Bhaktisiddhanta Sarasvati Thakur: సింహగురు
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:32 AM
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయంలో 31వ ఆచార్యులు. ప్రపంచవ్యాప్త హరేకృష్ణ ఉద్యమాన్ని (ఇస్కాన్) స్థాపించిన ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఆయన...
8న శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పుణ్యతిథి
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయంలో 31వ ఆచార్యులు. ప్రపంచవ్యాప్త హరేకృష్ణ ఉద్యమాన్ని (ఇస్కాన్) స్థాపించిన ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఆయన శిష్యుల్లో ప్రసిద్ధులు. సరస్వతి ఠాకూర్ బాల్యనామం బిమల ప్రసాద్ దత్తా. ఆయన తండ్రి ఠాకూర్ భక్తి వినోద... ఆ రోజుల్లో ప్రభావవంతమైన ఆచార్యుడు. శ్రీ చైతన్య మహాప్రభువు సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయగల కుమారుని కోసం ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు. భక్తివినోద ఒడిశాలోని జగన్నాథ పూరీలో ప్రభుత్వ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నప్పుడు... 1874 ఫిబ్రవరి ఆరున బిమల ప్రసాద్ అక్కడ జన్మించారు. బిమలప్రసాద్‌కు ఆరు నెలల వయసున్నప్పుడు... తండ్రి ఆయనను జగన్నాథుడి పాదాల దగ్గర ఉంచారు. అప్పుడు జగన్నాథుడి మెడలోని పెద్ద పూలదండ కిందపడి, ఆ బిడ్డ చుట్టూ అలంకృతమయింది. తండ్రి నుంచి హరేకృష్ణ మంత్రాన్ని, నరసింహదేవ మంత్రాన్ని పదేళ్ళ వయసులో ఉపదేశం పొందిన బిమల ప్రసాద్... 1901లో నవద్వీపంలో ప్రముఖ వైష్ణవ సాధువైన శ్రీల గౌరకిశోర దాస బాబాజీ మహరాజ్‌ను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించారు.
ఆధ్మాత్మికత అందరిదీ...
శ్రీచైతన్య మహాప్రభువు బోధనలకు నిబద్ధుడైన సరస్వతీ ఠాకూర్ వాటిని మన దేశంతో పాటు విదేశాలలో కూడా వ్యాప్తి చేశారు. వర్ణ, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి వ్యవస్థ సనాతన ధర్మం కాదని భగవద్గీత నుంచి ఆయన ఉదహరించారు. 1913లో దక్షిణ కలకత్తాలో భాగవత్ ప్రెస్‌ను ఆయన స్థాపించారు. మొత్తం 61 రచనలను ప్రచురించారు, సవరణలు చేశారు, రచించారు. ఎనిమిది వేర్వేరు పత్రికలను కూడా నడిపారు. 1918లో, 44 ఏళ్ళ వయసులో సన్యాసం స్వీకరించి, ‘గోస్వామి మహారాజ్’ అనే బిరుదును పొందారు. అదే రోజున శ్రీధామ మాయాపూర్‌లో తన మొదటి వైష్ణవ మఠాన్ని (చైతన్య మఠం) స్థాపించారు. అది ఆయన ప్రచారానికి ప్రధాన కార్యాలయంగా మారింది. తన జీవితకాలంలో దేశ విదేశాల్లో 64 గౌడీయ మఠాలను స్థాపించి, భాగవతతత్త్వాన్ని వ్యాప్తి చేశారు. ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడానికి భౌతికమైన అర్హతలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కుల, లింగ, జాతీయతలకు అతీతంగా... గత నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ... నిజాయితీగా ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకొనేవారందరికీ ఉపదేశాన్ని అందించారు
లోకానికి మంత్ర సందేశం
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో శక్తిమంతులైన, ధైర్యవంతులైన ప్రచారకులు. అందుకే ఆయన ‘సింహగురు’గా ప్రసిద్ధి చెందారు. 1919 నుంచి 1929 వరకూ నిరంతరాయంగా భారతదేశం అంతటా పర్యటించారు. అసంఖ్యాకమైన ఉపన్యాసాలు ఇచ్చారు. చర్చలు జరిపారు. అప్రమాణికమైన మత శాఖలను ఖండించి, తుడిచిపెట్టారు. భౌతిక సుఖాలను, సౌకర్యాలను విసర్జించి, భక్తి ప్రచారానికి జీవితాతం కృషి చేసిన ఆయన 62 ఏళ్ళ వయసులో... మార్గశిర బహుళ చవితి రోజున... జగన్నాథ పూరీలో ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టారు. కులం, మతం, లింగం, దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి పవిత్ర నామాలను, ‘హరేకృష్ణ’ మంత్రాన్ని జపించాలన్నదే ఆయన ఇచ్చిన ప్రధాన సందేశం.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9640086664
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News