Share News

Sonali Bendre Cancer Survival: భర్త వల్లే పునర్జన్మ

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:41 AM

ప్రాణాంతక వ్యాధి కబళించబోతున్నప్పుడు, జీవితం చేజారిపోతుందన్న భయం మనసును తొలిచేస్తున్నప్పుడు ప్రియమైన వారి అండ మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరైన సమయంలో వారు....

Sonali Bendre Cancer Survival: భర్త వల్లే పునర్జన్మ

ప్రాణాంతక వ్యాధి కబళించబోతున్నప్పుడు, జీవితం చేజారిపోతుందన్న భయం మనసును తొలిచేస్తున్నప్పుడు ప్రియమైన వారి అండ మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరైన సమయంలో వారు తీసుకునే నిర్ణయం మనకు పునర్జన్మ ప్రసాదిస్తుంది. బాలీవుడ్‌ ప్రముఖ నటి సోనాలి బెంద్రే విషయంలోనూ ఇదే జరిగింది. 2018లో స్టేజ్‌ 4 మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన సోనాలి.. తన విజయం వెనుక ఉన్న అసలు శక్తి తన భర్త గోల్డీబెల్‌ అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె పంచుకున్న అనుభవాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.

పిచ్చెక్కించిన ఆలోచనలు

‘‘నాకు అండగా నిలిచేందుకు చాలామంది ఉన్నారు. కానీ నేనే అక్కడి నుంచి పారిపోవాలని చూశాను. ఏదైతే అది అయింది.. ఇక్కడే చికిత్స తీసుకుందాం, బాబు ఇంకా చిన్నవాడు.. ఇలాంటి ఆలోచనలతో సమయం గడిపాను. కానీ నా భర్త గోల్డీ మాత్రం ‘మనం వెంటనే బయలుదేరుతున్నాం’ అని కరాఖండిగా చెప్పేశారు’’ అని సోనాలి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో గోల్డీ ‘నీ ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని చెప్పిన మాటలు తనను ఆలోచింపజేశాయంటారు సోనాలి.


ప్రతి రోజు ఓ గండమే

న్యూయార్క్‌ వెళ్లాకగానీ తన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం కాలేదంటారు సోనాలి. ‘‘అక్కడికి వెళ్లాక, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిశాక, ఒకటిరెండు వారాలకే నేను నా భర్తవైపు తిరిగి సరైన సమయంలో నన్ను ఇక్కడకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్‌ చెప్పాను. నాది చాలా తీవ్రమైన, వేగంగా విస్తరించే క్యాన్సర్‌. ప్రతిరోజు చాలా కీలకం. మనం ఏమాత్రం వేచి చూడలేం అని డాక్టర్లు చెప్పారు’’ అని గుర్తుచేసుకున్నారు. తాము ఉండటానికి ఒక అపార్ట్‌మెంట్‌ చూసుకునే లోపే డాక్టర్లు అత్యవసరంగా చికిత్స ప్రారంభించారని ఆ నాటి తీవ్రతను పంచుకున్నారు. ‘‘నిర్ణయం నా చేతుల్లో వదిలేసి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని తెలియక కచ్చితంగా ఆలస్యం చేసేదాన్ని. ఆ రోజు నా భర్త బలవంతంగా నన్ను తీసుకెళ్లడం నా మంచికే జరిగింది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2021లో క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్న సోనాలి అప్పటి నుంచి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ధైర్యంతో ఏదైనా సాధించవచ్చని తన జీవితం ద్వారా నిరూపిస్తున్నారు సోనాలి బెంద్రే.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Updated Date - Dec 14 , 2025 | 12:41 AM