ఈ సాయిల్ డాక్టర్ సామాన్యురాలు కాదు
ABN , Publish Date - May 15 , 2025 | 05:45 AM
భూసార పరీక్షలను సులభతరం చేసి, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది, న్యూఢిల్లీకి చెందిన, యువ ఆవిష్కర్త సౌమ్య రావత్. ‘సాయిల్ డాక్టర్’ పరికరాన్ని ఆవిష్కరించి, గ్రామీణ మహిళల సాధికరతకు పాటుపడుతున్న సౌమ్య గురించిన...
విభిన్నం
భూసార పరీక్షలను సులభతరం చేసి, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది, న్యూఢిల్లీకి చెందిన, యువ ఆవిష్కర్త సౌమ్య రావత్. ‘సాయిల్ డాక్టర్’ పరికరాన్ని ఆవిష్కరించి, గ్రామీణ మహిళల సాధికరతకు పాటుపడుతున్న సౌమ్య గురించిన ఆసక్తికరమైన విశేషాలు...
భూమిలో సారం ఉంటేనే పంటలు బాగా పండుతాయి. అధిక దిగుబడి వస్తుంది. సాధారణంగా చాలామంది రైతులకు సారవంతమైన భూమికి ఎలాంటి పోషకాలు అవసరమనే విషయం తెలియదు. నిజానికి భూసార పరీక్ష చేయగలిగితే, భూమికి అవసరమైన పోషకాల మోతాదులు తెలుస్తాయి. దాంతో పంట దిగుబడి పెంచుకోవడంతో పాటు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. అయితే తన రిసెర్చ్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో సౌమ్య రావత్, రైతులు భూసార పరీక్షకు దూరంగా ఉంటున్నారనే విషయాన్ని గ్రహించింది. ప్రజలకు శాస్త్రీయతపై నమ్మకం లేదనీ, భూసార పరీక్షలు రైతులకు అందుబాటు ధరల్లో ఉండడం లేదని కూడా తెలుసుకుంది. ఈ ఇబ్బందులతో పాటు, భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేక, ఫలితాలు కూడా సకాలంలో అందడం లేదని ఆమె గుర్తించింది.
సాయిల్ డాక్టర్ పరికరంతో...
ఈ సమస్యలకు పరిష్కారం కోసం ఆలోచించిన సౌమ్య, ఎకోసైట్ టెక్నాలజీస్ అనే అగ్రిటెక్ కంపెనీని స్థాపించడంతో పాటు, తక్కువ ఖర్చుతో భూసార పరీక్షలు అందుబాటులోకి తెచ్చేందుకు అరచేతి పరిమాణంలో ఉండే సాయిల్ డాక్టర్ పరికరాన్ని కూడా రూపొందించింది. ఈ పరికరంతో అప్పటికప్పుడే భూసార పరీక్ష చేపట్టవచ్చు. నిమిషాల్లోనే నేల స్వభావం, నేలలోని నత్రజని, భాస్వరం, పొటాషియం, పీహెచ్, తేమ వంటి వాటిని గుర్తించి వివరాలు సేకరించవచ్చు. రైతుల ప్రయోజనం కోసం సాయిల్ డాక్టర్‌ను రూపొందించినా దానికి రైతుల ఆమోదం పెద్ద సవాలుగా మారింది. సౌమ్య మాటలను రైతులు విశ్వసించకపోగా, ఆమె స్వలాభం కోసం తన ఉత్పత్తిని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తోందని అనుమానించారు. ఆమె సలహాలు తీసుకునేందుకు కూడా ఏమాత్రం సుముఖత చూపలేదు.
రైతులు మనసు గెలిచిన సాయిల్ దీదీలు
తెలిసిన వారు చెబితేనే రైతులు అర్థం చేసుకుంటారని, నమ్ముతారనే నిర్ణయానికొచ్చిన సౌమ్య, సాయిల్ దీదీ కార్యక్రమానికి శ్రీకారం చూట్టి, గ్రామీణ మహిళలకు సాయిల్ డాక్టర్ గురించి వివరించి, వారికి దానిపై శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అలా శిక్షణ పొందిన ఆ ‘సాయిల్ దీదీ’లు భూసార పరీక్షలు చేసి రైతులకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేవలం సాయిల్ దీదీలతో పరీక్షలు చేయడం ద్వారానే సౌమ్య రైతుల నమ్మకం గెలుచుకోలేదు. ఈ సాయిల్ దీదీలు, నేలకు పరీక్షలు చేపట్టి, కావాల్సిన పోషకాలను సూచించడమే కాకుండా, ఆ తర్వాత ఆ పంటకాలం మొత్తం పంటలను పర్యవేక్షించేవారు. రైతులు తాము సూచించిన ఎరువులు వాడుతున్నారో, లేదో తెలుసుకుంటూ, వాటి ఫలితం ఎలా ఉందని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉంటారు. ఆ విధంగా రైతుల్లో నమ్మకం చూరగొన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఎన్‌జీవోలు, ఎఫ్‌పీవోల ద్వారా సాయిల్ డాక్టర్ వినియోగం ఎంతో బాగా పెరిగింది.
మహిళా సాధికారతతో...
సాయిల్ దీదీ కార్యక్రమం మహిళా సాధికారతకు దోహదపడింది. మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా సాయిల్ డాక్టర్ పరికరాలతో పొలాల్లో పరీక్షలు చేస్తూ ఆదాయంతో పాటు, గుర్తింపు పొందుతున్నారు. సాయిల్ దీదీలు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సొంత వ్యాపారులు చేసుకోవడానికి సౌమ్య రావత్ అవకాశం కల్పించారు. ఇలా సౌమ్య రైతులతో పాటు, మహిళల ఎదుగుదలకు కూడా తోడ్పడింది.
ప్రజలు సాధారణంగా రక్తపోటు, మధుమేహ పరీక్షలు ఎలా తరచూ చేయించుకుంటారో, రైతులు కూడా భూసార పరీక్షలు చేయించాలని, రైతుల్లో అలాంటి మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని ఒక సందర్భంలో సౌమ్య రావత్ అన్నారు. దీని వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతోపాటు ఉత్పాదకత పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు సారవంతమైన నేల అందించవచ్చని ఆమె నమ్మకం.
దేశంలో 80 శాతం కంటే ఎక్కువ మంది రైతులకు 2 హెక్టార్ల(దాదాపు 5 ఎకరాలు) కంటే తక్కువ భూమి ఉంది. రైతులు తమ భూమికి అవసరమైన పోషకాల గురించి తెలియక గుడ్డిగా అధికంగా ఎరువులు వాడుతున్నారు. దీని వల్ల రైతులకు పెట్టుబడి బరమవుతుంది. అలాగే వనరులు వృధా అవడంతో పాటు ఉత్పాదకత తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News