Share News

Kuduk Language Kurukh Culture: భాష కోసం పాటే ఆయుధం

ABN , Publish Date - Dec 04 , 2025 | 02:36 AM

Singing to Save a Language The Inspiring Journey of Mantee and Nikki Tiga

Kuduk Language Kurukh Culture: భాష కోసం పాటే ఆయుధం

మాంతీ టిగ్గా, నిక్కీ టిగ్గా... వారి గానం కేవలం వినోదానికి కాదు... అంతకుమించి. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న తమ భాషను బతికించుకొనే పోరాటానికి వారు ఎంచుకున్న ఆయుధం... పాట. జార్ఖండ్‌కు చెందిన ఈ కజిన్స్‌ చేపట్టిన ప్రయత్నం ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది.

‘‘మేము ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా కచ్చితంగా పాడే పాట ఒకటుంది. ‘‘కురుఖ్‌ ప్రజలారా! మనం ఎటు పోతున్నాం? మన పూర్వీకులు కన్న కలలేమిటో తెలుసా? వాళ్ళ ఆలోచనలేమిటో తెలుసా? వాళ్ళు మనం బతకడానికి పొలాలు ఇచ్చారు, ధాన్యం కొట్టాలు ఇచ్చారు. వాటిని వదిలేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన ఇళ్ళు అమ్మేస్తున్నాం. మనం ఎటుపోతున్నాం?...’’ ఈ అర్థంతో ఆ పాట సాగుతుంది. ప్రేక్షకులకు వినోదం అందించడం కాదు... మా భాషను బతికించుకోవడం మా లక్ష్యం. దాని కోసం సాధనంగా, ఆయుధంగా పాటను మేము ఎంచుకున్నాం’’ అని చెబుతారు మాంతీ టిగ్గా, నిక్కీ టిగ్గా.

ఆ ప్రశ్న బాధించింది...

అన్నదమ్ముల బిడ్డలైన ఈ అమ్మాయిల సొంత ఊరు... జార్ఖండ్‌ రాష్ట్రంలోని బ్రంబే అనే గిరిజన గ్రామం. ఇరవై నాలుగేళ్ళ మాంతీ గిరిజన ప్రాంతీయ భాషల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. 2002లో ‘టాటా స్టీల్‌ ఫౌండేషన్‌’ నిర్వహించిన ‘సంవాద్‌’ ఈవెంట్‌లో ఆమె తొలి ప్రదర్శన ఇచ్చారు. ‘‘నా మాతృభాష కురుఖ్‌. దాన్నే ‘కుడుఖ్‌’ అని కూడా అంటారు. ఆ భాషలో నేను పాడాను. అంతకుముందు స్టేజి మీద ఎప్పుడూ పాడకపోవడంతో చాలా భయపడ్డాను. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత... కొందరు నా దగ్గరకు వచ్చి ‘‘నువ్వు పాడిన పాట చాలా బాగుంది. ఇంతకీ అదేం భాష?’’ అని అడిగారు. ఆ ప్రశ్న నాకు ఎంతో బాఽధ కలిగించింది. నిజానికి వారి తప్పేం లేదు... ఎందుకంటే... కురుఖ్‌ కుటుంబాల్లో పుట్టినవారే మా భాష మాట్లాడడం తగ్గిపోతోంది. అదేదో సిగ్గుపడే వ్యవహారంగా, హిందీలో మాట్లాడడం గర్వకారణంగా భావిస్తున్నారు’’ అంటారు మాంతీ.


వారే మా టీచర్లు...

