Share News

Subrahmanya Worship: అగ్నిస్వరూపుడి ఆరు క్షేత్రాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 06:15 AM

మన దేశంలో సుబ్రహ్మణ్య ఆరాధన అనాది కాలం నుంచి వస్తోంది. సనాతన ధర్మంలో ఆరు మతాలు ఉన్నాయి. వాటిలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి గాణపత్య, శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయాలు. పరమాత్మను...

Subrahmanya Worship: అగ్నిస్వరూపుడి ఆరు క్షేత్రాలు

పర్వదినం

(26న సుబ్రహ్మణ్య షష్ఠి)

మన దేశంలో సుబ్రహ్మణ్య ఆరాధన అనాది కాలం నుంచి వస్తోంది. సనాతన ధర్మంలో ఆరు మతాలు ఉన్నాయి. వాటిలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి గాణపత్య, శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయాలు. పరమాత్మను సుబ్రహ్మణ్య రూపంలో ఆరాధించడం స్కాంద మతం. అందులో ఆయనను అగ్నిగర్భుడిగా భావిస్తూ... ‘సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం’ అంటూ ఉపాసకులు పూజిస్తారు. సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాగా... శ్రీశంకర భగవత్పాదులు ఏర్పరచిన పంచాయతన పూజా విధానంలో సుబ్రహ్మణ్యుడి ప్రస్తావన లేదు. అయితే... పూజకు ముందు చేసే దీపారాధన... శివశక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడమేననేది తత్త్వజ్ఞుల అభిప్రాయం.

సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల కుమారుడు... ఆయనను ‘కుమారస్వామి ’అని పిలుస్తారు. శివుడు అవ్యక్త బ్రహ్మం అయితే... పార్వతి వ్యక్త స్వరూపం. ఆ ఉభయులు కలిసిన విశ్వవ్యాపకశక్తి, నాలుగు దిక్కులలో పైనా, కిందా వ్యాపించిన విశ్వచైతన్యం సుబ్రహ్మణ్యుడు. కార్తికేయుడిగానూ ఆయన ప్రసిద్ధుడు. ఆరు ముఖాలతో ఆయన విరాజిల్లుతున్నాడు. ఆయనకు నాలుగు చేతులు. ఒక చేతిలో మహాశక్తి, మరో చేతిలో వజ్రాయుధం ఉంటాయి. ఒక చెయ్యి కటిపై ఉంటుంది. మరొకటి అభయహస్తం. తమిళనాడులో సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా ఉంటుంది. ప్రతి శివాలయంలో సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకంగా ఉపాలయం ఉంటుంది. రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి:


తిరుప్పరన్‌కుండ్రమ్‌: ఈ క్షేత్రం మదురైకి దగ్గరలో, ఎత్తైన కొండపై ఉంటుంది. ఆ కొండ శివలింగాకారంలో ఉండడం వల్ల దాన్ని ‘శివమలె’ౖ అని వ్యవహరిస్తారు. ఈ కొండ మీద తన బల్లెంతో స్వామి తీర్థాలను సృష్టించాడని, శూరపద్ముడు అనే రాక్షసుణ్ణి ఆయన వధించి, ఇంద్రుడికి క్షేమాన్ని కలిగించాడనీ, అందుకు కృతజ్ఞతగా తన కుమార్తె దేవసేనతో కుమారస్వామి వివాహాన్ని ఇంద్రుడు ఇక్కడ జరిపించాడని స్థలపురాణం చెబుతోంది.

తిరుచెందూర్‌: తిరునల్వేలి జిల్లాలో సముద్ర తీరాన ఉన్న విశాలమైన ఆలయం. శివుణ్ణి అభిషేకించడం కోసం సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధంతో ఇక్కడ పుష్కరణిని సృష్టించాడు. పక్కనే సముద్రం ఉన్నప్పటికీ... పుష్కరణిలో నీరు తియ్యగా ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి, ‘సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం’ రచించారు.

పళని: తిరుచ్చి-మదురై మధ్యలో ఉన్న కొండపై ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కుమారస్వామిని ‘దండాయుధపాణి’ అని పిలుస్తారు. కొండమీద ‘శరవణపొయిగై’ అనే తీర్థం ఉంది.

స్వామిమలై: తండ్రి అయిన పరమశివుడికి ప్రణవ రహస్యాన్ని సుబ్రహ్మణ్యుడు బోధించిన క్షేత్రం ఇది. అందుకే ఇక్కడ స్వామిని ‘శివగురునాథుడు’ అని కీర్తిస్తారు. తన సర్వశక్తులు కోల్పోయిన ఇంద్రుడు... సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో వాటిని తిరిగి పొందాడని, అందుకు కృతజ్ఞతగా తన వాహనమైన ఐరావతాన్ని ఆయనకు బహూకరించాడనీ క్షేత్రపురాణం చెబుతోంది.

తిరుత్తణి: ఈ క్షేత్రం తిరుపతికి సమీపంలో ఉంది. ఆహ్లాదకరమైన కొండపై కొలువైన స్వామి... గిరిజనురాలైన వల్లీదేవిని ఇక్కడ వివాహం ఆడాడని ప్రతీతి. నాలుగు ప్రాకారాలు, 365 మెట్లు కలిగిన ఈ క్షేత్ర దర్శనం మరువరాని అనుభూతిని కలిగిస్తుంది.

పళమ్‌ ముదిర్‌ చోళై: ఇది మదురైకి సమీపంలో ఉంటుంది. శివ దంపతుల, విష్ణు దంపతుల సమైక్య, సమన్వయ స్వరూపమైన పరబ్రహ్మమే ఇక్కడి సుబ్రహ్మణ్యుడని స్కాంద పురాణం చెబుతోంది. ఈ స్వామిని అర్చిస్తే, శివ పార్వతులను, లక్ష్మీ నారాయణులను పూజించిన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం.

ఎ.సీతారామారావు

కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 06:15 AM