Sahaja Yoga: ఆ చిక్కుల్లోంచి బయట పడదాం
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:12 AM
మన అంతర్గత సూక్ష్మ నాడీ వ్యవస్థలో... ఆరోగ్యాన్ని సంరక్షించే ఇడా, పింగళ, సుషుమ్న నాడులు, వాటికి అనుసంధానమై ఉండే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధుల పాత్ర చాలా కీలకం. అవి శారీరకంగా, ఆధ్యాత్మికంగా అనేక విధులు నిర్వహిస్తాయి...
సహజయోగ
మన అంతర్గత సూక్ష్మ నాడీ వ్యవస్థలో... ఆరోగ్యాన్ని సంరక్షించే ఇడా, పింగళ, సుషుమ్న నాడులు, వాటికి అనుసంధానమై ఉండే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధుల పాత్ర చాలా కీలకం. అవి శారీరకంగా, ఆధ్యాత్మికంగా అనేక విధులు నిర్వహిస్తాయి. శ్రీ లలితా సహస్రనామాలలో వీటి ప్రస్తావన ఉంది. వాటిలో లలితాదేవిని ‘బ్రహ్మ గ్రంధి విభేదిని’, ‘విష్ణు గ్రంధి విభేదిని’, ‘రుద్ర గ్రంధి విభేదిని’ అని స్తుతించడం జరిగింది. మానవులు వారి స్వభావాన్ని బట్టి, తీరును బట్టి మూడు విధాల చిక్కు సమస్యల్లో ఉంటాయి. వారు పుట్టినప్పటి నుంచే ఈ చిక్కు ముడులు ప్రారంభమవుతాయి. వాటి నుంచి బయట పడాలంటే ఆ ముడులను ఛేదించాలి. వాటిని సంస్కృతంలో గ్రంథులు అంటారు. అవి మనలో అసంబద్ధమైన, అసత్యమైన భ్రమలను కలిగిస్తాయి. శరీరపరంగా చూస్తే... మన సూక్ష్మ శరీర వ్యవస్థలో దాదాపు అన్ని చక్రాలకు లేదా శక్తి కేంద్రాలకు ఏదో ఒక గ్రంధి అనుసంధానమై ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులు ఏయే నాడులకు అనుసంధానమై ఉన్నాయో, వాటిని ఏవి నియంత్రిస్తున్నాయో తెలుసుకుందాం.
అది భగవంతుడికే సాధ్యం
బ్రహ్మ గ్రంధి ఇడా నాడికి అనుసంధానమై ఉంటుంది. ఈ నాడి లక్షణం తమో గుణం. గతాన్ని పట్టుకొని వేలాడడం. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత... మీ చిత్తాన్ని ఆత్మపై లగ్నం చేస్తే... మీ పాత అలవాట్లన్నీ క్రమంగా తొలగిపోతాయి. అప్పుడు మీలో కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా బంధరాహిత్యాన్ని పొందుతారు. దీన్ని ‘బ్రహ్మ గ్రంధి’ అనడానికి కారణం... బ్రహ్మ అంటే చైతన్య శక్తి. అదే ‘ఓం’. మన ఆత్మ ప్రాపంచిక విషయాలపైనా, వస్తు వ్యామోహాల్లో చిక్కుకున్నప్పుడు... మన చిత్తాన్ని భౌతిక అంశాలు కప్పేస్తాయి. అది ఒక స్థాయికి పెరిగి... ఒక ముడి ఏర్పడుతుంది. దీనివల్ల మీరు కేవలం వస్తు ప్రపంచాన్నే చూస్తారు తప్ప ఆత్మను కాదు.
ఈ ముడి పృధ్వీ తత్త్వంతో ఏర్పడుతుంది. సహజయోగ ద్వారా ఆ ముడి నుంచి బయటపడవచ్చు. అది విడిపోగానే కుండలినీ ఉత్థానం ప్రారంభమవుతుంది. ఈ మొదటి ముడి చాలా ముఖ్యమైనది. ఇక... రెండోది విష్ణు గ్రంధి. అంతా మనమే, మన శక్తితో చేస్తున్నామనే అపోహలో ఉంటాం. దాన్ని ‘రజో గుణం’ అంటారు. కుడి పార్శ్వపు పింగళా నాడి లక్షణం రజో గుణం. దానివల్లే మీరు అహంకారంతో పనులు చేస్తారు. ఈ రెండో ముడిని ఛేదించడం భగవంతుడి ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి మనం చేసిన పనిని భగవంతుడికి సమర్పించాలి.
మధ్య మార్గం
మూడోది రుద్ర గ్రంధి. దీనిది సత్వగుణం, అది సుషుమ్నా నాడి లక్షణం. దాని ద్వారానే మనం భగవంతుణ్ణి తెలుసుకుంటాం. దానివల్లనే ఏది మంచో, ఏది చెడ్డో గ్రహిస్తాం. కాబట్టి రజో, తమో గుణాలను విడిచిపెట్టి, సత్వ గుణాన్ని అనుసరించాలి. ఈ ముడి విడిపోయేవరకూ మనకు వివేకం రాదు. ఇది మధ్య మార్గం. ఆ మార్గంలోనే... అంతా భగవంతుడి వల్లనే సాధ్యమవుతుందనే సూక్ష్మమైన విషయాన్ని మనిషి తెలుసుకుంటాడు. సత్యాన్వేషణలో మధ్య మార్గం చాలా విశిష్టమైనది. మూలాధార చక్రంలోని కుండలినీ శక్తి జాగృతమై... సూక్ష్మ శరీరంలోని చక్రాల ద్వారా ప్రయాణిస్తూ, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని, సహస్రారం దగ్గర సర్వ వ్యాపకుడైన భగవంతుడి శక్తితో ఏకమైనప్పుడు... ఆ స్థితిని ‘ఆత్మ సాక్షాత్కారం అంటారు. సహజయోగ ధ్యాన సాధనలో కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు... ఈ మూడు గ్రంధులూ వికసిస్తాయి. తద్వారా వాటిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
డాక్టర్ పి. రాకేష్, 9097097777
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..