Meenal Majundar: సాంకేతికత వైపు నడిపిస్తున్నారు
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:27 AM
అట్టడుగు వర్గాల పిల్లలకు అండగా నిలబడ్డారు. రోబోటిక్స్, కోడింగ్, ఏఐ వంటివి నేర్పించి... వారి భవితకు బంగారు బాట వేస్తున్నారు. దాని కోసమే ‘ది ఇన్నోవేషన్ స్టోరీ’ నెలకొల్పి... చదువు అవ్వగానే ఉపాధి అవకాశాలు అందుకొనేలా పిల్లలను తీర్చిదిద్దుతున్న 53 ఏళ్ల మీనల్ మజుందార్ కథ ఇది.

ఉన్నత చదువు... దానికి తగిన కొలువు... జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. సమాజానికి తనవంతుగా తిరిగివ్వాలన్న సంకల్పం ఆమెను కుదురుగా కూర్చోనివ్వలేదు. అందుకే కోరి తెచ్చుకున్న ఉద్యోగం వదిలేసి... అట్టడుగు వర్గాల పిల్లలకు అండగా నిలబడ్డారు. రోబోటిక్స్, కోడింగ్, ఏఐ వంటివి నేర్పించి... వారి భవితకు బంగారు బాట వేస్తున్నారు. దాని కోసమే ‘ది ఇన్నోవేషన్ స్టోరీ’ నెలకొల్పి... చదువు అవ్వగానే ఉపాధి అవకాశాలు అందుకొనేలా పిల్లలను తీర్చిదిద్దుతున్న 53 ఏళ్ల మీనల్ మజుందార్ కథ ఇది.
‘‘రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో సాంకేతికత అన్ని రంగాలకూ విస్తరించింది. పాఠశాల దశ నుంచే పిల్లలకు ఆ దిశగా బలమైన పునాదులు పడాలి. లేదంటే భవిష్యత్తులో కెరీర్ పరంగా ఎంతో నష్టపోతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే నేను ‘ది ఇన్నోవేషన్ స్టోరీ’ (టీఐఎస్) ప్రారంభించాను. వెనుకబడిన వర్గాల పిల్లలకు ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్)ను ఒక ప్రాజెక్టుగా తీసుకొని బోధించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా రోబోటిక్స్, కోడింగ్, ఆర్ట్‌ఫిషియల్ ఇంటలిజన్స్ వంటివి చిన్న వయసులోనే పరిచయం చేస్తున్నాం. ఫలితంగా చదువు పూర్తవుతూనే వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పేదరికం నుంచి అభివృద్ధిపథం వైపు అడుగులు వేయడానికి ఆ కుటుంబాలకు నేను చేస్తున్న చిరు సాయంగా దీన్ని భావిస్తున్నాను.
మా అమ్మాయివల్ల...
బ్యాంకులో మంచి ఉద్యోగం వదిలేసి ఇటువైపు రావడానికి ప్రధాన కారణం మా అమ్మాయి. ఆ కారణం ఏంటో తెలియాలంటే నా గురించి చెప్పాలి. నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. బాగా చదువుకొని, ఉన్నత స్థానంలో ఉండాలనేది నా చిన్ననాటి ఆకాంక్ష. దాని కోసం కష్టపడి చదివాను. ఇంజనీరింగ్ తరువాత ఎంబీఏ చేద్దామనుకున్నాను. కోల్‌కతా ఐఐఎంలో సీటు వచ్చింది. ఎంబీఏ పూర్తయ్యాక ఐసీఐసీఐ సెక్యూరిటీ్‌సలో ఉద్యోగం వచ్చింది. కొద్ది కాలంలోనే సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ హోదాకు వెళ్లాను. జీవితాంతం బ్యాంకర్‌గానే ఉండాలనేది అప్పటి నా ఆలోచన. ఆ ఉద్యోగం నాకు బాగా నచ్చింది. కానీ అక్కడే నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. మా అమ్మాయి అప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. తను స్కూలు రోబోటిక్స్ టీమ్‌లో భాగస్వామి కావాలనుకుంది. నేను సరే అనడంతో టీమ్‌లో చేరింది. నలభై మంది టీమ్‌లో తను ఒక్కతే అమ్మాయి కావడంతో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. తనను బయటి వ్యక్తిలా చూసేవారు. అవన్నీ భరించలేక, అక్కడ ఏమీ నేర్చుకోలేక ఇబ్బందులు పడింది. నాది ఇంజనీరింగ్ నేపథ్యం కావడంతో ఇంటి దగ్గర నేనే రోబోటిక్స్ నేర్పించాను. టెక్నాలజీకి సంబంధించి ప్రతి విషయంలో తనకు మార్గదర్శిగా ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే... తరగతి గదుల్లో ఎంత బోధించినా పెద్దగా ఫలితం ఇవ్వదని. దానికి బదులు పిల్లలను నిజమైన ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేస్తే వారి ఆలోచనాశక్తి పెరుగుతుందని... సమస్య ఉత్పన్నమైనప్పుడు సొంతంగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యం అలవడుతుంది..! అంటే అనుభవపూర్వకంగా అభ్యాసం అనమాట.
