Share News

Eye Strain: తెరలతో తంటా

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:59 AM

డిజిటల్‌ స్క్రీన్ల ఎక్కువ వినియోగం వల్ల కళ్లకు మంట, పొడిబారటం, మైనస్‌ పవర్‌ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన దూరం, స్క్రీన్‌ టైమ్‌ నియంత్రణ, విరామాలు, నీలి కిరణాల ఫిల్టర్లు వంటి జాగ్రత్తలతో కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు.

Eye Strain:  తెరలతో తంటా

డిజిటల్‌ స్ర్కీన్స్‌ మన జీవితంలో భాగాలైపోయాయి. గంటల తరబడి కళ్లను తెరలకు అప్పగించకపోతే రోజు గడవని పరిస్థితి. అయితే ఈ జీవనశైలితో కళ్లకు కీడు కలుగుతోందా? వైద్యులేమంటున్నారు?

ళ్లు పొడిబారడం, కళ్ల మంటలు, ఎరుపెక్కడం, నీరు కారడం, కనుబొమల నొప్పులు... ఇవన్నీ డిజిటల్‌ స్ర్కీన్స్‌ వాడకంలో మనం చేసే పొరపాట్లకు సంకేతాలు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టివిలు మన జీవితంలో భాగాలైపోయినప్పుడు, వాటిని వినియోగించుకుంటూనే కళ్లు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండాలి. ఏ స్ర్కీన్‌ ఎంత దూరంలో ఉండాలి? వాటిని ఎంత సమయం పాటు చూడాలి? ఎంత వ్యవధికి బ్రేక్‌ తీసుకోవాలి? కళ్లు అలసటకు లోను కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది కూడా తెలుసుకోవాలి.

నీలి కిరణాలను వడగట్టి...

పుస్తకం చదివేటప్పుడు కళ్లకు ఎంత దూరంగా ఉంచుకుని చదువుతామో, మొబైల్‌ ఫోన్లను కూడా అంతే దూరంలో ఉంచి వాడుకోవాలి. అయితే ఇటీవలి కాలంలో పిల్లలు సెల్‌ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడిపోతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. నిజానికి ఆరేళ్ల వరకూ పిల్లల కనుగుడ్లు అభివృద్ధి దశలోనే ఉంటాయి. కాబట్టి ఈలోగా అతిగా మొబైల్‌ ఫోన్లకు అలవాటు పడడం వల్ల పిల్లల్లో మెల్లకన్ను తలెత్తుతుంది. పెద్దలైనా అదే పనిగా రెండు గంటలకు మించి సెల్‌ఫోన్‌ వాడడం కళ్లకు హానికరం. ఆ రెండు గంటల్లో ప్రతి అరగంటకూ విరామం తీసుకోవాలి. పిల్లల విషయానికొస్తే, రోజు మొత్తంలో, బడిలో, ఇంట్లో కలిపి, రెండు గంటలకు మించి స్ర్కీన్స్‌ చూడకూడదు. ఈ రెండు గంటల్లో ప్రతి 20 నిమిషాలకూ బ్రేక్‌ ఇవ్వాలి. పిల్లలకు సెల్‌ఫోన్స్‌ ఇచ్చేటప్పుడు, అలారం, స్ర్కీన్‌ కంట్రోల్‌ టైమ్‌ సెట్‌ చేసి ఇవ్వడం మంచిది. వీటితో పిల్లల సెల్‌ఫోన్‌ వాడకాన్ని పరిమితం చేయవచ్చు. గేమ్స్‌ ఆడేటప్పుడు పిల్లలు మొబైల్‌ఫోన్‌ను కళ్లకు మరీ దగ్గరకు తీసుకొచ్చేస్తూ ఉంటారు. దీంతో కళ్లలో మైనస్‌ పవర్‌ పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దలు పిల్లలను కట్టడి చేయాలి. మరీ ముఖ్యంగా డిజిటల్‌ స్ర్కీన్స్‌ నుంచి వెలువడే నీలి కిరణాల వల్ల కంటికి హాని కలుగుతుంది.

h.jpg

కాబట్టి ఆ కిరణాలను అడ్డుకునే ఫిల్టర్లను ఫోన్లు, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్స్‌లో ఉపయోగించాలి. కళ్లజోడు అలవాటున్న వాళ్లు ఆ కిరణాలను అడ్డుకునే పూత కలిగిన జోళ్లను వాడుకోవాలి. అలాగే టివిలకు కనీసం 20 అడుగుల దూరం పాటించాలి. సాధారణ వెలుగులోనే టివి చూడాలి తప్ప, కిటికీలు, తలుపులు మూసేసి, లైట్లు ఆర్పేసి చీకట్లో టివి చూడడం సరి కాదు.


20-20-20 నియమం

ప్రతి 20 నిమిషాలకూ 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడవలసిన నియమమిది. దగ్గర్లో ఉన్న తెరలను చూస్తున్నప్పుడు కళ్లలోని కండరాలు అలసటకు లోనవుతాయి కాబట్టి ప్రతి 20 నిమిషాలకూ 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడగలిగితే, కంటి కండరాలు రిలాక్స్‌ అవుతాయి.

ఏం చేయాలి?

కళ్లు అలసటకు లోనై పొడిబారినా, మండుతున్నా, నీరు కారుతున్నా మానిటర్ల వాడకం ఆపేసి, 20-20-20 నియమం అనుసరించాలి. దీంతో ఫలితం లేనప్పుడు కంటి వైద్యులను కలిసి, వాళ్లు సూచించే కంటి చుక్కల మందులు వాడుకోవాలి. వీటితో పొడిబారిన కళ్లు తేమగా మారతాయి. ఈ చుక్కల మందును ఫ్రిజ్‌ డోర్‌లో దాచుకుని వాడుకోవాలి. అలాగే ఈ చుక్కల మందును ఒకసారి మూత తెరిచి, వాడడం మొదలుపెట్టిన తర్వాత నెల రోజుల వరకూ వాడుకుని, మిగతా మందును పారేయాలి. దాచుకుని వాడుకోకూడదు.

అయితే ఈ చుక్కల మందును ఎవరికి వారు కొనుక్కుని వాడుకోవడం సరి కాదు. కంటి సమస్యలకు కారణం స్ర్కీన్స్‌ మాత్రమే అని నిర్థారించలేం! ఇతరత్రా కంటి సమస్యల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వైద్యులు సూచించినప్పుడు మాత్రమే వీటిని వాడుకోవాలి.

ఇలాంటప్పుడు అప్రమత్తం కావాలి

  • స్ర్కీన్‌ చూస్తున్న అరగంటకే కళ్లు మసకబారుతున్నా...

  • ఒకటికి రెండు చిత్రాలు కనిపిస్తున్నా...

  • కళ్లు ఎర్రబడి, నీళ్లు కారుతున్నా...

  • పిల్లల్లో మెల్లకన్ను మొదలైనా...

  • పిల్లలు తెరను చూడడం మొదలుపెట్టిన అరగంటకే తలనొప్పి మొదలైనా...

  • పిల్లలు రాయడానికి ఇబ్బంది పడుతున్నా...

  • పెద్దలు ఫాంట్‌ సైజు పెంచవలసిన అవసరం పడుతున్నా...

డాక్టర్‌ ఎమ్‌. నిఖిల,

కన్సల్టెంట్‌ ఆప్తల్మాలజిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:01 AM