Star Kids Behind the Camera: ఈ వారసులు తెరవెనుకే
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:24 AM
ఒకప్పుడు సినీ తారల వారసులుఎక్కువ శాతం నటన వైపే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోంది. కొందరు సినీ ప్రముఖుల వారసులు నటనతో పాటు మిగిలిన రంగాలలో కూడా...
సంకల్పం
ఒకప్పుడు సినీ తారల వారసులుఎక్కువ శాతం నటన వైపే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోంది. కొందరు సినీ ప్రముఖుల వారసులు నటనతో పాటు మిగిలిన రంగాలలో కూడా తమ ప్రతిభను చాటడానికి ఆసక్తి చూపుతున్నారు. దర్శకత్వం, రచన, సంగీతం, వీడియో ఎడిటింగ్ తదితర రంగాల్లో తమదైన ముద్ర వేయడానికి ముందడుగు వేస్తున్నారు.
వంద సంవత్సరాల భారతీయ సినీ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే నటీనటుల దర్శకనిర్మాతల వారసులు నటులుగానే వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు కనిపిస్తాయి. ఆ బాటలో వచ్చి సక్సెస్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. కానీ కొత్త తరం వారసుల దృష్టి ఇప్పుడు నటన మీద కంటే మిగిలిన శాఖల మీదే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇలా తెర వెనుకే ఉండి తమ ప్రతిభను చాటడానికి ప్రయత్నిస్తున్న కొందరి వారసుల వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
సంగీతంతో పాటు ఎడిటింగ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తమ ఆరాధ్యదైవం పవర్‌స్టార్‌లాగే హీరో అవుతాడని ఆశించారు మెగా అభిమానులు. అయితే అందుకు భిన్నంగా అతని అడుగులు సాగుతున్నాయి. పవన్‌కల్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన థమన్‌తో కలసి నేపథ్య సంగీతం కోసం వర్క్ చేశాడు అకీరా. ఈ చిత్రంతో పాటూ ‘రైటర్స్ బ్లాక్’ అనే లఘు చిత్రానికి సంగీతం అందించాడు. కేవలం సంగీతంతోనే సరిపెట్టుకోకుండా వీడియో ఎడిటింగ్‌పైనా దృష్టి పెడుతున్నాడు అకీరా. తన తండ్రి పవన్‌కల్యాణ్ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను ఆసక్తికరంగా ఎడిట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. అకీరా వీడియో ఎడిటింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు అతని తల్లి రేణూ దేశాయ్.
మెగాఫోన్ పట్టడమే లక్ష్యం
తన నటనతో మాస్ మహారాజాగా అభిమానుల నుంచి పేరు తెచ్చుకున్న రవితేజ తనయుడు మహధన్ భూపతి రాజు లక్ష్యం కూడా మెగాఫోన్ పట్టడమే. ఈ క్రమంలోనే ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి తెరకెక్కించనున్న ‘స్పిరిట్’లో సహాయ దర్శకుడిగా చేరాడు ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక పంథా ఏర్పరచుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని ఓ స్టార్ దర్శకుడిగా ఎదగాలని అతని ప్రయత్నం.
రెండు పడవలపై ప్రయాణం
తమిళ కథానాయకుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తెరవెనుక కథలను అందంగా చెప్పే దర్శకత్వాన్నే తన రూట్‌గా మార్చుకున్నాడు. సందీప్ కిషన్ కథానాయకుడిగా జేసన్ ఇప్పుడు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘జేఎస్ 01’. అలాగే తన తండ్రి నటించిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిశాడు. ‘పుల్ ద ట్రిగ్గర్’ అనే లఘు చిత్రంతో నటుడిగానూ సత్తా చాటాడు. అయితే తన కెరీర్ ముందుకు సాగే కొద్దీ జేసన్ నటనా, దర్శకత్వం రెండూ కొనసాగిస్తాడా లేదా కేవలం ఒకదానికే పరిమితమవుతాడా అనేది ఆసక్తికరం.
తండ్రితోనే చిత్రం!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు చూడ్డానికి సినిమా హీరోలా ఉండడంతో కింగ్‌ఖాన్ అభిమానులు కూడా అతను తన తండ్రిలాగే హీరో అవుతారని భావించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీ్‌సతో ఆర్యన్ దర్శకుడిగా మారిపోయాడు. తన మేకింగ్ స్టైల్‌తో విమర్శకుల్నీ, ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆర్యన్ తన తదుపరి చిత్రాన్ని థియేట్రికల్‌గా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుండడం విశేషం. దర్శకుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు వచ్చిన తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్‌తో ఓ చిత్రం చేయాలనే ఆలోచనల్లో ఉన్నాడీ యంగ్ సెన్సేషన్. అలాగే, షారుక్ నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాలో బాల నటుడిగా సత్తా చాటడంతో పాటు ‘ఇంక్రిడబుల్స్’, ‘ద లయన్ కింగ్’ లాంటి హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలకు తన గొంతునూ అందించాడు ఆర్యన్. ఇలా కేవలం స్టార్ హీరోల వారసులే కాదు, ప్రముఖ దర్శకనిర్మాతల తనయులు కూడా దర్శకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి మనోజ్ కూడా ‘స్పిరిట్’ చిత్రానికి గాను సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. అలాగే, ఓ లఘు చిత్రంలో హీరోగానూ నటించాడు. నిర్మాత శోభు యార్లగడ్డ తనయుడు కార్తీక్ యార్లగడ్డ ప్రస్తుతం లఘు చిత్రాలు చేసి... ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ కావాలని అడుగులేస్తున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News