Satvika: ఆసనం అద్భుతమిక
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:30 AM
చిన్నప్పుడు తల్లి తినిపించిన గోరుముద్దలనే కాదు. ఆమె నేర్పించిన ఆసనాలను కూడా ఆమె వంటపట్టించుకుంది. వెలుగుబంటి సాత్విక.
చిన్నప్పుడు తల్లి తినిపించిన గోరుముద్దలనే కాదు. ఆమె నేర్పించిన ఆసనాలను కూడా ఆమె వంటపట్టించుకుంది. వెలుగుబంటి సాత్విక. కఠినమైన ఆసనాలను కూడా అవలీలగా వేయడంలో దిట్ట అనిపించుకుంది. పూర్ణశలభాసనాన్ని వేసి 14 ఏళ్లకే పరిపూర్ణమైన యోగానుయోధురాలిగా ఆమె అందరి ప్రశంసలు అందుకుంటోంది. గత నెల రోజులుగా యోగాంధ్రలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం విజయవాడలో రైల్వే శాఖ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సాత్విక... దామోదర్, అరుణల కుమార్తె. యోగా శిక్షకురాలిగానూ రాణిస్తోంది. ఓ ప్రైవేటు స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న సాత్విక... ఆరేళ్ల వయస్సులోనే యోగా సాధన మొదలుపెట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతో పాటు యోగాలోనూ శిక్షణ పొందుతూ వస్తోంది. తొలుత కోచ్ శ్రీనివాస్ వద్ద, ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో కోచ్ నాగేంద్ర వద్ద శిక్షణ పొందుతోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్‌లో ప్రధాని మోదీ సమక్షంలో పూర్ణశలభాసనాన్ని 180 సెకండ్ల పాటు వేసి వాహ్వా అనిపించుకుంది. వీటితో పాటు 200 మంది యోగా క్రీడాకారులతో గిన్నిస్ వరల్డ్ రికార్డు మాస్ ఈవెంట్‌లోనూ ఆకట్టుకుంది. తమిళనాడు ప్రభుత్వం, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తమిళనాడు సంయుక్తంగా చెన్నైలో నిర్వహించిన ‘చిన్‌స్టాండ్ పోజ్’ ప్రదర్శనలో సాత్విక అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. దీనికి గానూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది.
2022లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచింది. నేషనల్ యోగాసనా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీల్లో ప్రథమస్థానం, 2023లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో, అలాగే 2024లో వరుసగా మూడు సార్లు ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించింది. యోగా డిమానుస్ట్రేటర్‌గానూ ఆకట్టుకుంటోంది.
మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడుల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. భారత్ స్కౌట్‌లో ఉన్న సాత్విక రాజ్య పురస్కారానికి ఎంపికైంది. ముఖ్యంగా యోగాసనాలలో బ్యాక్ బెండ్, ట్విస్టింగ్ ఆసనాలతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.