Share News

Sukumar Daughter Interview: నాకు కోపం వస్తే నాన్నకు కంగారే

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:19 AM

ఈసారి జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘గాంధీ తాత చెట్టు’లో నటించిన స్టార్‌ డైరక్టర్‌ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డికి జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆమెను ‘నవ్య’ పలకరించింది. సంగీతం అంటే తనకున్న ఇష్టాన్నీ...

Sukumar Daughter Interview: నాకు కోపం వస్తే నాన్నకు కంగారే

ఈసారి జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘గాంధీ తాత చెట్టు’లో నటించిన స్టార్‌ డైరక్టర్‌ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డికి జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆమెను ‘నవ్య’ పలకరించింది. సంగీతం అంటే తనకున్న ఇష్టాన్నీ, అమ్మానాన్నలతో తనకున్న అనుబంధాన్నీ పంచుకుంది.

జాతీయ అవార్డు వచ్చిందని ముందుగా ఎవరు చెప్పారు?

నేను అమెరికాలో చదువుకుంటున్నా. అందువల్ల భారత్‌లో పగలు అయితే మాకు రాత్రి. నేను పడుకొని ఉంటే అమ్మ ఫోన్‌ చేసి... ‘‘నేషనల్‌ అవార్డులు ప్రకటిస్తున్నారు... చూడు’’ అని చెప్పింది. స్ర్కీన్‌ మీద నా పేరు కనిపించినప్పుడు ముందు నమ్మబుద్ధి కాలేదు. నాకు అవార్డు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది.

‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో తొలి షాట్‌ గుర్తుందా? కెమెరా ముందు నిలబడటానికి భయమేసిందా?

అది ఒక మాంటేజ్‌ షాట్‌. అందులో నేను స్కూలుకు వెళ్తూ ఉంటా. మొదటిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు అంత భయం వేయలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచీ నాన్నతో షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. సెట్స్‌లో వందల మంది ఉంటారు. ఆ వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందువల్ల నాకు ఇబ్బంది అనిపించలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో నా స్నేహితులుగా నటించిన నిహాల్‌ ఆనంద్‌, భానుప్రకాష్‌ షూటింగ్‌ సమయంలో మంచి ఫ్రెండ్స్‌ అయిపోయారు. దాంతో షూటింగ్‌ ఫన్‌గా సాగింది. అంతేకాకుండా అమ్మ కూడా నాతో ఎప్పుడూ ఉండేది. నాన్న ఆ సమయంలో ‘పుష్ప2’లో బిజీగా ఉన్నారు. అందువల్ల అప్పుడప్పుడూ షూటింగ్‌కు వచ్చేవారు.


చాలా కష్టమనిపించిన సీన్‌ ఏదైనా ఉందా?

క్లైమాక్స్‌లో నేను ఒక చెట్టు దగ్గర ఏడుస్తూ ఉంటా. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రఘపతి రాఘవ రాజారాం’ పాట వస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే వాన పడింది. దాంతో సీనంతా బాగా సెట్‌ అయింది. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించి కొంత చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచీ మ్యూజిక్‌ అంటే ఇష్టం. మూడేళ్ల కిందట అమ్మ నాకు ఈ సినిమా కథ చెప్పింది. నాకు చాలా నచ్చింది. డైరక్టర్‌ నన్ను గాంధీతాత వేషం వేయమని అడిగారు. నేను చేయగలనా.. లేదా అనే సందేహం కలిగింది. భయం వేసింది. నాన్న ధైర్యం చెప్పారు. ఇక డైరక్టర్‌ మల్లాది పద్మావతి కూడా నాకు చాలా సపోర్ట్‌ ఇచ్చారు.

నువ్వు అమ్మ పిల్లవా.. నాన్న పిల్లవా..?

అలా అడిగితే కష్టం. నేను నాన్న పిల్లనే. మా ఇద్దరికీ మ్యూజిక్‌ అంటే ఇష్టం. నాకు ఏదైనా పాట నచ్చితే నాన్నకు షేర్‌ చేస్తా. నాన్నకు నచ్చితే నాకు షేర్‌ చేస్తారు. మా ఇద్దరినీ ఎప్పుడూ మ్యూజిక్‌ కలుపుతూనే ఉంటుంది. అయితే ఏదైనా చెప్పాలంటే మాత్రం మొదట అమ్మకే చెబుతాను. నాన్న ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. అందువల్ల ఆయనకు తరువాత చెబుతాను.

నువ్వు మ్యూజిక్‌ కోర్సులో ఎందుకు చేరావు?

నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ఐదేళ్ల వయస్సు నుంచీ పాడుతూ ఉండేదాన్ని. ఇంటికి ఎవరైనా వస్తే... అమ్మ నన్ను ఏదైనా పాడమని అడిగేది. నేను పాడేదాన్ని. అలా వయస్సుతో పాటు నాకు సంగీతం పట్ల ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అందుకే అమెరికాలో మ్యూజిక్‌ కోర్సులో చేరాను. నా హైస్కూలు అయిపోయిన తర్వాత కాలేజీలో కూడా మ్యూజిక్‌కు సంబంధించిన కోర్సులోనే చేరతాను. సంగీతం నాకు చాలా నేర్పింది. జీవితం పట్ల నాకున్న అభిప్రాయాలను మార్చింది.


