ఉప్పుతో ఇలా
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:52 AM
మనం సాధారణంగా ఉప్పుని రుచి కోసం వాడుతూ ఉంటాం. ఉప్పులేని వంటను ఊహించలేం కూడా! అలాంటి ఉప్పుని రకరకాలుగా వినియోగిస్తూ ఇంట్లో శుచి శుభ్రతలను...
మనం సాధారణంగా ఉప్పుని రుచి కోసం వాడుతూ ఉంటాం. ఉప్పులేని వంటను ఊహించలేం కూడా! అలాంటి ఉప్పుని రకరకాలుగా వినియోగిస్తూ ఇంట్లో శుచి శుభ్రతలను పెంచుకోవచ్చు.
బకెట్ నీళ్లలో చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిని ఇల్లంతా చల్లి తడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే ఇంట్లోకి క్రిమి కీటకాలు రావు. తలుపులు మూసి ఉంచడం వల్ల గదుల్లో నిండే వాసనలు తొలగిపోయి ఇల్లు తాజాగా ఉంటుంది. ఒక చిన్న గిన్నె నిండా ఉప్పు నింపి దాన్ని ఒక మూలగా పెడితే బాత్‌రూమ్‌లో హానికారక బ్యాక్టీరియాలు నశిస్తాయి.
ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, మాంసం, చేపలు తదితరాలను శుభ్రం చేసి ముక్కలుగా తరిగినప్పుడు వాటి వాసనలు చేతులకు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చేతులను ముందుగా నీళ్లతో తడపాలి. తరవాత అరచేతిలో కొద్దిగా కల్లుప్పు తీసుకుని రెండు చేతులనూ ఒకదానితో మరోదాన్ని రుద్దుకోవాలి. రెండు నిమిషాల తరవాత మంచినీళ్లతో కడిగేసుకుంటే వాసనలు పూర్తిగా పోతాయి.
వంటగదిలో ఉండే సింక్‌లో కొద్దిగా రాళ్లఉప్పు చల్లి బ్రష్‌తో గట్టిగా రుద్దాలి. తరవాత మంచినీళ్లు పోసి కడగాలి. రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే సింక్ శుభ్రంగా ఉంటుంది. స్టీల్, గ్రానైట్, సిమెంట్ సింక్‌లకు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది.
ఒక్కోసారి వంటపాత్రలు, కంచాలు, పింగాణీ పళ్ళాలకు వంటకాల వాసనలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు స్క్రబ్బర్‌తో మెత్తటి ఉప్పును అద్ది వాటిని తోమితే సమస్య తీరుతుంది. పసుపు, కారం తదితర మరకలు; నూనె జిడ్డు కూడా తొలగిపోతాయి.
ఇనప మూకుడు, పెనం, వంటకోసం ఉపయోగించే ఇతర సామాగ్రికి తరచూ తుప్పు పడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు వాటిని తోమడం కష్టంగా అనిపిస్తుంది. అలాకాకుండా వాటిపై ఉప్పునీళ్లు చల్లి పావుగంటసేపు అలాగే ఉంచాలి. తరవాత తడి బట్టతో తుడిచేస్తే చాలావరకు తుప్పు వదిలిపోతుంది.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి