Share News

A Zen Masters Last Lesson: ఆఖరి సందేశం

ABN , Publish Date - Aug 29 , 2025 | 01:20 AM

ఒక జెన్‌ గురువుకు దేశమంతటా ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఆయన ఉపదేశాలకోసం వారు నిరంతరం ఎదురుచూస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం ఆయన ‘‘ఇవాళ సాయంత్రం తనువు చాలిస్తాను. మన వాళ్ళందరికీ తెలియజెయ్యండి’’ అని...

A Zen Masters Last Lesson: ఆఖరి సందేశం

జెన్‌ కథ

ఒక జెన్‌ గురువుకు దేశమంతటా ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఆయన ఉపదేశాలకోసం వారు నిరంతరం ఎదురుచూస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం ఆయన ‘‘ఇవాళ సాయంత్రం తనువు చాలిస్తాను. మన వాళ్ళందరికీ తెలియజెయ్యండి’’ అని తన శిష్యులకు చెప్పాడు. ఈ సమాచారం దావానలంలా నలుమూలలకూ పాకింది. చివరిసారి గురువును సందర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో శిష్యులందరూ అక్కడికి వచ్చిచేరారు.

ముఖ్యుడైన ఒక శిష్యుడు మాత్రం గురువును వదలి దూరంగా ఉన్న సంతకు బయలుదేరాడు. ‘వేరే ప్రదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటే... ఈ ముఖ్య శిష్యుడు వెళ్ళిపోవడం ఏమిటి?’ అని అందరూ ఆశ్చర్యపోయారు. దారిలో అతనికి ఎదురుపడిన కొందరు ‘‘గురువుగారి చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు?’’ అని ప్రశ్నించారు.

‘‘నేను గురువుగారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను. ఆయనకు చాలా ఇష్టమైన ఒక ఆహార పదార్థం ఉంది. దాన్ని ఆయనకు తెచ్చి ఇద్దామని వెళుతున్నాను’’ అంటూ ఆ శిష్యుడు పరుగులు తీశాడు.

అక్కడ కుటీరంలో గురువుకు చివరి క్షణాలు దగ్గర పడుతున్నకొద్దీ శిష్యగణంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. గురువు కళ్ళు మూసుకొని పడుక్కున్నాడు. అప్పుడప్పుడు కళ్ళు తెరచి, తన ప్రియశిష్యుడికోసం చూసి, అతను లేడని గ్రహించి, మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు. కొంతసేపటికి ఆ శిష్యుడు వచ్చి గురువు ముందు నిలబడ్డాడు. గురువు కళ్ళు తెరచి ‘‘వచ్చావా నాయనా! నాకు ఇష్టమైనది తెచ్చావా?’’ అని అడిగాడు.


అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ‘గురువుకు ఏదీ చెప్పకుండానే ఆ శిష్యుడు సంతకు వెళ్ళాడు. అతను తనకు ఇష్టమైన ఆహార పదా ర్థాన్ని తీసుకురావడానికి వెళ్ళాడని గురువుకి ఎలా తెలుసు?’ అని గుసగుసలాడుకున్నారు. ఇంతలో ఆ శిష్యుడు తన చేతిలోని పదార్థాన్ని ఇవ్వబోతే... గురువు తన రెండు చేతులూ చాపి దాన్ని అందుకున్నాడు. ‘‘ఈ చివరి క్షణాల్లో కూడా మీ చేతులు వణకడం లేదే?’’ అని చుట్టూ ఉన్న ఇతర శిష్యులు అడిగారు. ‘‘నాకు చావంటే భయం ఉంటే కదా... చేతులు వణికేది’’ అన్నాడు గురువు. తన చేతుల్లోని ఆ పదార్థాన్ని తినేశాడు. అప్పటివరకూ ఓపికగా నిలబడిన శిష్యులు ‘‘గురువుగారూ! మీ ఆఖరి సందేశం కోసం ఎదురుచూస్తున్నాం. మీరు మాకు ఇచ్చే చివరి సందేశం ఏమిటి?’’ అని అడిగారు. గురువు నవ్వి ‘‘ఈ పదార్థం చాలా బాగుంది’’ అని చెబుతూ కన్నుమూశాడు.

ఈ కథను ఓషో ఒక సందర్భంలో వివరిస్తూ ‘‘ఆ గురువు ముంచుకొస్తున్న మృత్యువు గురించి చింతించలేదు. జీవించి ఉన్న చివరి క్షణాన్ని ఎలా ఆనందంగా గడపవచ్చో చేసి చూపించాడు. అదే అతను శిష్యులకు ఇచ్చిన ఆఖరి సందేశం’’ అని చెప్పారు.

రాచమడుగు శ్రీనివాసులు

ఇవి కూడా చదవండి

ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..

రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..

Updated Date - Aug 29 , 2025 | 01:20 AM