Soaking Pulses Before Cooking: నానబెడితే చాలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:28 AM
మనం సాధారణంగా కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పుధాన్యాలకు కూరగాయలు, ఆకుకూరలు చేర్చి రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. అవి తిన్న తరవాత చాలామందికి కడుపులో ఉబ్బరం, గ్యాస్ లాంటి...
మనం సాధారణంగా కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పుధాన్యాలకు కూరగాయలు, ఆకుకూరలు చేర్చి రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. అవి తిన్న తరవాత చాలామందికి కడుపులో ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని నివారించడానికి పప్పులను వండేముందు కాసేపు నీళ్లలో నానబెడితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలను నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
పప్పుఽధాన్యాల్లో సహజంగా ఫైటిక్ యాసిడ్, టానిన్ అనే యాంటీ న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి ఐరన్, జింక్, కాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా అడ్డుకుంటాయి. పప్పులను నానబెట్టడం వల్ల వాటి ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. దీంతో శరీరం చక్కగా పోషకాలను గ్రహించగల్గుతుంది.
చిక్కుడు జాతికి చెందిన పప్పులను(వేరుశనగ, బఠానీ, శనగలు, సోయా బీన్స్‌లాంటివి) నానబెట్టడం వల్ల వాటిలోని ఒలిగోశాకరైడ్స్ అనే ప్రమాదకరమైన చక్కెరలు నీటిలో కరగిపోతాయి. దీనివల్ల ఎటువంటి జీర్ణ సమస్యలు దరిచేరవు.
పప్పులను నానబెడితే వాటిలో ఎంజైములు వృద్ధి చెంది... శరీరం త్వరగా పోషకాలను గ్రహించడానికి దోహదం చేస్తాయి.
పప్పులను నానబెట్టడడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. దీంతో వాటిలోని పోషకాలు నశించకుండా ఉంటాయి. తిన్నవెంటనే జీర్ణమై శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
రాజ్మా, కందిపప్పులను ఉడికించేటప్పుడు వాటిలో బిర్యానీ ఆకు, యాలకులు, పిప్పళ్లు లాంటి మసాలా దినుసులు వేస్తే కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలు రావు.
పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర పప్పు, కంది పప్పులను అరగంటసేపు నానబెట్టాలి. పొట్టు ఉన్న పప్పులను రెండు నుంచి నాలుగు గంటలు నాననివ్వాలి. మినపగుండ్లు, పెసలు, బొబ్బర్లు, అలసందలను ఆరు గంటలు నానబెట్టాలి. రాజ్మా, బఠానీలు, శనగలను రాత్రంతా నాననివ్వడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..