నీకు ఇష్టమైన పాటలు, సినిమాలు?

తెలుగులో... ‘నాన్నకు ప్రేమ’తో సినిమాలో ‘లవ్‌ మీ ఎగైన్‌..’ పాట నాకు చాలా ఇష్టం. ఇంగ్లీషులో అయితే చాలా పాటలున్నాయి. ‘సీతారామం, రంగస్థలం’ సినిమాలంటే చాలా ఇష్టం. ‘బేబీ, మ్యాడ్‌ స్క్వేర్‌’ చూశాను. చాలా బాగున్నాయి.

ఏవైనా పాటలు రికార్డు చేశావా?

ఇంకా లేదు. నేను చదువుతున్న స్కూల్లో మ్యూజికల్‌ ప్రొడక్షన్స్‌ జరుగుతూ ఉంటాయి. గత ఏడాది మా స్కూల్లో... ‘వికెడ్‌’ అనే మ్యూజికల్‌ ప్రోగ్రామ్‌ చేశాం. అందులో ఒక సోలో పాడాను. ఒక పాట కండెక్ట్‌ కూడా చేశాను. 2023లో ఒక మ్యూజికల్‌ ప్రోగ్రామ్‌ చేశాం. దానికి ‘మోస్ట్‌ కాంట్రిబ్యూషన్‌ అవార్డు’ వచ్చింది.

నాన్న పెద్ద డైరక్టర్‌ కదా.. ఎవరైనా తనని పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది?

నాన్నకు పనే ప్రపంచం. పని కోసం ప్రాణం పెడతాడు. బన్నీ మామ, తారక్‌ అంకుల్‌, చరణ్‌ అంకుల్‌ కలిసినప్పుడు నాన్న గురించి ఇదే చెబుతూ ఉంటారు.

అమ్మానాన్నల మీద కోపం వస్తే ఏం చేస్తావు?

నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. కానీ కోపం వస్తే మాత్రం సైలెంట్‌ అయిపోతాను. రూమ్‌లోకి వెళ్లి కూర్చుంటాను. నాకు కోపం వచ్చిందనే విషయం అమ్మానాన్నలకు తెలుస్తుంది. అమ్మ అయితే ముందే పసిగట్టేస్తుంది. కొద్దిసేపు తర్వాత మళ్లీ బయటకు వచ్చేస్తా. అప్పుడు అమ్మ లాజికల్‌గా అన్నీ వివరిస్తుంది. నాన్న అయితే... ‘‘ఏమైంది పండు.. ఏం జరిగింది..’ అని కంగారుపడిపోతాడు. నా కోపం తీరటానికి నాకు పెద్ద డిమాండ్స్‌ ఏమీ ఉండవు.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌


33-Navya.jpg

  • ప్రస్తుతం నాకున్న క్లోజ్‌ఫ్రెండ్‌ నా ఫోన్‌. మా స్కూల్లో ఉన్న అమ్మాయిలందరూ నా ఫ్రెండ్సే. నేను అందరితో బాగా మాట్లాడతాను. కలివిడిగా ఉంటా. కానీ పార్టీలంటే పెద్ద ఇష్టం ఉండదు. లౌడ్‌ మ్యూజిక్‌, తెలియని వ్యక్తులు ఉన్న ప్రదేశాలకు వెళ్లను.

  • చాలామంది ‘మేము ఫార్మల్‌గా ఉంటాం. సినిమా ఫ్యామిలీలు అలాగే ఉంటాయి’ అనుకుంటారు. కానీ మేము దానికి పూర్తి ఆపోజిట్‌గా ఉంటాం. మా ఇంట్లో చాలామంది ఉంటారు. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటాం. నాకు... తమ్ముడికి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. నాకు ఈ అవార్డు వచ్చినప్పటి నుంచీ నేను ఏంమాట్లాడినా... ‘నేషనల్‌ అవార్డు విన్నర్‌ కదా..’ అంటూ ఆటపట్టిస్తున్నాడు.

  • నేను సోషల్‌ మీడియాలో చురుకుగా లేను. నా ఫోన్‌లో ఒక యాప్‌ ఉంది. అది సోషల్‌ మీడియాను బ్లాక్‌ చేస్తుంది. అందువల్ల నాకు సోషల్‌ మీడియా చూసే అవకాశమే ఉండదు.

  • ప్రస్తుతం స్కూలుకు సెలవులు ఉన్నాయి. అందువల్ల నాకు అవార్డు వచ్చిందన్న విషయం ఇంకా స్కూల్లో ఎక్కువమందికి తెలియదు. స్కూలువాళ్లకు అమ్మ మెయిల్‌ పెట్టిందనుకుంటా. వాళ్లకు అందిన వెంటనే ఇన్‌స్టాలో పెడతారు.

  • నాకు యానిమేషన్‌ సిరీస్‌లంటే చాలా ఇష్టం. ‘జుట్సూ కైసిన్‌, బిసెర్క్‌, హైకూ’ ఎంతో నచ్చాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

Updated Date - Aug 10 , 2025 | 05:19 AM