Share News

Pallavi Talluri A Rural Girl Tops in AI: ఏఐలో టాప్‌లేపింది

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:51 AM

Rural Girl Tops in Artificial Intelligence Training Receives Certificate from PM Modi

Pallavi Talluri A Rural Girl Tops in AI: ఏఐలో టాప్‌లేపింది

చదివిన చదువుకు మరింత నైపుణ్యాన్ని జోడించాలన్న పట్టుదలతో... ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ధైర్యంగా ముందడుగు వేసింది తాళ్లూరి పల్లవి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ పొంది, జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ అందుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న పల్లవి ‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలివి.

‘‘గ్రామీణ ప్రాంతానికి చెందిన, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడిన నేను చదువులో రాణించి దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సర్టిఫికెట్‌ అందుకుంటానని కలలో కూడా ఊహించలేదు. కానీ చదువుకోవాలన్న సంకల్పం, పట్టుదల, వృత్తి నైపుణ్యం కోసం నేను ఎంచుకున్న మార్గం దాన్ని సాధ్యం చేసింది. మాది ఖమ్మం జిల్లా ఆరెంపల గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. నాన్న తాళ్లూరి రవిప్రసాద్‌ ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌. అమ్మ అజిత గృహిణి. మా అక్క లావణ్య ఎంబీఏ చదివి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. నేను పదోతరగతి వరకు ఖమ్మం రూరల్‌ మండలం నాయుడుపేటలో, ఇంటర్‌ ఖమ్మంలో చదివాను. కిందటి ఏడాది పొన్నెకల్‌లో బీటెక్‌ (సీఎ్‌సఈ) పూర్తి చేశాను. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు... నాకు మరింత నైపుణ్యం అవసరం అనిపించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)కు డిమాండ్‌ ఉంది. ప్రైవేటు సంస్థల్లో ఆ కోర్సు నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని మేము భరించలేం. మరో మార్గం కోసం వెతుకుతున్నప్పుడు... ఒక నోటిఫికేషన్‌ కనిపించింది.


హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ‘నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌’ (ఎన్‌ఎ్‌సటీఐ)లో మహిళల కోసం ఏఐ కోర్సు ఉందని, దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆ నోటిఫికేషన్‌ ఉంది. ఏడాది పాటు ఉండే ఈ కోర్సు ద్వారా వృత్తి నైపుణ్యం సాధిస్తే ఉద్యోగాన్వేషణలో విజయవంతం అవుతానని భావించా. అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఇక్కడ శిక్షణ తీసుకోవడం ద్వారా కొంత ఆర్ధిక వెసులుబాటుతో పాటు ఆ సర్టిఫికెట్‌కు గుర్తింపు ఉంటుందనిపించింది. దరఖాస్తు చేశాను. సీటు లభించింది. ఏడాది శిక్షణ పూర్తి చేశాను. అక్కడే ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించారు. కంప్యూటర్‌ సైన్సు, ఏఐ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, పోటీతత్వం, చేసే పనిలో ఉన్నత ఆలోచనలు తదితర అంశాలతోపాటు పైథాన్‌, డేటాసైన్సు, మిషన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, ఏఐఎంఎల్‌, కంప్యూటర్‌ జనరేటింగ్‌ తదితర కోర్సుల్లో శిక్షణతీసుకున్నా. ఆ తరువాత జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాను మొత్తం 600 మార్కులకు 598 మార్కులు సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచాను.

22-navya.jpg

ఎంతో గర్వంగా ఉంది...

ఎన్‌ఎ్‌సటీఐలో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్ల ప్రదానం ఈ నెల నాలుగున ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది. ఎన్‌ఎ్‌సటీఐ వారే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానం టిక్కెట్లు బుక్‌ చేశారు. నేను విమానం ఎక్కడం అదే తొలిసారి. ఉత్తీర్ణులకు సాధారణంగా కేంద్రమంత్రులే సర్టిఫికెట్‌లు అందజేస్తారు. అయితే టాపర్‌గా నిలిచిన నేను, దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ఉత్తీర్ణులు... ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నాం. ఇది నేను ఏమాత్రం ఊహించని విషయం. ఎంతో మామూలు వ్యక్తిని అయిన నేను దేశ ప్రధానిని కలవడం సాధ్యంకాని పని. కానీ ఎన్‌ఎ్‌సటీఐలో శిక్షణ తీసుకోవడం, టాపర్‌గా నిలవడంతో నాకు ఈ అవకాశం లభించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నన్ను అభినందించారు. ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఐటీ కంపెనీలనుంచి ఉద్యోగ సహకారం ఉంటుందని ఎదురుచూస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలు వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. ఇక్కడే ఉద్యోగం సాధించి, నా తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకుంటున్నా.

నలజాల వెంకటరావు

ఫొటోలు: రవిశంకర్‌

మా అమ్మాయి పల్లవి బీటెక్‌ తర్వాత ఎన్‌ఎస్‌టీఐలో శిక్షణ తీసుకొని, టాపర్‌గా నిలిచి ప్రధానమంత్రి నుంచి సర్టిఫికెట్‌ అందుకోవడం మాకు గర్వంగా ఉంది. ఈ సంగతి తెలిసి ఎంతోమంది మా అమ్మాయితోపాటు మమ్మల్ని కూడా అభినందిస్తున్నారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని కష్టపడి చదివించాం. వారు ఉద్యోగాల్లో స్థిరపడితే అదే మాకు సంతోషం.

పల్లవి తల్లిదండ్రులు రవిప్రసాద్‌, అజిత

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 03:51 AM