Suhani Shah: మనసుతో మాయ చేస్తుంది
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:10 AM
27 ఏళ్లుగా మెంటలిస్ట్‌గా, ఇల్యూజనిస్ట్‌గా, మెజీషియన్‌గా సత్తా చాటుతున్నారు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సుహాని షా.

మహిళలు అరుదుగా కనిపించే ఇంద్రజాల రంగాన్ని ఎంచుకొని... అందులో రాణించి, 27 ఏళ్లుగా మెంటలిస్ట్‌గా, ఇల్యూజనిస్ట్‌గా, మెజీషియన్‌గా సత్తా చాటుతున్నారు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సుహాని షా. తాజాగా హైదరాబాద్ ఫిక్కీ ఫ్లో మహిళా సంస్థ ఆధ్వర్యంలో, మ్యాజిక్ ఆఫ్ మెంటలిజం కార్యక్రమంలో పాల్గొన్న సుహానాను ‘నవ్య’ పలికరించింది. ఆ విశేషాలు...
‘‘ఆరేళ్ల వయసులోనే ఇంద్రజాలం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ రోజు నాకిప్పటికీ గుర్తే! అది ఆదివారం. టీవీలో ఒక స్థానిక ఇంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్నాను. అతను ప్రదర్శించిన ఒక చిన్న మ్యాజిక్ నన్ను విపరీతంగా ఆకర్షించేసింది. చాలా మంది పిల్లలు ఇంద్రజాలాన్ని చూసి సంతోషిస్తారు. కానీ నేను ఇంద్రజాలాన్ని చూడడం కాదు, ప్రదర్శించాలని తపన పడ్డాను. ఈ విషయాన్ని నాన్నతో చెప్పి, ఇంద్రజాలికురాలిగా ఎదగాలని ఉందని చెప్పాను. నాన్న నా మాటలను కొట్టిపారేయకుండా, ఆ విద్యను నేర్పే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఇంద్రజాలికుల కోసం తీవ్రంగా అన్వేషించారు. అయితే చాలా కాలం తర్వాత అహ్మదాబాద్‌లోని, కలోల్ అనే గ్రామంలో నివసిస్తున్న ఒక కుటుంబం గురించి తెలిసింది. వాళ్లు ప్రదర్శనల్లో ఇంద్రజాలికులకు సహాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. నాకు ఆ విద్య నేర్పించమని మా అమ్మానాన్న వాళ్లను ఒప్పించారు. సాధారణంగా ఇంద్రజాలికులు, సహాయకులకు ఇంద్రజాలాన్ని నేర్పిస్తూ ఉంటారు. నా విషయంలో ఆ సహాయకులే నాకు ఇంద్రజాలాన్ని నేర్పించడం జరిగింది. వాళ్ల దగ్గర ఆ విద్య నేర్చుకుని, పూర్తి స్థాయిలో ప్రదర్శన ఇవ్వడానికి నాకు 10 నెలలు పట్టింది. 1997, అక్టోబరు 22న ఆరేళ్ల వయసులో నేను నా మొదటి ప్రదర్శన ఇచ్చాను. అలా దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ వస్తున్నాను. ఇప్పటివరకూ ఈ 27 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు వేల ప్రదర్శనలిచ్చాను.
జీవితమే నేర్పింది
ఇంద్రజాలం నేర్పిస్తే నేర్చుకోగలిగే వీలున్న విద్య. కానీ మైండ్ రీడింగ్ కోసం నేను పూర్తిగా పుస్తకాల మీదే ఆధారపడ్డాను. మానసిక శాస్త్రం, మానవ ప్రవర్తనల గురించి లోతుగా అధ్యయనం చేశాను. వీటికి సంబంధించి పుస్తకాలు కూడా రాశాను. అలా ఒక సమయంలో మానసిక శాస్త్రం, మానవ ప్రవర్తనల పట్ల నాకున్న పరిజ్ఞానాన్ని ఇంద్రజాలంతో ముడిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా మెంటలిస్ట్ (ఇతరుల మనసులో ఉన్న విషయాలను చెప్పగలిగే కళాకారుడు)ను అయ్యాను. ఒకటో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పినా, రోజువారీ అనుభవాలు, వ్యక్తుల నుంచి కొత్త విషయాలు నిరంతరంగా నేర్చుకుంటూనే ఎదిగాను. చదువు మానేసినందుకు నాకు బాధ లేదు. మిగతా పిల్లల కంటే మెరుగ్గా బాల్యాన్ని గడపగలిగాననే సంతృప్తి ఉంది. నేర్పించేవారెవరూ లేరు కాబట్టి అన్నీ స్వయంగా నేర్చుకునే అలవాటు మరింత మెరుగుపడింది. నేర్చుకోవాలనుకునేవారు ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారని అమ్మ అంటూ ఉంటుంది. అది అక్షరాలా నిజం. నేర్చుకోవాలనే కోరిక లేని పిల్లలను ఎంత మంచి బడిలో వేసినా రాణించలేరు.
