Share News

Simrat Kaur From Muskaan: ఆ పాత్ర పేరుతో పిలుస్తున్నారు

ABN , Publish Date - Sep 13 , 2025 | 02:05 AM

పుట్టింది... పంజాబీ కుటుంబంలో. పెరిగింది ముంబయిలో. తెరంగేట్రం తెలుగులో. ఆరంభంలో తడబడినా... ‘గదార్‌2’తో బాలీవుడ్‌లో మెగా హిట్‌ కొట్టారు సిమ్రత్‌ కౌర్‌ రంధ్వా. ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’లో...

Simrat Kaur From Muskaan: ఆ పాత్ర పేరుతో పిలుస్తున్నారు

సెలబ్‌ టాక్‌

పుట్టింది... పంజాబీ కుటుంబంలో. పెరిగింది ముంబయిలో. తెరంగేట్రం తెలుగులో. ఆరంభంలో తడబడినా... ‘గదార్‌2’తో బాలీవుడ్‌లో మెగా హిట్‌ కొట్టారు సిమ్రత్‌ కౌర్‌ రంధ్వా. ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆమె జర్నీలో ఆసక్తికర అంశాలు కొన్ని.

సిమ్రత్‌ కౌర్‌ మొట్టమొదట వెండితెరపై కనిపించింది ‘ప్రేమతో మీ కార్తిక్‌’ చిత్రంతో. 2017లో విడుదలైన ఆ సినిమాలో హీరో కార్తికేయకు జతగా నటించారు. ఆ తరువాత ‘డర్టీ హారీ, బంగార్రాజు’ తదితర చిత్రాలు చేశారు. అయితే రెండేళ్ల కిందట విడుదలైన ‘గదార్‌2’తో బాలీవుడ్‌లో మెగా ఎంట్రీ ఇచ్చారు సిమ్రన్‌. ‘ముస్కాన్‌’గా నటించి అందరి మనసులు కొల్లగొట్టారు. అందుకే తన కెరీర్‌ గురించి మాట్లాడాలంటే... ‘గదార్‌2’కు ముందు... తరువాత అంటారు సిమ్రన్‌. ఆ వెంటనే హిందీలోనే ‘వన్‌వా్‌స’ చేశారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’లో భారతి బెనర్జీ పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ‘‘ఇది యువతరం చూడాల్సిన చిత్రం. ఎందుకంటే వాళ్లకు మన చరిత్ర తెలియాలి. ఇక ఇందులో ప్రముఖ నటులు మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కనిపిస్తారు. ఎవరికివారే అద్భుతంగా నటించారు’’ అంటున్న సిమ్రత్‌ చేతిలో ఇప్పుడు మరో భారీ బడ్జెట్‌ చిత్రం ‘గదార్‌3’ కూడా ఉంది.


అనుకోకుండా ఇటు వైపు...

ముంబయి డాన్‌ బాస్కో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన సిమ్రత్‌... నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. మరి ఇటువైపు ఎలా వచ్చారని అడిగితే... ‘‘నటిని కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అసలు సినిమాల్లో ప్రయత్నాలు కూడా చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది అంతే. కానీ ఇక్కడ అవకాశాలు తెచ్చుకోవడమే కాదు, నిలదొక్కుకోవడం కూడా ఎంతో కష్టం. ముఖ్యంగా పరిశ్రమలో మనకంటూ ఎవరూ లేనప్పుడు... ఎటు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనేవి తెలియవు. అడుగడుగునా ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతాయి. పరిశ్రమకు చెందిన వాళ్లకైనా ఇక్కడ పని దొరకడం అంత సులువు కాదు’’ అని ఓ సందర్భంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు.

వెనక్కి తిరిగి చూసుకోలేదు...

అయితే ‘గదార్‌2’ తన జీవితాన్నే మార్చేసింది అంటారు సిమ్రత్‌. ‘‘2023 ఆగస్టు 10 వరకు నేను కేవలం సిమ్రత్‌ను మాత్రమే. ఆగస్టు 11 నుంచి జనం నన్ను ‘ముస్కాన్‌’ అంటూ పిలుస్తున్నారు. అంటే నా పాత్ర వారిని అంతగా ఆకట్టుకుందనే కదా. ఆ తరువాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నా మూడో చిత్రం చేస్తున్నా. అదికూడా భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌’’ అంటూ ఆనందంగా చెబుతున్న ఈ భామ... కొన్ని మ్యూజిక్‌ వీడియోల్లో కూడా సిమ్రత్‌ నటించారు. యూట్యూబ్‌లో వాటిని లక్షలమంది వీక్షించారు.


అనుభవ పాఠాలు...

బాలీవుడ్‌లో ఎంట్రీతోనే బ్లాక్‌బస్టర్‌ను చూసినా... ఆ తరువాత సిమ్రత్‌ చేసిన చిత్రాలు తక్కువే. సాధారణంగా అంతపెద్ద హిట్‌ తరువాత కొత్త ప్రాజెక్ట్‌లు వెతుక్కొంటూ వస్తాయి. ఇదే విషయం ఆమెను అడిగితే... ఎన్ని సినిమాలు చేసేమనేదానికన్నా చేసినవాటిలో ఎన్ని పాత్రలు గుర్తున్నాయన్నది ముఖ్యమంటారు. ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాని చెబుతారు. ‘‘హృదయరేఖ నేరుగా వెళితే మనం చనిపోయినట్టు. ఆ రేఖ ఎప్పుడూ ఎత్తుపల్లాలుగానే ఉండాలి’... ఈ మాటలే నాకు నిత్య స్ఫూర్తి. కిందకు పడిపోయిన సందర్భాలు నాకు తిరిగి పుంజుకొనే శక్తినిస్తాయి’’ అంటూ చెప్పుకొచ్చిన సిమ్రత్‌... ఈ ఎనిమిదేళ్లల్లో ఎనిమిదే సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు ఒక చిత్రం విడుదలకు, మరొక మెగా ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 02:05 AM