Share News

ఈ ఆసనాలతో బీపీ నియంత్రణ

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:59 AM

నేడు ఎంతో మందిని వేధిస్తున్న సమస్య రక్తపోటు. ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి వంటి అనేక కారణాలతో ఈ సమస్య పెరిగిపోతుంది. అయితే కొన్ని ఆసనాలతో బీపీని...

ఈ ఆసనాలతో బీపీ నియంత్రణ

నేడు ఎంతో మందిని వేధిస్తున్న సమస్య రక్తపోటు. ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి వంటి అనేక కారణాలతో ఈ సమస్య పెరిగిపోతుంది. అయితే కొన్ని ఆసనాలతో బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలివీ.

శవాసనం: ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను పెంచుతుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ ఆసనంతో మెదడు పనితీరు కూడా మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

  • ముందుగా నేలమీద వెల్లికిలా పడుకుని కాళ్లను దూరంగా చాచాలి. రెండు చేతులను కూడా శరీరానికి దూరంగా చాపాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని శ్వాసమీద మనసు నిమగ్నం చేయాలి. అయిదు నుంచి పది నిమిషాల తరువాత మామూలు స్థితికి రావాలి.

ఉత్తానాసనం: ఈ ఆసనం మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగేలా దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దాంతో రక్తపోటు తగ్గుతుంది.

  • నేలమీద నిటారుగా నిల్చొవాలి. ముందుకు వంగి తలను పాదాల వరకు తీసుకురావాలి. ఈ క్రమంలో కాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. నిమిషం నుంచి రెండు మూడు నిమిషాలు తరువాత మెల్లిన సాధారణ స్థితిలోకి వచ్చేయాలి.

భుజంగాసనం: ఇది మెదడుతో పాటు శరీరం మొత్తానికీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని సమర్ధంగా నిర్వహించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

  • ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. అరచేతులను నేలకు ఆనించి వాటి ఆధారంతో మెడ, నడుము పైభాగాన్ని ఎత్తాలి. నడుము కింద భాగం మాత్రమే నేలకు ఆనాలి. ఇలా 20-30 సెకన్ల పాటు ఉండి నెమ్మదిగా మాములు స్థితికి రావాలి.


వృక్షాసనం: ఇది శరీరాన్ని దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది.

  • రెండు కాళ్లను దగ్గరగా ఉంచి నిల్చొవాలి. మెల్లగా ఓ కాలిని పైకి లేపి ఇంకో కాలి తోడ మీద ఆనించి ఒక కాలి మీద నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులను తల పైకి తీసుకెళ్లి నమస్కారం పెట్టే భంగిమలో ఉంచాలి. కొన్ని నిమిషాల తరువాత సాధారణ స్థితికి రావాలి.

సేతుబంధాసనం: ఈ ఆసనం మెదడుకు ప్రశాంతతకు చేకూర్చి రక్తపోటును నియంత్రణలో ఉంచేలా సహాయపడుతుంది.

  • ముందుగా నేలపై వెల్లికిలా పడుకోవాలి. మోకాళ్లను మడిచి భుజాలు, చేతులను నేలమీద ఆధారం చేసి నడుమును పైకి లేపాలి. ఇలా 20-30 క్షణాల పాటు ఉండి మామూలు స్థితికి రావాలి.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 03:59 AM