Share News

Sahajayoga: పరమాత్మకు ప్రతిబింబమే ఆత్మ

ABN , Publish Date - Nov 21 , 2025 | 06:12 AM

శ్రీ ఆది శంకరులను ఆయన గురువు గోవింద భగవత్పాదులు ‘‘నీవు ఎవరు?’’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం... ఆత్మాష్టకం. అందులో ఆత్మ గురించి, ఆత్మ స్వరూపం గురించి శ్రీ శంకరులు చాలా లోతుగా వివరించారు....

Sahajayoga: పరమాత్మకు ప్రతిబింబమే ఆత్మ

సహజయోగ

శ్రీ ఆది శంకరులను ఆయన గురువు గోవింద భగవత్పాదులు ‘‘నీవు ఎవరు?’’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం... ఆత్మాష్టకం. అందులో ఆత్మ గురించి, ఆత్మ స్వరూపం గురించి శ్రీ శంకరులు చాలా లోతుగా వివరించారు. ‘‘మీ ఆత్మ గురించి తప్పకుండా తెలుసుకోవాలి’’ అని ఎందరో అవతారపురుషులు చెప్పారు. ఎందుకంటే... మనిషి తన ఆత్మ గురించి తెలుసుకోకుండా పరమాత్మ గురించి తెలుసుకోలేడు. ఆత్మ అనేది మన హృదయంలో ఉన్న పరమాత్మకు ప్రతిబింబం. అది నీటిలో కనిపించే సూర్యుడి ప్రతిబింబంలా ఉంటుంది. నీటిలో మనం సూర్యుణ్ణి ప్రతిబింబ రూపంలో చూస్తున్నప్పటికీ... ఆయన ఆ నీటిలో ఉండడు. ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. అదే విధంగా ఆత్మ కూడా చిన్నదే అయినా... దాని మూలం అన్నిటికీ అతీతమైనది, అపరిమితమైనది. దాన్ని భగవంతుడు మన సూక్ష్మ శరీర వ్యవస్థలో, హృదయ స్థానంలో అంతర్గతంగా ఏర్పాటు చేశాడు.

ఆ వెలుగులలో...

భగవంతుడు తన సంకల్పంతో కుండలినీ శక్తిని కూడా మనలో ఏర్పాటు చేశాడు. అది మన వెన్నెముక చివరి భాగాన... త్రికోణాకారంలో ఉండే ఎముక లోపల నిక్షిప్తమై ఉంటుంది. మనం మనలో ఉన్న ఆత్మ తాలూకు ప్రతిబింబాన్ని తెలుసుకొనేలా చేసేది ఆ కుండలినీ శక్తే. సహజయోగంలో కుండలినీ ఉత్థానం చాలా సులువైనది, అది తక్షణమే జరుగుతుంది. మన గత జన్మ పాపకర్మల ప్రభావాన్ని తుడిచేసుకోవడానికి, పూర్వం నుంచి మనలో పోగు చేసుకున్న మురికిని వదుల్చుకొని స్వచ్ఛంగా ఉండడానికి అది సహాయపడుతుంది. కలియుగపు చీకటి ఛాయలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముడుతున్న ఈ సమయంలో... మన ఆత్మజ్యోతి ఉన్నతంగా ప్రజ్వలిస్తుంది. ఆ వెలుగులో మనం పవిత్రతను, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని పొందగలుగుతాం. ఆ వెలుగుతోనే ప్రపంచంలోని చీకటిని పారద్రోలగలుగుతాం. ఇది చాలా మహత్తరమైన కార్యం. దీనికోసం మనలోని ఆత్మజ్యోతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. దానివల్ల మన పాపాలు, గత జన్మ కర్మలు, అహంకారం... ఇలా అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.


మరణం ఒక మజిలీ...

