Share News

అపరాధ భావం ఆ రోజంతా వెంటాడింది

ABN , Publish Date - May 14 , 2025 | 03:47 AM

సానియా మిర్జా... అయిదేళ్ల వయసులో రాకెట్‌ పట్టి... ముప్ఫై ఏళ్ల క్రీడా జీవితంలో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచారు. అమ్మాయిలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు. రెండేళ్ల క్రితం తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆమె...

అపరాధ భావం ఆ రోజంతా వెంటాడింది

అంతరంగం

సానియా మిర్జా... అయిదేళ్ల వయసులో రాకెట్‌ పట్టి... ముప్ఫై ఏళ్ల క్రీడా జీవితంలో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచారు. అమ్మాయిలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు. రెండేళ్ల క్రితం తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆమె... అప్పటి నుంచి కొడుకు ఇజామ్‌ ఆలనా పాలనా చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ఓ పాడ్‌కా్‌స్టలో క్రీడా జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు, మాతృత్వపు తొలి రోజుల్లో ఎదురైన విపత్కర పరిస్థితుల గురించి ఇలా చెప్పుకొచ్చారు.

‘‘చిన్నప్పుడు నేను స్కూల్‌కు వెళ్లే దారిలో ఓ టెన్నిస్‌ కోర్టు ఉండేది. ప్రతిరోజూ దాని ముందు నుంచి వెళుతూ అక్కడ ఆగి ఎలా ఆడుతున్నారో చూస్తూ ఉండేదాన్ని. అలా టెన్నిస్‌ మీద ఆసక్తి కలిగింది. అయిదో ఏట నుంచి ఆట మొదలుపెట్టాను. నాకు పన్నెండేళ్లు వచ్చేవరకూ ఒక హాబీగానే ఆడాను. తరవాత వింబుల్డన్‌ ఆడాలనే కోరిక పెరిగింది. ఉదయం అయిదున్నరకు లేచి ఫిట్‌నెస్‌ క్లాసులకు వెళ్లేదాన్ని. దీంతో స్కూల్‌కి వెళ్లడం ఆలస్యమయ్యేది. అప్పుడు నాన్న వచ్చి స్కూల్‌ యాజమాన్యానికి నా పరిస్థితి చెప్పడంతో అరగంట ఆలస్యమైనా స్కూల్లోకి అనుమతించేవారు. అమ్మ ఇంటి నుంచి బట్టలు, తినడానికి ఏదైనా చిరుతిండి తీసుకుని వచ్చేది. స్కూల్లోనే బట్టలు మార్చుకుని టెన్నిస్‌ క్లాసులకు వెళ్లేదాన్ని. నాకు పదహారేళ్లు వచ్చాక ప్రొఫెషనల్‌గా ఆడడం నేర్చుకున్నా. రోజుకు ఎనిమిది గంటలు కోర్టులో లేదంటే జిమ్‌లో ఉండేదాన్ని. చదువుకోవడానికి సమయం సరిపోయేది కాదు. కానీ పరీక్షలప్పుడు మాత్రం శ్రద్ధగా చదివి, డిగ్రీ పూర్తి చేశాను. నా ఈ క్రీడా ప్రయాణంలో టీచర్లు, లెక్చరర్లు, కుటుంబం అందించిన సహకారం మరువలేనిది. ఆ ప్రోత్సాహంతోనే విజయాలు సాధించాను.


సమానత్వం ఎక్కడ?

