Share News

Tamarind recipes: పుల్లగా... కమ్మగా

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:58 AM

చింతకాయలు అనగానే చిన్నా, పెద్దా అందరికీ నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. వీటితో పచ్చడి, పప్పు, చారు ఇలా ఏ వంటకం చేసినా రుచిగానే ఉంటాయి. పుల్లని చింతకాయలతో చేసే సరికొత్త వంటకాలు మీకోసం...

Tamarind recipes: పుల్లగా... కమ్మగా

చింతకాయ మెంతి పులుసు

కావాల్సిన పదార్థాలు: చింతకాయలు- పావు కేజీ, పచ్చిమిర్చి- పది, మెంతులు- ఒకటిన్నర చెంచా, పచ్చి శనగపప్పు- పావు కప్పు, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, పసుపు- అర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, నీళ్లు- రెండు గ్లాసులు, ఉప్పు- తగినంత

తయారీ విధానం: పచ్చిమిర్చిని శుభ్రంగా కడగి,చాకుతో మధ్యలో పొడవుగా గాట్లుపెట్టాలి. చింతకాయలను కూడా నీళ్లతో కడగాలి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి చింతకాయలు వేసి నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. చింతకాయలు మెత్తబడిన తరవాత స్టవ్‌మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చింతకాయలను చేతితో బాగా పిసికి రసాన్ని వడబోయాలి.

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి వేడి చేయాలి. మెంతులు, పచ్చి శనగపప్పులను విడివిడిగా దోరగా వేయించాలి. వీటిని విడివిడిగా మిక్సీలో పొడి చేసి చిన్న గిన్నెల్లోకి తీసుకోవాలి. శనగపప్పు పొడిలో కొంచెం నీళ్లు పోసి ఉండ కట్టకుండా మెత్తగా కలపాలి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. రెండు నిమిషాలు వేగనివ్వాలి. తరవాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత చింతకాయ రసం పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. 8నిమిషాల తరవాత మెంతి పొడి వేసి కలపాలి. చింతకాయ రసం బాగా మరుగుతున్నపుడు గంటెతో వేగంగా కలుపుతూ మరో చేత్తో శనగపప్పు పొడి, నీళ్ల మిశ్రమాన్ని మెల్లగా పోయాలి. ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. మరోసారి పులుసును బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. దీనిని వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

జాగ్రత్తలు

మెంతులను చిన్న మంట మీద గోధుమ రంగులో, మంచి సువాసన వచ్చే వరకూ వేపుకోవాలి. లేదంటే పులుసు పచ్చివాసనతో చేదుగా మారుతుంది.

శనగపప్పు పొడిని ఒకసారి జల్లించు కుంటే మంచిది. పప్పు రవ్వలు ఉంటే పులుసు రుచి మారుతుంది.


gbhlj;k.jpg

చింతకాయ ఊట

కావాల్సిన పదార్థాలు: ముదిరిన చింతకాయలు- అర కేజీ, పచ్చి మిరపకాయాలు- పావు కేజీ, అల్లం- రెండు పెద్ద ముక్కలు, వెల్లుల్లి- ఆరు రెబ్బలు, ఉప్పు- తగినంత, ఎండు మిరపకాయలు- ఆరు, ఆవ పొడి- మూడు చెంచాలు, మెంతి పొడి- మూడు చెంచాలు, జీలకర్ర పొడి- ఒక చెంచా, పసుపు- ఒక చెంచా, నూనె- పావు కేజీ, ఆవాలు- రెండు చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, ఎండు మిరపకాయల గింజలు- రెండు చెంచాలు, కరివేపాకు- నాలుగు రెమ్మలు

తయారీ విధానం: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. తొడిమలు తీసి చిన్న ముక్కలు కోసి మిక్సీ గిన్నెలో వేయాలి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

ఆరు లేత పచ్చి మిరపకాయలను తొడిమలు తీసి మధ్యలో గాటు పెట్టి సగానికి కోసి పెట్టుకోవాలి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి చింతకాయలు వేసి గిన్నె నిండుగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తరవాత చింతకాయలను పిసికి రసం వడబోసుకోవాలి.

ఇందులో పచ్చి మిరపకాయల పేస్టు, ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి ఉండలు రాకుండా జాగ్రత్తగా కలపాలి. లేత పచ్చి మిరపకాయల ముక్కలు పైన వేయాలి. కలపకూడదు.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి పావు కేజీ నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరప గింజలు, ఎండు మిరపకాయల ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేపాలి.

ఈ తాలింపును చింతకాయల రసంపై ఉన్న పచ్చి మిరపకాయలమీద వేయాలి. ఒక నిమిషం ఆగి గంటెతో కలపాలి. వేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

జాగ్రత్తలు

దీనిని పులుసులా లేదంటే చారులా అన్నంలో పోసుకోకూదు. పచ్చడి వేసుకున్నట్లు చిన్న చెంచాతో వడ్డించుకోవాలి.

ఇది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే నెల రోజుల వరకూ బాగుంటుంది.

చింతకాయల రసం చేసేటప్పుడు ముందుగానే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి.


ikj.jpg

చింతకాయ దప్పళం

కావాల్సిన పదార్థాలు: చింతకాయలు- 150 గ్రాములు, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- ఒక చెంచా, ఎండు మిరపకాయలు- రెండు, పచ్చి మిరపకాయలు- అయిదు, కరివేపాకు- రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, పసుపు- అర చెంచా, టమాటాలు- రెండు, బియ్యం పిండి- ఒక చెంచా, శనగపిండి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర- ఒక కట్ట

తయారీ విధానం:

స్టవ్‌ మీద గిన్నె పెట్టి శుభ్రంగా కడిగిన చింతకాయలు వేసి అవి మునిగేంతవరకూ నీళ్లు పోసి ఉడికించాలి. చింతకాయలు ఉడికాక స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. వీటిని మెత్తగా పిసికి రసం వడబోయాలి. పచ్చి మిరపకాయలను పొడవుగా చీలికల మాదిరి కోయాలి.

అయిదు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఇందులో అర చెంచా జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచి వెల్లుల్లి-జీలకర్ర పేస్టు రెడీ చేసుకోవాలి. టమాటాలను కడిగి పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి.

గిన్నెలో బియ్యంపిండి, శనగపిండి వేసి కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తని మిశ్రమంలా కలపాలి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, పచ్చి మిర్చి చీలికలు, కరివేపాకు, పసుపు వేయాలి. ఇవి రెండు నిమిషాలు వేగాక వెల్లుల్లి-జీలకర్ర పేస్టు వేసి కలపాలి. టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మగ్గించాలి. నాలుగు నిమిషాల తరవాత చింతకాయ రసం, ఉప్పు వేసి కలపాలి. రసం బాగా మరుగుతున్నప్పుడు బియ్యంపిండి-శనగపిండిల మిశ్రమాన్ని వేస్తూ కలపాలి. అయిదు నిమిషాలు తిప్పుతూ ఉండాలి. తరవాత కొత్తిమీర తరుగు వేసి దించాలి.

జాగ్రత్తలు

చింతకాయల పులుపును బట్టి రసంలో నీళ్లు కలుపుకోవచ్చు.

బియ్యంపిండి, శనగ పిండి వేయడంవల్ల దప్పడం చల్లారాక చాలా చిక్కగా మారుతుంది. కాబట్టి దించే ముందు ఇది గరిటె జారుగా ఉండేలా చూసుకోవాలి.

ఇష్టమైతే ఉడికించిన కూరగాయల ముక్కలను ఇందులో వేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:58 AM