A Nutritious Winter Snack: బొబ్బర్లు తిందాం రండి
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:35 AM
బొబ్బర్లను అలసందలు అని కూడా పిలుస్తుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బొబ్బర్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
బొబ్బర్లను అలసందలు అని కూడా పిలుస్తుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బొబ్బర్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
బొబ్బర్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు మంచి ఆహారమని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల కండరాలకు శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసిన తరువాత ఒక కప్పు ఉడికించిన బొబ్బర్లు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది.
బొబ్బర్లలో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ వేగవంతమవుతుంది. కడుపులో ఆమ్లత్వం, అజీర్తి, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గుతాయి. పేగులు శుభ్రపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. బొబ్బర్లు ఆకలిని నియంత్రించి శరీరం బరువు పెరగకుండా కాపాడతాయి.
బొబ్బర్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిలో కేలరీలు కూడా నామమాత్రంగానే ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు, అధిక బరువుతో బాధపడేవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
బొబ్బర్లలో గర్భిణులకు అవసరమైన ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే శిశువుల్లో పుట్టుక లోపాలు ఏర్పడకుండా కాపాడుతుంది.
బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. బొబ్బర్లను తినడం వల్ల అకాల వార్థక్యం దరిచేరదు.
బొబ్బర్లలో ఎ, బి, సి, కె విటమిన్లతోపాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, మాంగనీస్ లాంటి మినరల్స్ ఉంటాయి. తరచూ బొబ్బర్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నీరసం తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఎముకలు బలోపేతమవుతాయి. మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది.
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