’ అన్నారు పూర్వులు. మన పురాణాలలో స్త్రీని శక్తిస్వరూపిణిగా వర్ణించారు. ఇంతకీ ఆ శక్తి ఏమిటి? అది ఏ విధమైన శక్తి? దానికి కొలమానం ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నిటికో శ్రీమాతాజీ నిర్మలాదేవి వివిధ సందర్భాలలో సమాధానాలు ఇచ్చారు.

‘‘మన ఇతిహాసాలలో శ్రీరాముని శక్తి సీత. శివుడి శక్తి పార్వతి. కృష్ణుడి శక్తి రాధ. ఈ శక్తులు రాక్షస సంహారం కోసమో, యుద్ధం చేయడం కోసమో రణరంగానికి వెళ్ళలేదు. శ్రీరాముడు, కృష్ణుడే యుద్ధం చేశారు. కానీ ఆ శక్తుల ప్రభావం వారితో యుద్ధం చేయించింది. అందుకే... పురుషులది గతి శక్తి అయితే మహిళలది స్థితి శక్తి. బయటనుంచి చూసినప్పుడు ఫ్యాన్‌ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ దాన్ని తిప్పుతున్నది దానిలోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తి. అదే విధంగా పురుషులు పనులు చేస్తున్నట్టు కనిపించినా... వారితో ఆ పనులు చేయించేది మాత్రం మహిళల శక్తే. అందుకే స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు’’ అని నిర్మలాదేవి వివరించారు.


ఆ బాధ్యత మహిళలదే...

జీవశాస్త్రం ప్రకారం కణంలో ఉండే శక్తి కేంద్రాన్ని ‘మైటోకాండ్రియా’ అంటారు. అది మానవులలో ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించేటప్పుడు... తల్లి ద్వారానే లభిస్తుంది. అంటే ప్రతి మానవుడికి శక్తి తల్లి నుంచే సంక్రమిస్తుంది. కాబట్టి సైన్స్‌ ప్రకారం కూడా శక్తికి మూలం మహిళే. ఈ తల్లులందరికీ మూలమైన తల్లిని హిందూ ధర్మంలో ‘ఆదిశక్తి’ అని పిలుస్తారు. ఇక్కడ ‘శక్తి’ అంటే ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి అని కాదు.. ‘అన్ని శక్తులూ’ అని అర్థం. ఇవన్నీ మన సూక్ష్మ శరీరంలోని షట్చక్రాలపై ఉంటాయి. మొత్తం శక్తి కేంద్రం జగదంబగా మన హృదయ చక్రంలో ఉంటుంది. ఇది చాలా ప్రబలమైనది. ఈ శక్తి ఆరాధన ద్వారా... సర్వ దేవతా శక్తులకూ పూజ జరుగుతుంది. ఆ శక్తులు చెడిపోతే మన శరీరంలోని చక్రాలు దెబ్బతింటాయి. మనకు శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఈ శక్తులను ప్రసన్నంగా ఉంచుకోవాలి. అందుకే దేవీ ప్రసన్నం చేసుకోవాలని అంటూ ఉంటారు. ‘‘స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెను గౌరవించడం గృహిణిని గృహలక్ష్మిగా భావించడం చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ మహిళలను ఇబ్బంది పెడితే అక్కడ దేవతలు నివసించరు. మహిళలకు, పురుషులకు మధ్య సమతుల్యత లేనప్పుడు ఇంట్లో ప్రశాంతత కొరవడుతుంది. పిల్లలపై ఆ దుష్ప్రభావం పడుతుంది. చివరకు సమాజం నాశనం అవుతుంది. దీన్ని నివారించే బాధ్యత ప్రధానంగా మహిళలపైనే ఉంది’’ అని నిర్మలాదేవి స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత కాలంలో మహిళల్లో ఆధ్యాత్మిక ఔన్నత్యం తగ్గడం, విలువలు పోగొట్టుకోవడం జరుగుతోంది. పోటీతత్వం, ధనాశ లాంటివి పెరిగాయి. నిరర్ధకమైన విషయాల్లో ఆసక్తి పెరగడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతిపై శ్రద్ధ తగ్గుతోంది. న్యాయబుద్ధి, మంచి నడవడి, జాలి అనేవి స్రీలకు సహజమైన గుణాలు. కరుణ ఆమెకు అలంకారం. మహిళలు తమకున్న శక్తిని గుర్తించినట్టయితే ఈ ప్రపంచాన్ని అత్యంత సుందరంగా మార్చగలరు. కొందరు మహిళలు ఈ మార్గంలో చక్కటి ఉన్నతిని సాధించారు. ఒక శక్తిమంతుడైన పురుషుణ్ణి చూసినప్పుడు... అతని వెనుక ఒక స్త్రీ ఉందని మనం వెంటనే గుర్తించవచ్చు. స్త్రీలకు అటువంటి శక్తులు ఉన్నాయి’’ అనేది నిర్మలాదేవి ఇచ్చిన సందేశం.