వారిని చూశాక...
కొవిడ్ సమయంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆన్‌లైన్ బోధన మొదలైంది. కానీ పేద వర్గాలకు చెందిన అనేకమంది విద్యార్థులు మొబైల్, ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పల వంటి సౌకర్యాలు లేక తరగతులకు దూరమయ్యారు. ఇది నన్ను కలచివేసింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ‘సలామ్ బాంబే ఫౌండేషన్’తో కలిసి పని చేశాను. ముఖ్యంగా కొవిడ్ సమయంలో 18 లక్షల రూపాయలు సేకరించి, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు కొని ఇచ్చాను. కోల్‌కతా ఐఐఎంలో చదివినప్పుడు ఒక బలమైన బృందాన్ని నిర్మించాను. కొవిడ్ సమయంలో ఆ బృందం నా సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా సహకరించింది. అయితే కొద్దిమంది పిల్లలకు మాత్రమే ల్యాప్‌టా్‌పలు ఇవ్వగలిగాను. మరి మిగిలినవారి పరిస్థితి ఏంటి? వారి చదువు కొనసాగేదెట్లా? ల్యాప్‌టా్‌పలు ఇచ్చినంతమాత్రాన సమస్య పరిష్కారం కాదని అప్పుడు గ్రహించాను. పాఠ్యపుస్తకాల్లో విద్య మాత్రమే కాకుండా ప్రపంచంతో పోటీపడాలంటే విద్యార్థి దశ నుంచే రోబోటిక్స్, ఏఐ లాంటి సబ్జెక్ట్‌లు కూడా అవసరమని భావించాను.
‘టీఐఎ్‌స’కు శ్రీకారం...
నేను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయాలంటే పూర్తి సమయం దానికి కేటాయించాలి. అప్పుడే న్యాయం చేయగలుగుతానని అనిపించింది. వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. బ్యాంకింగ్ రంగంలో పధ్నాలుగేళ్ల నా ప్రస్థానం ముగిసింది. 2021లో ‘టీఐఎ్‌స’కు అంకురార్పణ జరిగింది. పేద, ప్రభుత్వ పాఠశాలల పిల్లలతో పాటు ఆసక్తిగల ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు కూడా ఏఐ, రోబోటిక్స్, వెబ్‌డెవల్‌పమెంట్, 3డీ క్యాడ్ వంటివి నేర్పిస్తున్నాం. మొదటి ఏడాది 250 మందికి శిక్షణ ఇచ్చాం. దీనికోసం ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీ-ఢిల్లీ, ఐఐఎ్‌ససీ- బెంగళూరు, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్, క్యాప్‌జమినీ, టాటా క్యాపిటల్‌తో కలిసి పని చేస్తున్నాం. మా దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు పలు జాతీయ, అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో అధిక శాతం అట్టడుగు వర్గాల పిల్లలే. ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. దీని ద్వారా ఇప్పటివరకు పది వేలమందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందారు. రాబోయే ఐదేళ్లలో పది లక్షల మందికి మా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను.’’
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News