Skin Whitening Dangers: చర్మానికి ఆ క్రీమ్స్ వద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:32 AM
డాక్టర్! నేను గత కొన్నేళ్లుగా చర్మం తెల్లబడడం కోసం క్రీమ్స్ వాడుతున్నాను. వాటితో చర్మం తెల్లబడింది. అయితే గత కొన్ని రోజులుగా చర్మం కొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. ఎండలోకి వెళ్తే...
కౌన్సెలింగ్
డాక్టర్! నేను గత కొన్నేళ్లుగా చర్మం తెల్లబడడం కోసం క్రీమ్స్ వాడుతున్నాను. వాటితో చర్మం తెల్లబడింది. అయితే గత కొన్ని రోజులుగా చర్మం కొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. ఎండలోకి వెళ్తే చర్మం ఎర్రబడుతోంది. ఎలాంటి క్రీమ్ పూసుకున్నా, చర్మం మండుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ క్రీమ్స్ వాడడం వల్లే ఇలా జరిగిందా?
- ఓ సోదరి, హైదరాబాద్.
స్వీయ చికిత్సలో భాగంగా కొత్త చర్మ సమస్యలను కొని తెచ్చుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. చర్మాన్ని తెల్లబరిచే క్రీమ్‌లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా అందుబాటులో ఉండడంతో, ఎవరికి వారు వాటిని కొని వాడేస్తున్నారు. ఇవి తక్షణ ఫలితాన్ని కనబరుస్తూ ఉండడంతో అదే పనిగా ఏళ్ల తరబడి వాటినే వాడుకుంటూ ఉండిపోతున్నారు. కానీ చర్మాన్ని తెల్లబరిచే క్రీమ్స్‌లో స్టిరాయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని పలుచన చేస్తాయి. దాంతో చర్మం సున్నితంగా మారిపోయి, ఎండలోకి వెళ్లినప్పుడు మంట పెడుతుంది, కందిపోతూ ఉంటుంది. వీటినే ఏళ్ల తరబడి వాడుకోవడం వల్ల చర్మం మరింత దెబ్బతిని, నల్లబడుతుంది. మొటిమలు, రోమాలు కూడా పెరుగుతాయి. ఇలా చర్మం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత, వెంటనే చర్మ వైద్యుల చేత చర్మ చికిత్సలు చేయించుకోవడం సాధ్యపడదు. దెబ్బతిన్న చర్మం పూర్తిగా కోలుకోడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం అవసరమవుతుంది. అప్పటివరకూ చర్మ చికిత్సలకు చర్మం అనువుగా మారదు. కాబట్టి ఏదైనా చర్మం తెల్లబడే క్రీమ్ వాడుతూ, ఫలితం సత్వరమే కనిపిస్తుంటే, వెంటనే ఆ క్రీమ్ వాడకాన్ని ఆపేయాలి. స్నేహితుల సలహాల మేరకు వీటిని వాడుకోకూడదు. ‘ఈ క్రీమ్‌ను మేమే స్వయంగా తయారుచేశాం, ఇది పూర్తిగా సహజసిద్ధమైనది, ఎలాంటి రసాయనాలు లేని ఈ క్రీమ్ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది’ అంటూ తప్పుదారి పట్టించే బ్యూటీ పార్లర్ల మాటలు వినకూడదు. చర్మ వైద్యులు సూచించకుండా ఇలాంటి క్రీమ్స్ వాడుకోవడం ప్రమాదకరం.
తెల్లని చర్మం కలిగి ఉండడం కంటే ఆరోగ్యవంతమైన చర్మాన్ని కలిగి ఉండడం ముఖ్యం. తక్కువ సమయంలో చర్మాన్ని తెల్లబరుచుకోవడం కోసం స్టిరాయిడ్ క్రీమ్స్‌ను ఆశ్రయించడం వల్ల తాత్కాలికంగా చర్మం తెల్లబడినట్టు కనిపించినా, దీర్ఘకాలంలో చర్మం పూర్తిగా సరిదిద్దలేనంతగా దెబ్బతింటుంది. కాబట్టి రంగు తక్కువ ఉన్నవారు, పెళ్లి కోసం తెల్లబడాలనుకుంటున్న వాళ్లు, చర్మాన్ని తెల్లబరుచుకోవడం కోసం అనుభవజ్ఞులైన చర్మ వైద్యులనే సంప్రతించి, చర్మ తత్వానికి తగిన చికిత్సలను ఆశ్రయించాలి.
డాక్టర్ స్వప్నప్రియ,
డెర్మటాలజిస్ట్,
కాస్మోస్యూర్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి