Share News

Temple Architecture: గోపురం అంటే

ABN , Publish Date - Sep 26 , 2025 | 03:08 AM

‘గోపురం’ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘గో’ అంటే వేదాలు, ‘పురం’ అంటే పాలనలో ఉండేది. అంటే స్వర్గానికి ప్రతీకగా చెప్పవచ్చు. ‘గో’ అంటే గోవు అని అర్థం. సకల దేవతా స్వరూపమైన గోవుకు నమస్కరిస్తే ఎలాంటి...

Temple Architecture: గోపురం అంటే

తెలుసుకుందాం

‘గోపురం’ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘గో’ అంటే వేదాలు, ‘పురం’ అంటే పాలనలో ఉండేది. అంటే స్వర్గానికి ప్రతీకగా చెప్పవచ్చు. ‘గో’ అంటే గోవు అని అర్థం. సకల దేవతా స్వరూపమైన గోవుకు నమస్కరిస్తే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయో... సకల దేవతా స్వరూపాలను కలిగి ఉన్న గోపురానికి నమస్కరిస్తే అంతే పుణ్యఫలాలు కలుగుతాయి. ‘గో’ అంటే దిక్కు. పురానికి దిక్కులాంటిది గోపురం. పూర్వం కాలినడకన వెళ్ళే బాటసారులకు గోపురాలు దిక్సూచిగా ఉపయోగపడేవి. ‘గో’ అంటే వజ్రాయుధం. పురాన్ని వజ్రాయుధంలా రక్షించేది గోపురం. సాధారణంగా పట్టణాల్లో, నగరాల్లో అత్యంత ఎత్తుగా గోపురమే ఉంటుంది. ఆ గోపురం పైన ఉందే రాగి స్థూపం (స్థూపి) ఆకాశంలోంచి వచ్చే పిడుగుల తీవ్రతను తగ్గిస్తుంది. పురాన్ని వజ్రాయుధంలా రక్షిస్తుంది. జన, ఆస్తి నష్టాన్ని నివారిస్తుంది.

గోపురాలు ఎక్కడ ఉండాలి?

దేవాలయ ముఖద్వారం దగ్గర, పట్టణ ముఖద్వారాల దగ్గర (పూర్వం దేవాలయ పరిధిలోనే పట్టణాలు ఉండేవి, ఉదాహరణకు... శ్రీరంగం, తిరువణ్ణామలై) గోపురాలను నిర్మించాలి. ప్రాకారం నలు దిక్కుల్లో, ప్రతి ప్రాకారానికి గోపురాలు నిర్మించవచ్చు. న్యాయశాల, నాటకశాల, రంగశాల, హస్తిశాల తదితర ప్రదేశాల్లో కూడా గోపురాలు ఏర్పాటు చేయవచ్చని ‘విశ్వకర్మ వాస్తుశాస్త్రం’ తెలిపింది. ఇవేకాకుండా... రాజులు, చక్రవర్తులు ఏదైనా దండయాత్రలో విజయం సాధించినప్పుడు... తమ విజయ చిహ్నంగా గోపురాల్ని నిర్మించడం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు.. శ్రీకాళహస్తిలో పూర్వం ఉన్న విజయ గోపురం. అలాగే పర్వత ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు చేరుకొనే కాలిబాటలలో కూడా గోపుర నిర్మాణాలు కనిపిస్తాయి. రాజులు, చక్రవర్తులు తమకు భగవంతునిపై ఉన్న భక్తిభావాన్ని ఎత్తయిన గోపుర నిర్మాణాల ద్వారా చాటుకొనేవారు. దేవాలయాలలో గోపురాలను దేవాలయం ప్రాకారం మధ్యలో... అంటే గర్భాలయ ద్వారానికి ఎదురుగా నిర్మించాలి. దేవాలయం నలువైపులా... ప్రాకారాల మధ్యలో గోపురాలను కట్టవచ్చు. గోపురాన్ని ధ్వజస్తంభం నుంచి కాస్త ఎక్కువ దూరంలో నిర్మించాలి. శ్రీరంగం, మధురై, తిరువణ్ణామలై తదితర ఆలయాలు ఎత్తయిన అనేక గోపురాలతో విరాజిల్లుతున్నాయి. గోపురాల సంఖ్యను ప్రాకారాలను అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది.


గర్భాలయంలో ఉండే భాగాలనే గోపుర నిర్మాణంలో కూడా అనుసరిస్తారు. కానీ ఈ రెండిటి నిర్మాణానికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. గోపురంలో ప్రధానంగా చిత్రవానం, ఉపపీఠం, అధిష్ఠానం, పాదవర్గం, ప్రస్తరం, కర్ణకూడం, వేదిక, కంఠం, శిఖరం, స్థూపి అనే భాగాలు ఉంటాయి చిత్రవానం నుంచి పాదవర్గం వరకూ రాతితో నిర్మించి, ప్రస్తరం నుంచి శిఖరం వరకూ ఇటుకలతో నిర్మించే పద్ధతి ఉంది. ఆధునిక కాలంలో చిత్రవానం నుంచి శిఖరం వరకూ ఇటుకలతో నిర్మించడం జరుగుతోంది. అలాగే ఆర్‌.సి.సి.తో స్ట్రక్చర్‌తో కట్టి, ఇటుకలతో అలంకారాలు చేస్తూ గోపురాలు నిర్మిస్తున్నారు.

దగ్గుపాటి నాగవరప్రసాద్‌ స్థపతి

9440525788

Also Read:

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..

Updated Date - Sep 26 , 2025 | 03:08 AM