Share News

Shri Krishna Teachings: వేణువులా మారుదాం

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:44 AM

‘‘త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదర్శవంతుడైన కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, రాజుగా... మానవులు ఎలా జీవించాలో మనకు చూపించాడు. అయితే దానివల్ల మానవులందరూ ధర్మాన్ని పాటించడమే...

Shri Krishna Teachings: వేణువులా మారుదాం

సహజయోగ

‘‘త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదర్శవంతుడైన కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, రాజుగా... మానవులు ఎలా జీవించాలో మనకు చూపించాడు. అయితే దానివల్ల మానవులందరూ ధర్మాన్ని పాటించడమే ధ్యేయంగా... గంభీరంగా మారిపోయి, ఆనందాన్ని విడిచిపెట్టేశారు. జీవితాన్ని ఉత్సాహంగా ఆనందించడం వారికి నేర్పడం కోసం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. తన మధురమైన సంభాషణలతో అందరినీ సమ్మోహితులను చేశాడు’’ అంటూ శీకృష్ణావతార పరమార్థాన్ని తన ప్రవచనాలలో శ్రీమాతాజీ నిర్మలాదేవి వివరించారు.

శరణాగతులం కావాలి...

శ్రీకృష్ణ తత్త్వం... ప్రధానంగా రాధాకృష్ణుల అనుబంధం ఎంతో మార్మికమైనవి. సంస్కృతంలో ‘రా’ అనే శబ్దానికి ‘శక్తి’ అని, ‘ధ’ అనే శబ్దానికి ‘ధరించినది’ అని అర్థం. రాధాదేవి శక్తి స్వరూపిణి. ఆమె యమునా నదిలో తన పాదాలను ఉంచడం వల్ల ఆ నది నీరు మొత్తం చైతన్యాన్ని పొందేది. ఆ నీటి ద్వారా గోపికలలో కుండలినీ శక్తిని శ్రీకృష్ణుడు జాగృతం చేసేవాడు. విశుద్ధ చక్రాన్ని ఆయన జాగృతం చేసి... కుండలినీ శక్తి ఉత్థానానికి మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ చక్రానికి పదహారు దళాలు ఉంటాయి. ఆ దళాలు మన తలలోని సహస్రారంలో ఉండే వెయ్యి నాడులతో ఏకీకృతం అయినప్పుడు.... పదహారువేల శక్తులు ఏర్పడతాయి. శ్రీకృష్ణుడితో భూమిపై అవతరించిన ఆ పదహారువేల శక్తులే గోపికలు. వాటికి రక్షణ కల్పించడానికే ఆయన ఆ పదహారు వేల గోపికలను వివాహం చేసుకున్నాడు. యోగీశ్వరుడైన ఆయన లీలలను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే... మన లోపల ఉన్న విశుద్ధి చక్రం జాగృతమై... మనలో శ్రీకృష్ణ తత్త్వం స్థిరపడుతుంది. ఒక కథ ప్రకారం... శ్రీకృష్ణుడి నిరంతరం దగ్గరగా ఉండే వేణువును చూసి రాధాదేవి అసూయ చెందిందట. ‘‘నువ్వు ఇంతటి ఉన్నత స్థానాన్ని ఎలా పొందగలిగావు?’’ అని అడిగిందట. అప్పుడు వేణువు ‘‘కేవలం భగవంతుడికి గానాన్ని వినిపించడం తప్పితే నా లోపల ఏదీ ఉంచుకోను’’ అని చెప్పిందట. మనం కూడా కామ క్రోధాది శత్రువులను మన లోపల ఉంచుకోకుండా... మన అంతరంగాన్ని భగవంతుడికి పరిపూర్ణంగా సమర్పించి, సంపూర్ణ శరణాగతులం కావాలి. మన ద్వారా జరిగేవన్నీ భగవంతుడి అభీష్టం ప్రకారమే. కాబట్టి ఆ పనులన్నిటినీ సాక్షిలా గమనిస్తూ, కలత చెందకుండా ఉండగలిగితే... కొంతకాలానికి శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువులా తయారవుతాం. ఆ పరంధాముడి మధురమైన గానామృతాన్ని ఈ ప్రపంచానికి పంచగలుగుతాం.


ఆయన ఆచరించి చూపించాడు...

మన సూక్ష్మ శరీరంలో... గొంతు దగ్గర ఉండే విశుద్ధి చక్రానికి అధిష్టాన దైవం శ్రీకృష్ణుడు. ఈ చక్రం తాలూకు స్వభావం... సామూహికత. ‘మానవులు సంఘంలో ఎలా జీవించాలి, అందరితో కలిసి ఎలా ఆనందించాలి’ అనేది శ్రీకృష్ణుడు చూపించాడు. ఆయన బృందావనంలో తన తోటి వారిని బృందాలుగా తయారు చేశాడు. చిన్నతనంలోనే తన అల్లరితో వారందరి మనస్సుల్లో ఆయన స్థానం సంపాదించాడు. ధర్మాన్ని అనుసరించడం అంటే నవ్వడం మరచిపోయి, గంభీరంగా బతకడం కాదని, అది కూడా ఆనందంగా, ఒక లీలలా సాగాలని ఆచరించి చూపించాడు. అందుకే ఆయనను ‘లీలాధర’ అని పిలుస్తారు. సహజయోగ ధ్యాన సాధన ద్వారా కుండలినీ శక్తి జాగృతమై.... ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు, మన విశుద్ధ చక్రం పూర్తిగా పరిశుద్ధమై వికాసం చెందుతుంది. ఆ చక్రాన్ని అధిష్టించి ఉన్న శ్రీకృష్ణుని తత్త్వం మనలో జాగృతం అవుతుంది. ఆయన లక్షణాలైన స్థితప్రజ్ఞత, విచక్షణ, మాటల్లోని మాధుర్యం లాంటివి మనలో స్థిరపడతాయి.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 12:44 AM