Divine Path: అప్పుడే భక్తి పరిపూర్ణం
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:15 AM
దేవుడు ప్రేమమయుడు. సర్వ జీవుల మీదా ఆయన ప్రేమ నిరవధికంగా, సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన ప్రేమే ఈ విశాల విశ్వంగా రూపుదిద్దుకుంది. మానవులందరూ తన పట్ల, తోటి...
దైవమార్గం
దేవుడు ప్రేమమయుడు. సర్వ జీవుల మీదా ఆయన ప్రేమ నిరవధికంగా, సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన ప్రేమే ఈ విశాల విశ్వంగా రూపుదిద్దుకుంది. మానవులందరూ తన పట్ల, తోటి మానవుల పట్ల ప్రేమతో ఉండాలని ఆయన ఆశించాడు. ‘‘నీవు నిండు హృదయంతో నీ దేవుణ్ణి ఆరాధించు, ప్రేమించు’’, ‘‘నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు, సేవించు’’ అనే రెండు వాక్యాలు బైబిల్‌లో ఉన్నాయి. వాటిలో ఒకటి దైవ ప్రేమకు, మరొకటి మానవ సేవకు సంకేతాలుగా కనిపిస్తాయి.
తాను ఎంతో ప్రేమించే ఈ లోకం భ్రష్టమవుతూ ఉంటే, దాన్ని పునరుద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. తాను సృష్టించిన ఈ సుందర విశ్వానికి భంగం కలిగి, తనపై శపధం చేసిన సాతాను పన్నిన వలలో తన బిడ్డలు చిక్కుకొని భ్రష్టులయ్యే దశలో... లోకోద్ధరణ కోసం తన కుమారుడైన క్రీస్తును మానవ లోకానికి పంపించాడు. ఈ లోకం పట్ల ప్రేమతో ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేశాడు. ప్రభువు జననం, ఆయన చేసిన బోధలు, చూపిన మార్గం... ఇవన్నీ మానవుల పట్ల దైవానికి ఉన్న ప్రేమకు తార్కాణాలు. దీనిని క్రీస్తు జననంలోని పరమ రహస్యంగా క్రైస్త్రవులు విశ్వసిస్తారు. క్రిస్మ్‌సకు ముందు నెలరోజులు... తెల్లవారుజామున ప్రార్థనలు చేస్తారు. రాబోయే దైవకుమారుడికి స్వాగతం చెప్పడానికి నిరీక్షిస్తారు.
ప్రభువులోని ప్రేమతత్త్వమే ఈ విశ్వంలో సేవగా పరిణమించింది. దేవునిపై ఉండే ప్రేమ సాటి మానవుడికి చేసే సేవగా రూపాంతరం చెందాలి. అప్పుడే దైవభక్తి పరిపూర్ణం అవుతుంది. దేవుణ్ణి ప్రేమించే కొద్దీ విశ్వాన్ని ప్రేమిస్తాం, సేవిస్తాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం ఎంత ప్రధానమో... మన తోటివారిని ప్రేమించడం కూడా అంతే ముఖ్యం. ప్రేమించడం నేర్చినవాడు సేవను కూడా అలవోకగా నేర్చుకుంటాడు. దైవ ప్రేమ మానవసేవగా పరిణమించే క్రమం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్, 9866755024
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News