Share News

Tibetan Buddhism: మౌనమే జ్ఞానం

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:16 AM

టిబెట్‌కు చెందిన బౌద్ధ గురువుల్లో ప్రసిద్ధి చెందినవాడు మార్ప. ఒకసారి ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి... ‘‘మీరు చాలా గొప్ప జ్ఞాని అని విన్నాను. మీరు జ్ఞాని అనే విషయాన్ని మాటలు ఉపయోగించకుండా నాకు...

Tibetan Buddhism: మౌనమే జ్ఞానం

సద్బోధ

టిబెట్‌కు చెందిన బౌద్ధ గురువుల్లో ప్రసిద్ధి చెందినవాడు మార్ప. ఒకసారి ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి... ‘‘మీరు చాలా గొప్ప జ్ఞాని అని విన్నాను. మీరు జ్ఞాని అనే విషయాన్ని మాటలు ఉపయోగించకుండా నాకు తెలియజేస్తే సంతోషిస్తాను’’ అన్నాడు. అప్పుడు మార్ప నవ్వి ‘‘సరే! ముందు మాటలు ఉపయోగించకుండా మీరు ప్రశ్నించండి. తరువాత మాటలు వాడకుండా దాన్ని మీకు తెలియజేస్తాను’’ అన్నాడు. ‘‘అదెలా సాధ్యం?’’ అని అడిగాడు ఆ వ్యక్తి. ‘‘అది నా సమస్య కాదు, మీ సమస్య. మీరే బాగా ఆలోచించి, దానికి పరిష్కారాన్ని కనుక్కొని రండి’’ అన్నాడు మార్ప.

‘మాటలు ఉపయోగించకుండా ప్రశ్నించడం ఎలా?’ అని ఆ వ్యక్తి తీవ్రంగా ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు. ఏళ్ళ తరబడి అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. అలా ఆలోచించి, ఆలోచించి చివరకు అదే అతని మనస్సులో నిలిచిపోయింది. ఒక రోజు తెలియని ఆనందమేదో అతని హృదయంలో పెల్లుబికింది. తను మార్తను ప్రశ్నించినట్టు, తనకు సమాధానం లభించినట్టు అనిపించింది.


సరిగ్గా అదే సమయంలో మార్ప వచ్చి ఆ ఇంటి తలుపు తట్టాడు. ఆ వ్యక్తి తలుపు తీశాడు. అతని ఎదురుగా నవ్వుతూ నిలబడిన మార్ప... ‘‘మాటలు వాడకుండా మీరు ప్రశ్నించారు. నేనూ మీకు అదే విధంగా బదులు ఇచ్చాను’’ అన్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు నడిచారు. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి ఏదీ మాట్లాడకుండా... కేవలం నవ్వుతూ మార్ప వెంట అతని నీడలా ఊరూరూ తిరిగేవాడు. అతణ్ణి చూసినవారు మార్పతో ‘‘గురువుగారూ! అతను మాట్లాడకుండా ఎప్పుడూ నవ్వుతూ ఎందుకు ఉంటాడు? మీరు అతణ్ణి ఏం చేశారు?’’ అని అడిగాడు. ‘‘అతను ఒక విషయం గురించి ఏమీ మాట్లాడకుండా ప్రశ్నించాడు. నేనూ ఏమీ మాట్లాడకుండానే అతనికి సమాధానం ఇచ్చాను. అంతే!’’ అన్నాడు మార్ప. జ్ఞానం పొందడానికి మాటలు అక్కరలేదు. మౌనమే జ్ఞానం పండితులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రజల నుంచి సన్మానాలను, ప్రశంసలను పొందుతారు. సద్గురువులు, జ్ఞానులు, అవతార పురుషులు... భాషాతీతమైన, భావాతీతమైన శక్తిని (శక్తిపాతం ద్వారా) ప్రసరింపజేసి, ఎదుటివారిలో జ్ఞానాన్ని ప్రజ్వలింపజేస్తారు. వారిని దివ్యమూర్తులుగా తీర్చిదిద్దుతారు. కళాశాల విద్యార్థి అయిన నరేంద్రుణ్ణి కేవలం ఒక స్పర్శతో.... ప్రపంచ ప్రఖ్యాతుడైన వివేకానందస్వామిగా శ్రీరామకృష్ణ పరమహంస ప్రకాశింపజేశారు. బడికి వెళ్ళే ఒక బాలుణ్ణి... ఒక ముద్దుతో మెహర్‌బాబాబాగా, లక్షలాదిమందికి ఆరాధ్యదైవంగా బాబాజాన్‌ నిలబెట్టింది. మార్ప చేసింది కూడా అలాంటిదే. అందుకే ఆ వ్యక్తిలో నిరంతరం ఆనందం తొణికిసలాడింది. ఆ ఆనందంతో అతని జీవితం నిండిపోయింది.

రాచమడుగు శ్రీనివాసులు


సద్గురువులు, జ్ఞానులు, అవతార పురుషులు... భాషాతీతమైన, భావాతీతమైన శక్తిని (శక్తిపాతం ద్వారా) ప్రసరింపజేసి, ఎదుటివారిలో జ్ఞానాన్ని ప్రజ్వలింపజేస్తారు. వారిని దివ్యమూర్తులుగా తీర్చిదిద్దుతారు. కళాశాల విద్యార్థి అయిన నరేంద్రుణ్ణి కేవలం ఒక స్పర్శతో.... ప్రపంచ ప్రఖ్యాతుడైన వివేకానందస్వామిగా శ్రీరామకృష్ణ పరమహంస ప్రకాశింపజేశారు.

ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:16 AM