రక్షణ కవచం

‘‘మహిళలను భూమాతతో పోలుస్తారు. భూమాత ఎంతో ఒత్తిడిని భరిస్తూ మొత్తం ప్రపంచానికి ఆధారంగా నిలుస్తుంది. మహిళలకు ఈ పృధ్వీ తత్త్వాన్ని భగవంతుడే ఇచ్చాడు. అయితే మహిళలను దిగజార్చడానికి ప్రతికూల శక్తులు ఎన్నో ఎదురుచూస్తూ ఉంటాయి. అవి మహిళలను ప్రలోభాలకు, ఆకర్షణలకు గురి చేస్తాయి వాటికి లొంగకూడదు. మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనది. వారిని శక్తి స్వరూపిణులుగా భావించి గౌరవించాలి. దీనివల్ల మనలోని వివిధ చక్రాలు చైతన్యవంతం అవుతాయి’’ అని నిర్మలాదేవి సోదాహరణంగా వివరించారు. ‘‘మహిళ తన సంపూర్ణ శక్తులను వెలికితీసి ఉపయోగించినప్పుడు... ఆమె చాలా శక్తిమంతురాలిగా, భీకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ వాదిస్తూ, కొట్లాడుతూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తించినప్పుడు ఆ శక్తులన్నీ వృధా అవుతాయి. ఆమె కావాలనుకుంటే పురుషులకన్నా ఎక్కువగా పని చేయగలదు. అయితే మొదట ఆమె నమ్రతగా, అణకువగా, హుందాతనంతో, చక్కటి అవగాహనతో, వాత్సల్యపూరితంగా ఉండాలి.


తనలోని శక్తులను గౌరవించుకోవాలి, శాంతిని నెలకొల్పడం నేర్చుకోవాలి. ఒక కవచంలా రక్షణ కల్పించడం స్త్రీల బాధ్యత. కత్తి, కవచం ఒకటి చేసే పని మరొకటి చేయలేకపోవచ్చు. కానీ రెండిటిలో కవచమే గొప్ప. ఎందుకంటే అది కత్తి దెబ్బను తట్టుకోవాలి. కత్తి విరుగుతుందేమో కానీ కవచం విరగదు’’ అని ఆమె పేర్కొన్నారు. మహిళలు తమలోని శక్తులను గుర్తించాలి. వాటిలో స్థిరపడాలి. నమ్రత అనేది ఈ శక్తులకు గొప్ప ఇరుసులాంటిది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎన్నో హింసాత్మకమైన, అనైతికమైన కార్యక్రమాలను చూస్తున్నాం. వీటి ప్రభావం సమాజం మీద... ప్రధానంగా చిన్న పిల్లల మీద పడుతోంది. మహిళలు సహజయోగ మార్గాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా సమాజంలో పరివర్తన తీసుకురాగలరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధన చేస్తున్న ఎందరో మహిళలు... శ్రీమాతాజీ నిర్మలాదేవి అనుసరించిన, ప్రబోధించిన ధర్మాలను ఆచరిస్తున్నారు. ఉత్తమ కుటుంబ సభ్యులుగా, సమాజ పౌరులుగా తమతమ దైనందిన జీవితంలో ప్రశాంతమైన, సమతుల్యమైన జీవితం గడుపుతున్నారు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ


Also Read:

బియ్యం నీటిని పారేస్తున్నారా.. వాటితో అద్భుత ప్రయోజనాలు..

అబ్బాయిలూ ఈ టిప్స్ పాటిస్తే అమ్మాయిలు ఫిదా ..

Updated Date - Mar 07 , 2025 | 07:12 AM