Spiritual Leaders: ఆధ్యాత్మిక స్ఫూర్తిదాతలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:58 AM
భారత స్వాతంత్య్ర సమరం ఎన్నో వాగులు, వంకలు కలిసి ఎగసిన మహా ప్రవాహం. అహింసావాదం, సాయుధ విప్లవవాదం, సంఘ సంస్కరణవాదం... ఇలా అన్ని రకాల భావజాలాలు...
నేడు స్వాతంత్య్ర దినోత్సవం
భారత స్వాతంత్య్ర సమరం ఎన్నో వాగులు, వంకలు కలిసి ఎగసిన మహా ప్రవాహం. అహింసావాదం, సాయుధ విప్లవవాదం, సంఘ సంస్కరణవాదం... ఇలా అన్ని రకాల భావజాలాలు ‘దేశ విముక్తి’ అనే లక్ష్యం కోసం ఏకోన్ముఖంగా సాగిన అపూర్వ సందర్భం అది. ఆ ఉద్యమానికి ఎందరో ఆధ్యాత్మిక గురువులు స్ఫూర్తిని, నైతిక మార్గదర్శకత్వాన్ని అందించడమే కాదు... స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేలా ఎందరికో ప్రేరణగా నిలిచారు. అలాంటి వారిలో కొందరిని స్మరించుకుందాం.

దయానంద సరస్వతి
ఆధ్యాత్మికవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి సుప్రసిద్ధులు. 1824లో గుజరాత్‌లోని తంకారా అనే పట్టణంలో ఆయన జన్మించారు. 1857 నుంచి ప్రారంభమైన భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా... ఆయన బోధనలు, ముఖ్యంగా ఆయన రచించిన ‘సత్యార్థ ప్రకాశం’ గ్రంథం ఎందరినో ప్రభావితం చేశాయి. విదేశీ ఆధిపత్యాన్ని తిరస్కరించాలని, జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆయన ఇచ్చిన సందేశాలు తదుపరి కాలంలో స్వాతంత్య్ర యోధులకు మంత్రాలుగా మారాయి. సుసంపన్నమైన భారతీయ సంస్కృతి ఏ విదేశీ సంస్కృతికన్నా తక్కువ కాదనీ, మన వారసత్వాన్ని గర్వంగా భావించాలనీ స్వామి దయానంద బోధించారు. కుల వివక్ష, అస్పృశ్యత, మహిళలను తక్కువగా చూడడం లాంటి వైఖరులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక జాతిగా అందరూ సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. ఆర్యసమాజ్... భారత స్వాతంత్య్ర పోరాటానికి ఎందరో నాయకులను అందించింది. లాలా లజపతిరాయ్ లాంటి అనేకమంది జాతీయవాదులు ఆ సంస్థ నుంచి వచ్చినవారే. ఆర్యసమాజ్ విద్యా సంస్థలు, సామాజిక కార్యక్రమాలు స్వాతంత్య్ర పోరాటం దిశగా ప్రజలను మళ్ళించడంలో కీలకపాత్ర పోషించాయి.