నకిలీ బాబాల గురించి కళ్లు తెరిపిస్తూ...
మెంటలిజం అన్నది అతీంద్రియ విద్య కాదు. అదొక నైపుణ్యం, ఒక కళ. కానీ దీనికి దైవత్వాన్ని ఆపాదించి, అతీంద్రియ శక్తుల్లా ప్రదర్శిస్తూ, అమాయకులను మోసం చేసి పబ్బం గడుపుకునే నకిలీ బాబాలు, సన్యాసులను ఎంతోమందిని మనం చూస్తున్నాం. గారడీ విద్యలు ప్రదర్శించే ఇలాంటి వాళ్లను చూసి మోసపోకుండా ప్రజలను చైతన్యవంతం చేయడానికి నా ఇంద్రజాలం ఉపయోగపడుతుందనే భావిస్తున్నా. మెంటలిజంతో మూఢనమ్మకాలను పారదోలాలన్నది నా లక్ష్యం. కాబట్టే నా ప్రదర్శనల్లో ఇంద్రజాల విద్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎంతో మంది నా దగ్గరకు వచ్చి, వాళ్ల కష్టాలను నా ఇంద్రజాల శక్తితో మాయం చేయమని, సమస్యలను పరిష్కరించమని అడుగుతూ ఉంటారు. ప్రజల విశ్వాసమే అతి పెద్ద ఇంద్రజాలం. మనల్ని మనం నమ్మగలిగితే మనమే ఒక ఇంద్రజాలంలా మారిపోయి జీవితాలను మెరుగు పరుచుకోగలుగుతాం! ప్రజల భయాలనే కొందరు వ్యాపారాలుగా మలుచుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే ప్రజలు మెలకువగా వ్యవహరిస్తూ, స్వయంస్వావలంబన సాధించాలి.
ఎవరైనా నేర్చుకోవచ్చు
ఇంద్రజాలం అన్నది పూర్తిగా భిన్నమైన రహస్య కళ. మెజీషియన్, మెంటలిస్ట్, ఇల్యూజనిస్ట్ ఇవన్నీ భిన్నమైన నైపుణ్యాల్లా కనిపించినా మొత్తం ఇంద్రజాలం కోవకే చెందుతాయి. సాధారణంగా ఈ రంగంలోకి రావడానికి అమ్మాయిలెవరూ ఇష్టపడరు. కానీ ఆసక్తి ఉంటే అమ్మాయిలు రాణించలేని రంగమంటూ ఏదీ లేదు. ఇంద్రజాలం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు యూట్యూబ్ చూసి చిన్నచిన్న ట్రిక్స్ నేర్చుకోవచ్చు. వాటిని సమర్థంగా ప్రదర్శించే స్థాయికి చేరుకున్న తర్వాత, ఆ ప్రయాణంలో ఇంద్రజాలంలో ఏ జోనర్ వాళ్లకు సరైనదో గ్రహించి ఆ దిశగా ప్రయాణించవచ్చు. ఇంద్రజాలాన్ని నేర్పించే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటి తరం ఎంతో తెలివైనది. వాళ్లకు కొత్తగా దేన్నీ నేర్పించవలసిన అవసరం లేదు. అయితే ప్రపంచానికి దయ, ప్రేమ, కరుణ, ఆనందాల అవసరం ఉంది. కాబట్టి వాటిని నచ్చిన మార్గంలో ఈ ప్రపంచానికి అందించమని నేటి తరాన్ని నేను కోరుకుంటున్నాను.’’
గోగుమళ్ల కవిత
ఇవి కూడా చదవండి..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..