అప్పట్లో అమ్మాయిల మీద ఎన్నో ఆంక్షలు ఉండేవి. పెద్దగా నవ్వకు, సరిగా కూర్చో, ఇలా చేయకు, అలా మాట్లాడకు, బయట అబ్బాయిలతో ఆడకు... అంటూ ఎన్నో చెబుతుండేవారు. అదే అబ్బాయిల విషయంలో ఇలాంటివి ఏమీ ఉండేవికావు. క్రీడలనేవి పురుషులకే సొంతం అనే తీరులో సమాజం ఉండేది. క్రీడాకారిణిగా ఎదిగేటప్పుడు ఎదురైన ఎన్నో విమర్శలు, వ్యతిరేకతల నుంచి నన్ను అమ్మానాన్న కాపాడారు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆ ధైర్యంతోనే 19 ఏళ్ల వయసులో నా వస్త్రధారణపై వచ్చిన విమర్శలను నిజాయితీగా తిప్పికొట్టాను. మగవారినైతే వాళ్ల ఫిట్‌నెస్‌, ఆటతీరును బట్టి అంచనా వేసేవారు. అదే క్రీడాకారిణుల విషయంలో మాత్రం ఎంత అందంగా కనిపిస్తుంది, సన్నగా ఉందా, లావుగా ఉందా, వస్త్రధారణ ఎలా ఉంది అనే విషయాలన్నీ ప్రస్తావనకు వచ్చేవి. ఏదైనా పార్టీకి వెళ్లినా... రెస్టారెంట్‌కు వెళ్లినా... ఎవరితో కలిసి వెళ్లింది, ఏ సమయంలో వెళ్లింది, ఏం తింటుంది అనేవి చర్చకు వచ్చేవి. ఇలాంటి విపరీత ధోరణి విసుగు తెప్పించేది. పురుషులనైనా, మహిళలనైనా వారి ప్రతిభ ఆధారంగానే గుర్తిస్తే బాగుంటుందని అనుకునేదాన్ని. ఓ ఈవెంట్‌లో నేను, నికత్‌ జరీన్‌, సైనా, జోష్నా చినప్పా కలుసుకున్నాం. అందరం క్రీడాకారిణులమే. వేర్వేరు మతాలు, ప్రాంతాలకు చెందిన మేము ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు ఒకేలా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికీ మహిళలకు సమాన హక్కులు లభించడం లేదు. 30 ఏళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగైందనే చెప్పాలి. కానీ మహిళలు ఇంకా ఎదగాలి. పరిణతి సాధించాలి.


ఓ అద్భుతమైన జ్ఞాపకం...

క్రీడా ప్రస్థానాన్ని కొనసాగించడం అంత సులువేమీ కాదు. ప్రతి ట్రోఫీ వెనక ఎన్నో సంవత్సరాల శ్రమ, త్యాగం ఉంటాయి. నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. జిమ్‌లో వర్కవుట్స్‌, కోర్టులో సాధన చేయడంలోనే గంటలు గడిచిపోయేవి. ఆడేటప్పుడు గాయాలయ్యేవి. రాత్రిపూట ఒళ్లంతా నొప్పిగా అనిపించినా అలాగే పడుకునేదాన్ని. ఉదయం లేవగానే మళ్లీ అదే దినచర్య. ఇవన్నీ నా లక్ష్యం ముందు చిన్నవిగా అనిపించేవి. నిన్నటి కంటే ఈ రోజు ఇంకా బాగా ఆడాలి అనుకునేదాన్ని. కష్టపడితేనే అదృష్టం కలసివస్తుందని నమ్మేదాన్ని. నా చిన్నప్పుడు హైదరాబాద్‌లో ఓ ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌ జరిగింది. అందులో ఆడడానికి నాకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ దొరికింది. ఆ టోర్నమెంట్‌ గెలిచాను. ఒక అవకాశం దొరికిన సందర్భం... దాన్ని వినియోగించుకున్న క్షణం... నిజంగా ఓ అద్భుతమైన జ్ఞాపకం. ఈ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది.

వీడ్కోలు వేళ...

ఇజాన్‌ పుట్టిన తరవాత ఫిట్‌నెస్‌ సాధించడం కోసం చాలా కష్టపడ్డాను. రోజులు గడుస్తున్నకొద్దీ నాలో శక్తి తగ్గుతుందనిపించేది. మోకాళ్లకు, మోచేతికి శస్త్రచికిత్సలు జరిగాయి. మునుపటిలా కాకుండా గాయాలు మానడానికి చాలా రోజుల సమయం పట్టేది. మూడేళ్ల కొడుకుని నాతోపాటు విదేశాలకు తీసుకువెళ్లడం కూడా కష్టంగా ఉండేది. వీటన్నింటి మధ్య కెరీర్‌ను కొనసాగించడం ఇక సాధ్యం కాదనిపించింది. నా చివరి మ్యాచ్‌ దుబాయ్‌లో జరిగింది. ఆ రోజు పత్రికా సమావేశానికి నాతోపాటు ఇజాన్‌ కూడా వచ్చాడు. అక్కడ చిరునవ్వుతో హుందాగానే ఉన్నాను. మనసులో కూడా ఎటువంటి ఆందోళన లేదు. అక్కడ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ క్రీడా జీవితం నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికి వచ్చేశాను. ఇల్లంతా స్నేహితులతో నిండి ఉంది. నేను నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మూడు గంటలపాటు ఏడుస్తూనే ఉన్నా. ఉదయం లేవగానే అంతా శూన్యంగా అనిపించింది. కానీ మరుక్షణంలోనే... జిమ్‌కు, కోర్టుకు వెళ్లక్కర్లేదు... రోజంతా ఇజాన్‌తోనే ఉండవచ్చు అని గుర్తుకు వచ్చి మనసంతా సంతోషంతో నిండిపోయింది. నా కెరీర్లో ఎన్నో లక్ష్యాలు సాధించాను. ఇప్పుడు అమ్మగా నా లక్ష్యం మీద దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందనిపించింది. నా కొడుకుతో పూర్తి సమయం గడపాలని నిశ్చయించుకున్నాను. అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించాను. బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఓ తల్లికి ఎదురయ్యే మధురానుభూతులను ఆస్వాదించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను.