శ్రీమద్ రాజ్‌చంద్రజీ
ఆధ్యాత్మికంగా సంక్షోభానికి గురైన సమయంలో... నేను ఆశ్రయించేది శ్రీమద్‌జీనే- ఇది మహాత్మాగాంధీ తన ‘సత్యశోధన’ గ్రంథంలో చెప్పిన మాట. ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపించి, దేశ స్వాతంత్య్ర సాధనను సుగమం చేసిన గాంధీకి ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన ఆ శ్రీమద్‌జీ ఎవరు? శ్రీమద్ రాజ్‌చంద్రజీగా శిష్యులు పిలుచుకొనే ఆ జైన యోగి అసలు పేరు లక్ష్మీనందన్ మెహతా. 1867లో గుజరాత్‌లోని వవానియాలో పుట్టారు. చిన్నప్పుడు ఒక శవ దహనాన్ని చూసిన ఆయనకు గత జన్మలన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడే ఆయనలో వైరాగ్య భావాలకు పునాది పడింది. ఏడేళ్ళ చదువును రెండేళ్ళకే పూర్తి చేసిన ఆయన బాల్యంలోనే కవిత్వం రాయడం ప్రారంభించారు. అష్టావధానిగా, శతావధానిగా ప్రఖ్యాతి పొందారు. అయితే ఆధ్యాత్మిక పురోగతే ఎప్పుడూ ఆయన లక్ష్యంగా ఉండేది. ముక్తిని వెతుకుతూ ప్రయాణం ప్రారంభించారు. ఇరవై మూడేళ్ళ వయసులో ఆయన జ్ఞానాన్వేషణ ఫలించింది. యోగిగా మారారు. అనేక రచనలు చేశారు. గాంధీ ఆయనను 1891లో... ముంబయిలో తొలిసారి కలుసుకున్నారు. శ్రీమద్‌జీలోని విశ్లేషణా నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, నైతిక నిష్ఠ గాంధీని ఆకర్షించాయి. వారిద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధం క్రమంగా బలపడింది. ‘‘ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి నా హృదయాన్ని ఇంతగా ఆక్రమించుకున్న వ్యక్తి ఇప్పటివరకూ మరొకరు లేరు’’ అని గాంధీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీకీ, శ్రీమద్‌జీకి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతూ ఉండేవి. ఒకసారి మానవుల ఉనికి, గుర్తింపు, మతం లాంటి అంశాలపై ఎన్నో సంశయాలు గాంధీకి కలిగాయి. ఇరవై ఏడు ప్రశ్నలను శ్రీమద్‌జీకి పంపారు. వాటన్నిటికీ సమాధానాలిస్తూ ఆ సందేహాలన్నిటినీ ఆయన నివృత్తి చేశారు. నిస్వార్థ సేవ, అహింసా మార్గం, నిరాడంబరత లాంటి అంశాల్లో గాంధీజీకి ఆదర్శంగా నిలచిన వ్యక్తి శ్రీమద్‌జీ. గాంధీ ఆలోచనలను తీర్చిదిద్దడంలో, విశ్వాసాలను స్థిరపరచడంలో, మహాత్ముడిగా మారడంలో శ్రీమద్‌జీ ప్రభావం అపారంగా ఉంది.
అరబింద్ ఘోష్
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15వ తేదీ శ్రీ అరవిందుల జన్మదినం కూడా. 1872లో కోల్‌కతాలో పుట్టిన ఆయన విదేశాల్లో విద్యాభ్యాసం చేశారు. వివిధ భాషలు నేర్చుకున్నారు. మన దేశ ఆధ్యాత్మికత, సంస్కృతుల ఔన్నత్యం గురించి అవగాహన ఏర్పరచుకున్నారు. బెంగాల్ విభజన ఆయనకు తీవ్ర వేదన కలిగించింది. బరోడాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశారు. స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టారు. తిరిగి కోల్‌కతాకు వచ్చి... నేషనలిస్ట్ పార్టీకి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘వందేమాతరం’ అనే పత్రికను స్థాపించి, తన రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు. బ్రిటిష్ పాలకుల చెర నుంచి దేశాన్ని విడిపించాలంటే విప్లవ పంధాయే అనుసరణీయం అనేది మొదట్లో ఆయన సిద్ధాంతం. అయితే ఆలీపూర్ బాంబు కేసులో జైలుకు వెళ్ళిన తరువాత... ఆయనలో ఆధ్యాత్మిక భావనలు మరింత బలపడ్డాయి. జైలు నుంచి విడుదలయ్యాక పుదుచ్చేరి చేరుకొని, అక్కడ యోగ సాధనను కొనసాగించారు. కాంగ్రెస్ నాయకత్వం చేపట్టాలనే అభ్యర్థనను తిరస్కరించారు. ‘సంపూర్ణ స్వరాజ్యం’ అనే నినాదాన్ని సృష్టించినది ఆయనే. ఆధ్యాత్మిక శక్తికి నిలయమైన భారతదేశమే ప్రపంచానికి గురువు అవుతుందని స్పష్టం చేసిన శ్రీ అరవిందుల ప్రభావం ఆనాటి ఎందరో జాతీయోద్యమ నాయకుల మీద ప్రగాఢంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News