ఐశ్వర్యారాయ్ నాకు స్ఫూర్తి
ABN , Publish Date - May 11 , 2025 | 05:11 AM
‘‘మిస్ వరల్డ్ కావాలనేది ఎన్నో ఏళ్లుగా కంటున్న కల. నటిగా నాకు ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం. ‘ఆమె ‘మిస్ వరల్డ్ విజేత కూడా’ అని మా అమ్మ చెప్పింది. అప్పటినుంచి ఆమెకు వీరాభిమానిని అయిపోయాను. నేను కూడా...
అందం, ఆత్మవిశ్వాసం, సామాజిక చైతన్యం.... వీటన్నిటి కలబోత అనుది గుణశేఖర. ఐశ్వర్యారాయ్ స్ఫూర్తితో ప్ర పంచ సుందరి కావాలన్న కలను నిజం చేసుకోవడానికి ఈ ఏడాది పోటీలకు ఈ శ్రీలంక సొగసరి సిద్ధమవుతోంది. తన గురించి, తన అభిరుచుల గురించి ఆమె పంచుకున్న విశేషాలు ‘నవ్య’కు ప్రత్యేకం...
‘‘మిస్ వరల్డ్ కావాలనేది ఎన్నో ఏళ్లుగా కంటున్న కల. నటిగా నాకు ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం. ‘ఆమె ‘మిస్ వరల్డ్ విజేత కూడా’ అని మా అమ్మ చెప్పింది. అప్పటినుంచి ఆమెకు వీరాభిమానిని అయిపోయాను. నేను కూడా ఆమెలా కావాలనుకున్నాను. ఇప్పుడు ఈ పోటీలో నేను పాల్గొనడానికి స్ఫూర్తి... ఐశ్వర్యారాయ్. 2017లో మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’గా గెలిచాక... నా కోరిక మరింత బలపడింది. అది నాలో మరింత ప్రేరణ కలిగించింది.
ఎలాంటి ఒత్తిడి లేదు...
నేను పుట్టింది, పెరిగింది శ్రీలంకలోని అనురాధపుర నగరంలో. నాన్న పోలీస్ అధికారి. అమ్మ బ్యూటీషియన్. నాకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. అందాల పోటీల కోసం నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడే సన్నద్ధం కావడం మొదలుపెట్టాను. పద్ధెనిమిదేళ్లు నిండాక దరఖాస్తు చేద్దామనుకున్నాను. దురదృష్టవశాత్తూ అప్పుడే మా అమ్మమ్మ మరణించింది. ఆ డిప్రెషన్ నుంచి తేరుకోవడానికి రెండేళ్లు పట్టింది. ఆ తరువాత పోటీలకు సిద్ధమవుతున్న వేళ... కొవిడ్ మహమ్మారి ముంచుకురావడంతో మరో రెండేళ్లు ఆలస్యమయింది. చివరకు కిందటి ఏడాది పోటీల్లో పాల్గొని... ‘మిస్ వరల్డ్- శ్రీలంక బ్యూటీ పాజెంట్’గా గెలిచాను. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘72వ ప్రపంచ సుందరి’ పోటీల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. తొలిసారిగా అంతర్జాతీయ పోటీలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ని చూస్తే... శ్రీలంకలోని మరో నగరానికి వచ్చిట్టుంది. క్రీడలు, సినిమాలు, వాణిజ్య రంగాల్లో బలమైన బంధం ఉండటంతో ఇరుదేశాల మధ్య రాకపోకలు సాధారణంగా మారాయి. ఇక్కడ ఉంటే... నా స్వదేశంలో ఉన్నట్టే అనిపిస్తోంది కాబట్టి నామీద ఎలాంటి ఒత్తిడి లేదు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.
ముఖ్యమైన మూడు సమస్యలపై...
సామాజిక సేవను నేను బాధ్యతగా భావిస్తాను. గత పదేళ్ల నుంచి అనేక కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యాను. ముఖ్యంగా... శ్రీలంకలో మహిళలు ఎదుర్కొంటున్న మూడు కీలక సమస్యలపై పని చేస్తున్నాను. వాటిలో ప్రధానమైది పీరియడ్ పావర్టీ. నెలసరి సమయంలో సురక్షితమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల, ప్యాడ్స్ లాంటివి అందుబాటులో లేకపోవడం వల్ల... శ్రీలంక మహిళా జనాభాలో దాదాపు 50 శాతంఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికోసం ‘సహేలి’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. దానిద్వారా... నెలసరి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నాను. అలాగే మా దేశ మహిళలను వేధిస్తున్న మరో సమస్య... వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్). అనేకమంది గృహహింసకు గురి కావడానికి ఇది ప్రధాన కారణం. వైవాహిక అత్యాచారం చట్ట వ్యతిరేకమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిది. కానీ చాలామంది మహిళలకు ఈ విషయంపై అవగాహన లేదు. వారు నిత్యం తమ భర్తల చేతిలో హింసకు గురవుతూనే ఉన్నారు. మా సంస్థ వారిలో చైతన్యం కలిగిస్తోంది. ఇక... శ్రీలంకలోని మూడు జైళ్లలో మహిళా ఖైదీల హక్కులు, భద్రత గురించి కూడా పని చేస్తున్నాను. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పలువురు జైళ్లలోనే ప్రాణాలు వదులుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు కోసం పోరాడుతున్నాను.’’
ముహమ్మద్ ఆర్.హెచ్.షరీఫ్
సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నా...
శ్రీలంకలో భారతీయ రెస్టారెంట్లు అనేకం ఉన్నాయి. వాటిలో తింటూ పెరిగాను కాబట్టి ఇక్కడి ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. భారతీయ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హిందీ సినిమాలు చూస్తూ... ఆ భాష కొంచెం కొంచెం నేర్పుకున్నాను. షారుఖ్ ఖాన్ అంటే ప్రాణం. ఆయన నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘కల్ హో నా హో’. ‘కభి అల్విద నా కెహనా’ సినిమాలు బాగా నచ్చాయి. ముఖ్యంగా ‘కల్ హో నా హో’ని ఎన్నో సార్లు చూశాను. ఎప్పుడు చూసినా కళ్లంట నీళ్లు వస్తాయి. అంతగా లీనమైపోతాను. తమిళంలో సూర్య, జ్యోతిక, విజయ్ నటనను ఇష్టపడతాను. తెలుగులో ‘గీత గోవిందం’ సినిమా, అందులో విజయ్ దేవరకొండ, రష్మిక నటన ఎంతగానో నచ్చాయి.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: ఇండియాతో ఉద్రిక్తత..దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300
India Pakistan Tensions: పాకిస్తాన్‌ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
యుద్ధం నేనే ఆపాను: కేఏ పాల్