బిడ్డ కోసం తల్లడిల్లిన క్షణాలు...

కెరీర్‌ ధ్యాసలో పడి బిడ్డను నిర్లక్ష్యం చేస్తున్నానా? అనే ప్రశ్న... వృత్తి, ఉద్యోగాల్లో కొనసాగే ప్రతి తల్లికీ ఎదురవుతుంది. ఒక్కోసారి ఇది మనోవేదనను కలిగిస్తుంది. ఇజాన్‌ పుట్టిన ఆరు వారాలకే నేను అత్యవసర పనిమీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. పాలు తాగే పసివాడిని వదిలి వెళ్లాలంటే కష్టంగా అనిపించింది. నేను బయలుదేరే చివరి నిమిషం వరకూ వాడికి పాలు పడుతూనే ఉన్నాను. అయినా... ప్రతి క్షణం బిడ్డ గురించే ఆలోచిస్తూ తల్లడిల్లి పోయాను. నా మనసంతా అపరాధ భావంతో నిండిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చి బిడ్డను చూడగానే నాకు ఏడుపు ఆగలేదు. ఆ సమయంలో అమ్మ నన్ను ఓదార్చింది. పాలిచ్చే తల్లులకు ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. వాటితోపాటే శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల పెంపకం అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే అన్న భావన సమాజంలో నాటుకుపోయింది. దీనివల్ల తల్లుల మీద అదనపు భారం పడుతోంది. పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా, మానసిక పరిపక్వతతో పెరగాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా బాధ్యతలు పంచుకోవాలి.

రిటైర్‌ అయ్యాక...

నాకు టెన్నిస్‌ చాలా ఇష్టం. క్రీడా జీవితానికి వీడ్కోలు పలికినప్పటికీ టెన్నీస్‌ నా జీవితంలో భాగంగానే ఉంది. అప్పుడప్పుడు కామెంటరీలు చెబుతుంటాను. ఓ టెన్నిస్‌ ఛానెల్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను. దుబాయ్‌లో టెన్నిస్‌ అకాడమీని నిర్వహిస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్‌లు చేస్తుంటాను. నాకు మోటివేషనల్‌ స్పీకింగ్‌ అంటే చాలా ఇష్టం. వీటికి సంబంధించిన ఎపిసోడ్స్‌ చేస్తుంటాను. ఈవెంట్లు, షూటింగ్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నప్పుడు ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవడానకి విమానం ఎక్కేస్తాను. పగలంతా పనుల నిమిత్తం ఎక్కడ తిరిగినా సాయంత్రం కాగానే ఇజాన్‌ కోసం ఇంటికి చేరుకుంటాను. వాడితో కలిసి టెన్నిస్‌, క్రికెట్‌, వాలీబాల్‌ ఆడుతుంటాను.’’


క్రీడల్లో రాణించాలనుకొనే అమ్మాయిలకు చెప్పేదేంటంటే... ఏ ఆటలోనైనా ఉన్నత స్థాయికి ఎదగాలంటే శ్రమ పడాలి. ఎన్నింటినో త్యాగం చేయాలి. క్రమశిక్షణ పాటించాలి. ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక ధైర్యం పెంచుకోవాలి. జయాలతోపాటు అపజయాలను కూడా స్వీకరించగలగాలి. అలాగని ఆటే జీవితం కాదు. ఏ ఆట అయినా జీవితంలో ఒక భాగం మాత్రమే.

ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Updated Date - May 14 , 2025 | 03:47 AM