Ironman Woman Achieves Record: ఉక్కు మహిళ
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:14 AM
ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్... ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన దీనిలో పాల్గొనడం, పూర్తి చేయడం ఎందరో అథ్లెట్ల కల. దాన్ని రెండుసార్లు విజయవంతంగా పూర్తిచేసి...
ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్... ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన దీనిలో పాల్గొనడం, పూర్తి చేయడం ఎందరో అథ్లెట్ల కల. దాన్ని రెండుసార్లు విజయవంతంగా పూర్తిచేసి... మన దేశంలో పిన్నవయస్కురాలైన మహిళా ‘ఐరన్‌మ్యాన్’గా చరిత్రకెక్కింది 19 ఏళ్ళ రీనీ నోరోన్హా. వచ్చేనెలలో జరిగే ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’కు అర్హత సాధించిన రీనీ... సవాళ్ళను అధిగమించడంలోనే అసలైన ఆనందం ఉందంటోంది.
‘‘ట్రయథ్లాన్‌లో పాల్గొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. జిమ్నాస్టిక్స్ అంటే నాకు ఆసక్తి. అయిదేళ్ళ వయసు నుంచి అదే నా లోకం. ప్రొఫెషనల్ ఆర్టిస్టిక్ జిమ్నా్‌స్టగా మారిన తరువాత... కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఆలోచనతో రన్నింగ్ అభ్యాసం చేశాను. క్రమంగా ట్రయథ్లాన్ పట్ల ఆసక్తి పెరిగింది. సైక్లింగ్, స్విమ్మింగ్ కూడా మొదలుపెట్టాను. అప్పుడే శంకర్ అనే కోచ్ పరిచయమయ్యారు. ఆయన ‘ఐరన్‌మ్యాన్’ పోటీల గురించి చెబుతూ... వాటిలో పాల్గొనాలంటూ నన్ను ప్రోత్సహించారు. గోవాలో జరిగిన ‘ఐరన్‌మ్యాన్ కిడ్స్’ ఈవెంట్‌లో పాల్గొని మా గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచాను. అది నాలో ఉత్సాహం నింపింది. దాంతో ‘ఒలింపిక్-డిస్టెన్స్ ట్రయథ్లాన్’లో నా సత్తా చాటాలని నిర్ణయించుకున్నాను.
నిగ్గు తేల్చే పరీక్ష
‘ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్’ అనేది చాలామందికి అంతగా పరిచయం లేని అంశం. ఇది కేవలం ఒక రేస్ కాదు. సవాళ్ళు ఎదురైనప్పుడు కలిగే మనం ఎంత వరకూ తట్టుకోగలమో నిగ్గు తేల్చే ఒక పరీక్ష. 3.8 కిలోమీటర్లు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, 180 కిలోమీటర్ల బైక్ రైడ్, 42.2 కిలోమీటర్ల మారథాన్ రన్... ఈ మూడింటి సమ్మేళనం ఈ పోటీ. నిర్ణీత సమయంలో అమన్నీ పూర్తి చేయాలి. అందుకు కేవలం శరీర దారుఢ్యం చాలదు, అపారమైన మానసిక బలం కూడా అవసరం. అదృష్టవశాత్తూ... ఎన్నో ఏళ్ళ నా జిమ్నాస్టిక్స్ నేపథ్యం ద్వారా... క్రమశిక్షణ, చురుకుదనం, నిలకడగా రాణించడం అలవాటయ్యాయి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నిబద్ధతతో ఎలా పని చేయాలో, లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకున్నాను. ట్రయథ్లాన్ వైపు మళ్ళినప్పుడు ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌కు సన్నద్ధత కోసం మొత్తం మూడు విభాగాల్లో శిక్షణ కోసం వారానికి ఇరవై గంటలకు పైగా కేటాయించాను. పోషకాహారం, సరైన నిద్ర, ఫిజియోథెరపీ... ఇవన్నీ నా శరీరం దృఢంగా ఉండడానికి దోహదం చేశాయి. ఇక మానసిక ఒత్తిడిని అధిగమించడం కోసం మొదట్లో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాను. వాటిని అధిగమించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేశాను. అన్నిటికన్నా ప్రధానంగా... నా కుటుంబం, కోచ్, టీమ్ సభ్యులు అండగా నిలిచి ప్రోత్సహించారు.
వారికోసం ఎన్జీవో ప్రారంభిస్తా...
న్యూజిలాండ్‌లో 2023లో తొలిసారిగా ‘ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్’లో పాల్గొన్నాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళ 49 రోజులు. మొత్తం మూడు అంశాలనూ పదిహేడు గంటలలోగా పూర్తి చేయాలి. నేను సుమారు పదహారున్నర గంటలలో ముగించాను. అది పూర్తి చేసిన అతి పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా నిలిచాను. కానీ ఏదో వెలితి. ‘ఇంకా వేగంగా పూర్తి చేయగలను కదా!’ అనిపించింది. మరింత కఠినంగా సాధన సాగించాను. ఈ ఏడాది జులైలో జర్మనీలో జరిగిన ‘ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్’లో కేవలం పధ్నాలుగు గంటల్లోనే మూడు ఈవెంట్లనూ పూర్తి చెయ్యగలిగాను. అంటే మునుపటికన్నా సుమారు రెండున్నర గంటల ముందుగానే. అందరూ నన్ను చూసి ‘ఐరన్‌మ్యాన్’ అని అరుస్తూ ఉంటే నా సంతోషానికి హద్దుల్లేవు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి కృషి చేయడానికి ఈ విజయం నాకు మరింత ప్రేరణ ఇచ్చింది. ప్రస్తుతం నేను చెన్నై ఐఐటిలో డేటా సైన్స్ అప్లికేషన్స్‌లో డిగ్రీ చదువుతున్నాను. అలాగే లండన్‌లోని కార్షల్టన్ కాలేజీ నుంచి స్పోర్ట్స్ సైన్స్ డిప్లమా కూడా చేస్తున్నాను. చదువును, ట్రయథ్లాన్ శిక్షణను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమే. దీనికి నా కుటుంబం ఎంతో సహకరిస్తోంది. ప్రతి ఖండంలోనూ ‘ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్’ పూర్తి చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది అక్టోబర్‌లో అమెరికాలో జరిగే ‘ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షి్‌ప’కు అర్హత సాధించాను. దానికి ప్రస్తుతం సిద్ధమవుతున్నాను. వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల క్రీడలకు దూరమవుతున్న యువ అథ్లెట్లకు, ముఖ్యంగా బాలికలకు సాయపడడం కోసం ఒక ఎన్జీవో ప్రారంభించాలనేది నా ఆశయం.’’
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి