Share News

Sabyasachi: పైథానీకి పూర్వ వైభవం

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:59 AM

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ఇటీవల నిర్వహించిన వేడుకల్లో... బరోడా రాణి రాధిక రాజే గైక్వాడ్‌ తళుక్కుమన్నారు. ఈ వేడుకల్లో ఆమె కట్టుకున్న నలుపు రంగు పైథానీ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెడలో వేసుకున్న పొడవైన హారాల సెట్‌ చీర అందాన్ని ద్విగుణీకృతం చేసింది. దీనికి హుందాతనం తోడై రాజరికదర్పంతో వేడుకల్లో వెలిగిపోయారు రాధిక రాజే.

Sabyasachi: పైథానీకి పూర్వ వైభవం

ఏమిటీ చీర గొప్పదనం?

రాధిక రాజే కట్టుకున్నది వందేళ్లనాటి కాటన్‌ పైథానీ నౌవరీ చీర. అంతేకాదు మహారాష్ట్ర రాజకుటుంబీకుల సంప్రదాయ వస్త్రం. తొమ్మిది గజాల ఈ చీర కొంగు, అంచులని స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. చీర మొత్తాన్ని నూలు దారాలు ఉపయోగించి మగ్గంపై నేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని పైథానీ పట్టణంలోని చేనేత కళాకారులు వీటిని రూపొం దిస్తారు. ఆ ప్రాంతం పేరుతోనే పైథానీ చీరలుగా ఇవి ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వీటిల్లో పట్టు చీరలది ప్రత్యేక స్థానం. ఈ పైథానీ నేత కళ శతాబ్దాల నాటిది. నాణ్యమైన రంగురంగుల దారాలను బంగారు లేదా వెండి పోగులతో కలిపి చీరను నేస్తారు. ఏ రెండు పైథానీ చీరలు కూడా ఒకే రకంగా ఉండవు. వేటికవే వైవిధ్యంగా ఆకట్టుకొంటాయి. అందుకే ఇవి దేశంలోనే అత్యంత ఖరీదైన చీరలుగా పేరు పొందాయి.


ఆమె ఖాతా... చీరల నిధి

రాధిక రాజేకి భారతీయ వారసత్వ చీరలంటే ఎంతో ఇష్టం. ఆమె వద్ద చారిత్రక నేపథ్యంతో ముడిపడిన పురాతన కాలం చీరలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిస్తే చాలు... అక్కడ అపురూపమైన చీరల నిధిని చూడవచ్చు. ఆమె ప్రత్యేకమైన చీర ధరించినప్పుడల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌ చేయడమే కాదు... ఆ చీర ప్రత్యేకత, ఎవరు బహూకరించారు తదితర అంశాలన్నీ వివరిస్తారు. సవ్యసాచి ముఖర్జీ ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఉత్సవంలో రాధిక పాల్గొన్నారు. ఆ ఫొటోలతోపాటు మరొక ఫొటో కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఆమె అందమైన గులాబీ రంగు చీరతోపాటు ఆకుపచ్చని జాకెట్‌ ఽధరించారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాన్ని ఇలా రాసుకున్నారు... ‘‘ఇది తొమ్మిది గజాల జరీ కాటన్‌ పైథానీ చీర. ఈ అందమైన తొమ్మిది గజాల చీర మొత్తం జరీ పువ్వులతో నిండి ఉంది. చీరకు జతగా యాంటిక్‌ ఫ్రెంచ్‌ బ్రొకేడ్‌ బ్లౌజ్‌ వేసుకున్నా! ఈ చీర భారతదేశ వస్త్ర వారసత్వానికి ప్రతీక. ఇండోర్‌ మహారాణి సంయోగిత రాజే ఇలాంటి చీరలు కట్టుకునేవారు. ఈ చేనేత సంప్రదాయ కళ ఇకపై కూడా కొనసాగాలని కోరుకుంటున్నా! నాజూగ్గా ఉంటూ అందమైన పువ్వులు, జరీ మోటిఫ్‌లతో నిండిన టిష్యూ, షిఫాన్‌, కాటన్‌, చందేరీ సిల్క్‌ చీరలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం నౌవరీ (తొమ్మిది గజాలు) చీరలను ఎవరూ కొనడం లేదు. వీటిని ఎక్కువగా అమ్మమ్మలు, బామ్మలు లేదంటే పనివాళ్లు, మత్స్యకారులు కట్టుకుంటున్నారు. వీటికి పూర్వ వైభవం తెచ్చేందుకే ఈ ప్రయత్నం.’’

గతంలో కూడా...

రాధిక రాజే ఈ నలుపు రంగు కాటన్‌ పైథానీ చీరని గతంలో కూడా ఓసారి ధరించారు. అప్పట్లో ఓ మ్యాగజైన్‌ కవర్‌ షూట్‌ నిమిత్తం ఆమె ఈ చీర కట్టుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఈ చీర గురించి చెబుతూ ఇది అత్యంత అరుదైన చీర అనీ, తనకు చాలా ప్రీతిపాత్రమైనదనీ, ఇలాంటి చీరలు ప్రస్తుతం లభ్యం కావట్లేదనీ వివరించారు.


ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:59 AM