ఆ తరువాత ఆమెకు ‘రిథిమ్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ బ్యాండ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కానీ తన భాష అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. కురుఖ్‌... ద్రవిడ భాషా కుటుంబంలో ఉత్తర ద్రవిడ ఉప కుటుంబానికి చెందినది. మన దేశంతో పాటు నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలలో ఈ భాష మాట్లాడేవారు ఉన్నారు. వారిని ‘ఓరన్‌ తెగ’ అంటారు. ‘‘పట్టణాలకు, నగరాలకు వలస వెళుతున్న ఇప్పటి తరం వారు మా భాషను మాట్లాడడం నామోషీ అనుకుంటున్నారు. ఈ భాష మాట్లాడేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయి... అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మన భాషను మనం మరచిపోతే... గుర్తింపును కోల్పోయినట్టే’’ అంటున్నారు మాంతీ. తన ఆవేదనను తన కజిన్‌ నిక్కీ టిగ్గాతో ఆమె పంచుకున్నారు. కామర్స్‌లో మాస్టర్స్‌ చేసిన ఇరవయ్యారేళ్ళ నిక్కీ కూడా ఆమెతో కలిసి గళం కలిపేందుకు ముందుకు వచ్చారు. ‘‘మేమిద్దరం సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. మా అమ్మ, అమ్మమ్మ, మా గ్రామంలోని మహిళలు... వాళ్ళే మా టీచర్లు. వారు పొలాల్లో పని చేస్తున్నప్పుడు, పండుగల సందర్భంగా పాడే పాటలు వింటూ పెరిగాం. వాటితోపాటు చిన్నప్పుడు మమ్మల్ని నిద్రపుచ్చే సమయంలో... రాత్రివేళ చెప్పిన కథలను గుర్తుకు తెచ్చుకున్నాం. వాటినే వేదికలపై వినిపించాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారు ఆ ఇద్దరూ.

ఈ ప్రయత్నం అందరికోసం...

ప్రదర్శనలు ఎలా ఉండాలనే విషయంలో ఆ ఇద్దరూ చాలా కసరత్తే చేశారు. ఎరుపు, తెలుపు రంగులతో ఉండే తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరలు, తలకు పక్షి ఈకల అలంకారాలు, మెడ చుట్టూ గిరిజనులు ధరించే ఆభరణాలు... ఇదీ వారి ఆహార్యం. వాయిద్యాలు కూడా తరతరాలుగా గిరిజనులు ఉపయోగించేవాటినే ఎంచుకున్నారు. పాత పాటలకు కొత్త బాణీలు కట్టారు. ‘‘కురుఖ్‌ ప్రజలారా! మనం ఎటు పోతున్నాం?...’’ అనే అర్థం వచ్చే పాటతో సహా... కొత్త పాటలు రూపొందించారు. కురుఖ్‌ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘కురుఖ్‌ సంప్రదాయాల గొప్పతనాన్ని, గర్వకారకమైన విషయాలను తెలియజేస్తూ.. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చి, భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించే మా పాటలకు ప్రతిచోటా చక్కని స్పందన వస్తోంది. ఇది కేవలం కురుఖ్‌ ప్రజలకు మాత్రమే కాదు... తమ భాష, సంస్కృతి అంతరించిపోతున్నాయనే భయంతో ఉన్న ప్రతి వర్గాన్నీ తట్టిలేపే ప్రయత్నం’’ అంటున్నారు ఈ కజిన్స్‌. ఈ ఏడాది టాటా స్టీల్‌ ఫౌండేషన్‌ వారి యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ వారు ఒక పాట విడుదల చేశారు.


00-navya.jpg

సేవ కాదు, బాధ్యత...

కొన్నేళ్ళుగా వారు సాగిస్తున్న ఈ కృషికి ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి గ్రామంలోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలు, యువత... ప్రస్తుతం ఏ కార్యక్రమం జరిగినా ఆధునికమైన పాటలతో పాటు కురుఖ్‌ పాటలను తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. పాతతరానికి చెందినవారు ‘‘మా భాష, మా మాట మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి’’ అని మురిసిపోతున్నారు. ‘‘ఇది మేము సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో... అనేక వేదికల మీద మా పాటను వినిపిస్తున్నాం. ఇది కేవలం గానం కాదు, మా వారసత్వాన్ని భద్రపరుచుకోవడం. సంస్కృతికి భాష గొప్ప సాధనం. వాటిలో తమ మూలాలను ప్రజలు వెతుక్కుంటారు. అందుకే దీన్ని కళగానో, సేవగానో మేము చూడడం లేదు... బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తున్నాం’’ అంటున్నారు మాంతీ, నిక్కీ.

ఇవి కూడా చదవండి

హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే

ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..

Updated Date - Dec 04 , 2025 | 02:36 AM