Share News

సేవే పరమావధి

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:10 AM

సమాజానికి మొదటి గురువు... మహిళ. వారికి ఉన్న గొప్ప బలం... మాతృత్వం. సృష్టిని కొనసాగించడం కోసం, భావి తరాలను తీర్చిదిద్దడం కోసం భగవంతుడు అది వారికి ఇచ్చిన...

సేవే పరమావధి

చింతన

సమాజానికి మొదటి గురువు... మహిళ. వారికి ఉన్న గొప్ప బలం... మాతృత్వం. సృష్టిని కొనసాగించడం కోసం, భావి తరాలను తీర్చిదిద్దడం కోసం భగవంతుడు అది వారికి ఇచ్చిన వరం, బాధ్యత కూడా. తల్లులు ప్రయత్నించినట్టయితే, తమ పిల్లల్లో మన ఘనమైన సంప్రదాయం గురించి ఆలోచనలు నాటుకొనేలా చేయగలరు. ఆడపిల్లలను, మహిళలను గౌరవించడం ఎంత ముఖ్యమనే పాఠాలు నేర్పగలరు. వారు సరైన పరిస్థితులు సృష్టించినప్పుడు... పిల్లలు ఆదర్శవంతులైన పౌరులుగా ఎదుగుతారు. మన సంస్కృతిపట్ల ఆపేక్షను వారిలో కలిగించగలం. వారి వ్యక్తిత్వాలను సమున్నతంగా రూపుదిద్దగలం. మనిషికి సంబంధించిన చాలా అంశాలను అతనిలోని జన్యువులు నిర్ధారిస్తాయని సైన్స్‌ చెబుతోంది. కానీ పెరుగుతున్న పిల్లలపై తల్లి, ఇల్లు, పరిసరాలు, పరిస్థితులు చూపే ప్రభావం చాలా పెద్దది.


ఈ రోజు మహిళలు జీవితాల్లో ఎలా పురోభివృద్ధి సాధించాలా అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు. అది మంచిదే. మహిళలు అన్ని రంగాల్లో కచ్చితంగా ముందుకు సాగాల్సిందే. కానీ, అప్పుడప్పుడు ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే వారి వెనుక వారిని అనుసరించే, అనుకరించే పిల్లలు ఉంటారు. రేపటి సమాజం శక్తి, సౌందర్యం, పరిమళం... వీటన్నిటినీ నిర్ణయించేది నేటి తల్లులే. తల్లి పాలు పిల్లల శరీరానికి పోషకాలు అందించడమే కాదు, వారి మెదడు, తెలివితేటలు, హృదయం అభివృద్ధి చెందడానికి కూడా దోహదం చేస్తాయి. అదేవిధంగా, ఒక ఆదర్శమూర్తిగా తల్లి నేర్పే జీవిత పాఠాలు, విలువలు పిల్లలకు వారు భవిష్యత్తులో ఉపయోగించుకోగలిగే బలాన్నీ, ధైర్యాన్ని అందిస్తాయి. కేవలం తల్లి పాత్ర గురించి ఇంతగా చెప్పడానికి కారణం ఏమిటంటే... మహిళ బలం ఆమె మాతృత్వంలోనే ఉంది. మాతృత్వం అనేది లోకాన్ని రూపాంతరీకరించే ఒక శక్తి. ఇతరుల హృదయాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆ శక్తి పని చేస్తుంది. మహిళలో స్వతస్సిద్ధంగా ఉండే ఈ మమకారం చాలా విలువైనది.


మహిళలు నిస్సహాయులో, వేరేవారిపై ఆధారపడేవారో కాదు. వారికి సింహాల్లా గర్జించే ధైర్యం, శక్తి ఉన్నాయి. వారు వేరొకరు వెలిగించే కొవ్వొత్తులలాంటివారు కాదు. స్వయంప్రకాశకత్వం కలిగిన సూర్యుడులాంటివారు. సరైన అవకాశాలు, స్వేచ్ఛ లభిస్తే వారు అద్భుతాలు చెయ్యగలరు. తెలివితేటల్లో కానీ, సామర్థ్యంలో కానీ మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువ కాదు. ఎలాంటి పనినైనా చక్కగా నిర్వర్తించగలిగే సంకల్పబలం, సృజనాత్మక శక్తి వారికి ఉన్నాయి. ఏ రంగంలోనైనా వారు అత్యుత్తమ శిఖరాలు సాగించగలరు. ఆధ్యాత్మిక రంగానికి కూడా ఇది వర్తిస్తుంది. దీన్ని సాధించడానికి స్వచ్ఛమైన హృదయం, మేథోపరమైన సామర్థ్యం ఉండాలి. ఏ పనినైనా సానుకూల దృక్పథంతో ప్రారంభించాలి. ఆరంభం మంచిగా ఉంటే... అది మంచిగా కొనసాగుతుంది, ముగింపు సైతం మంచిగానే ఉంటుంది. దీనికి సాధన కావాలి. అలా సాధన చేసే క్రమంలో సహనం కలుగుతుంది, తమ పట్ల విశ్వాసం, తోటివారి పట్ల ప్రేమ బలపడతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ రంగంలోనైనా నాయకత్వం అంటే ఆధిపత్యం కోసమో, నియంత్రణ కోసమో కాకూడదు. ఇతరులకు ప్రేమతో, ఆప్యాయతతో సేవ చెయ్యడమే మనకు పరమావధి కావాలి.

మాతా అమృతానందమయి

Also Read:

బియ్యం నీటిని పారేస్తున్నారా.. వాటితో అద్భుత ప్రయోజనాలు..

అబ్బాయిలూ ఈ టిప్స్ పాటిస్తే అమ్మాయిలు ఫిదా ..

Updated Date - Mar 07 , 2025 | 07:10 AM