ఈ లోకంలో మానవుడి తీరును అర్థం చేసుకోవడం కష్టం. దానికన్నా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం చాలా సులువు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఆయనకు ద్వంద్వ వైఖరులు లేవు. మానవులలో ద్వంద్వ వైఖరే కాదు... అనేక విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. అవి మనని అరిషడ్వర్గాలకు బానిసలుగా చేస్తాయి. ఆ స్థితిని అధిగమించి, ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు... మన ఆత్మకు మూలమైన పరమాత్మను కనుక్కోగలుగుతాం. ‘‘మానవుడి ఉనికి ఆత్మ. జననం నుంచి మరణం వరకూ శరీరం ఒక్కొక్క దశ నుంచి ఎలా ప్రయాణిస్తుందో... ఆత్మ కూడా అదే విధంగా ఒక దేహం నుంచి మరో దేహానికి వెళుతుంది. వివేకవంతులు జననం, మరణం అనే మాయలో పడకుండా సత్యాన్ని గ్రహించాలి. బాహ్య శరీరంమీద మనకు ఉన్న మమకారం వల్ల బాధ పుడుతోంది. అనంతమైన ఆత్మకు మరణం అనేది ఒక మజిలీయే కానీ అంతం కాదు’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు హితవు చెప్పాడు. ఆత్మ నిత్యమనీ, నాశనం లేనిదనీ, అన్నిటికీ అతీతమనీ, కాబట్టి ఆత్మ తత్త్వాన్ని తెలుసుకొని బంధవిముక్తి పొందాలనీ సూచించాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడి దృష్టిని ఆత్మవైపు మరల్చి, ఆత్మసాక్షాత్కారం కలిగేలా చేశాడు శ్రీకృష్ణుడు.

నిర్మల చిత్తంతోనే సాధ్యం

‘య నేతి నేతి వచనే నిగమ అగోచ...’ అని చెబుతున్నాయి ఉపనిషత్తులు. ‘‘ఇది బుద్ధి కాదు, వివేకం కాదు, పంచభూతాలు కాదు, చిత్తం కాదు, ఇంద్రియాలు కాదు, దుఃఖం కాదు, సుఖం కాదు... వివిధ ఆలోచనలు, బంధాలతో సతమతం అవుతున్న మన మనసుకు ‘ఇది కాదు, ఇది కాదు’ అని ప్రతిదానికి చెప్పుకొంటూ పోతే... ఆలోచనలతో నిండిన పాత్ర ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఆత్మ స్వరూపాన్ని గ్రహించగలుగుతాం’’ అని దాని అర్థం. యోగం అంటే... మనలో ఉన్న కుండలినీ శక్తి మన ఆత్మను ప్రకాశవంతం చేస్తూ... సహస్రార చక్రంలో పరమాత్మను కలవడమే. అటువంటి యోగం పొందాలన్న సద్బుద్ధి జన్మజన్మల పుణ్యఫలం వల్ల వస్తుంది. ఈ జన్మలో కలిగే నిర్మలమైన చిత్తం ద్వారానే అది సాధ్యం. అలాంటి సద్బుద్ధి ఉన్నవారే నిజమైన సత్యసాధకులు. శాంతి అనేది ఉపన్యాసాల వల్ల, ఉపవాసాల వల్ల రాదు. సహజంగా యోగాన్ని పొందడం ద్వారానే, అంటే పరమాత్మతో మనం ఐక్యం అయితేనే... ఆ శక్తి మనలో ప్రసరించి, మనకు ఆనందాన్ని శక్తిని కలుగజేస్తుంది. కుండలిని ఉత్థానం చెంది, ఆ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని, సహస్రార చక్రాన్ని చేరుకున్నప్పుడు... సాధకునిలో ఆత్మ ప్రకాశిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. దాన్ని పొందిన వ్యక్తి... తాను శరీరం, బుద్ధి, రూపం... ఇలా ఏదీ కాదనీ, కేవలం ఆత్మను మాత్రమేననే వాస్తవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. నిరంతర ధ్యానం ద్వారా కులమతాలకు, రాగద్వేషాలకు అతీతుడిగా ఉంటూ... ఆత్మస్వరూపునిగా వ్యక్తం కావడానికి కృషి చేస్తూ ఉంటాడు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 07:22 AM